విషయానికి వెళ్ళండి

రాజకీయాల్లోకి మెట్రో మ్యాన్ శ్రీధరన్

25/03/2021

ఇ. శ్రీధరన్, ఈ పేరు తెలియని సివిల్ ఇంజనీర్ బహుశా ఇండియాలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. మన దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థని ఆధునీకరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. దేశంలోని చాలామంది సివిల్ ఇంజనీర్లకు ఈయన ఆదర్శం. అర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కె. ఎల్. రావు లాంటి మహామహుల తరువాత మన దేశంలో అంత ప్రఖ్యాతమయిన సివిల్ ఇంజనీర్ శ్రీధరన్ గారే  అని చెప్పవచ్చు. నేను దిల్లీలో పని చేస్తున్నప్పుడు ఒకసారి ఆయనని కలిసే అవకాశం వచ్చింది. మా కంపెనీ ఎం. డి. తో కలిసి శ్రీధరన్ గారిని ఆయన చాంబర్లో కలిసాను. 

88 ఏళ్ళ వయసు దాటిన మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆయన బిజెపి తరపున పాలక్కాడ్ నుండి పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో బిజెపికి అధికారం వస్తే ముఖ్యమంత్రి అవడానికి కూడ ఆయన ఆసక్తి చూపించారు. ఇలాంటి ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావడం దేశానికి మంచిదే కాని, ఇంత లేటుగా రావడం వల్ల ప్రయోజనం ఏమిటన్నదే ప్రశ్న. ఆయన ఈ నిర్ణయం కనీసం పది, పదిహేనేళ్ళ ముందే తీసుకుని ఉంటే బాగుండేది.

పద్మ విభూషణ్ డాక్టర్ ఎలట్టువలపిల్ శ్రీధరన్ 1932లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించారు. మన కాకినాడ ఇంజనీరింగ్ కాలేజి నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ సంపాదించి ఇండియన్ రైల్వే సర్వీస్‌లో చేరారు. రామేశ్వరం వద్ద 1964 ఉప్పెనలో దెబ్బతిన్న పంబన్ వంతెనని 46 రోజుల్లో పునరుద్ధరుంచి అవార్డు అందుకున్నారు. రైల్వే శాఖ నుండి రిటైర్ అయిన తరువాత ప్రభుత్వం ఆయనకు కొంకణ్ రైల్వే నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. కొంకణ్ రైల్వే మన దేశంలో మొదటి BOT రైల్వే ప్రాజెక్ట్. చాలా క్లిష్టమయిన మార్గంలో నిర్మించబడ్డ ఈ ప్రాజెక్టుని విజయవంతంగా పూర్తి చేయడంతో శ్రీధరన్ పేరు దేశం అంతా తెలిసింది.

1997లో ప్రభుత్వం ఆయనను దిల్లీ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆయన సారధ్యంలో దిల్లీ మెట్రో, తన మొదటి లైనుని 2002లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా ప్రారంభించింది. ఆ విజయం వెనుక శ్రీధరన్, ఆయన టీం కార్యదక్షతతో పాటు, అప్పటి ప్రధాని వాజ్‌పేయి, అప్పటి దిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇచ్చిన స్వేఛ్చ, సహకారం కూడ ఉన్నాయి. పార్టీలకతీతంగా ఆ ఇద్దరు నాయకులు శ్రీధరన్ గారికి పూర్తిగా సహకరించారు. తనని స్వేఛ్చగా పని చేసుకోనిస్తేనే తనకి బాధ్యత ఇవ్వాలని, లేకుంటే అక్కరలేదని ఆయన గట్టిగా చెప్తారని అంటారు. దిల్లీ మెట్రో విజయం తరువాత దేశంలోని అనేక మహా నగరాలు మెట్రో ప్రాజెక్టులు ప్రారంభించాయి. ఆ విధంగా చూస్తే శ్రీధరన్ దేశంలోని మెట్రో ప్రాజెక్టులకి మార్గదర్శనం చేసినట్టు అనుకోవాలి. అందుకే ఆయనను మెట్రో మ్యాన్ అని గౌరవంగా సంభోదిస్తారు. 2011 లో దిల్లీ మెట్రొ నుండి రిటైర్ అయ్యాక, శ్రీధరన్ తన స్వరాష్ట్రమయిన కేరళలో కొచ్చి మెట్రోకి సలహాదారుగా పని చేసారు.

ముంబయి, అహ్మదాబాదుల మధ్య నిర్మించబోతున్న హై స్పీడ్ రైల్వేని (బులెట్ ట్రైన్) చాలా ఖరీదైన వ్యవహారంగా శ్రీధరన్ అభివర్ణించారు. అది సామాన్యులకి అందుబాటులో ఉండదని శ్రీధరన్ అభిప్రాయం. అలాంటి ఖరీదైన ప్రాజెక్టుల బదులు భారతీయ రైల్వేలని త్వరగా అధునీకరిస్తే మంచిదంటారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో హైదరాబాదు మెట్రోని ప్రైవేట్ కంపెనీ, మేటాస్‌కి ఇవ్వడాన్ని కూడ శ్రీధరన్ వ్యతిరేఖించారు. ఇది ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టడమే అని అప్పట్లో అన్నారు. ఇప్పుడు అదే శ్రీధరన్, ప్రైవేటైజేషన్‌ని యధేచ్చగా ప్రోత్సహిస్తున్న బిజెపిలో చేరడం యాధృచ్చికం!

అయితే కేరళలో బిజెపి బలం చాలా తక్కువ. ప్రస్తుత అసెంబ్లీలో ఆ పార్టీకి ఒకే ఒక సభ్యుడు ఉన్నాడు. ఒపీనియన్ పోల్స్ ప్రకారం, వచ్చే ఎన్నికలలో కూడ బిజెపికి 5 సీట్లు మించి రాకపోవచ్చు. మరి శ్రీధరన్ తన స్థానం గెలుచుకున్నా పెద్దగా చెయ్యగలిగేదేమీ ఉండదు. ఒక పది, పదిహేనేళ్ళ ముందే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉంటే, బహుశా మంచి ఫలితం ఉండేదేమో? లేకపోతే ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం శ్రీధరన్ గారిని రాజ్యసభకి పంపిస్తుందేమో చూడాలి. ఏమైనా ఒక సివిల్ ఇంజనీరుగా శ్రీధరన్ గారికి నా శుభాకాంక్షలు అందచేస్తూ, మరింత మంది ప్రొఫెషనల్స్ రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నాను.

రత్నాలు, పద్మాలు

07/02/2021

గత నెలలో రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం చాలా మంది ప్రముఖులకి పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులోనే తెలుగువాడైన స్వర్గీయ బాలసుబ్రమణ్యం గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. ఆయనకు తమిళనాడు రాష్ట్రం తరపు నుండి ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మరో ముగ్గురికి పద్మశ్రీ ఇచ్చారు. వారు ఎవరంటే అన్నవరపు రామస్వామి, ఆశావాది ప్రకాశరావు మరియు నిడుమోలు సుమతి గార్లు. తెలంగాణా రాష్ట్రం నుండి కనకరాజు గారికి కూడ పద్మశ్రీ  ఇచ్చారు. ఈ సారి భారతరత్న ఎవరికీ ఇవ్వలేదు. ఈ అవార్డుల గురించి మరింత సమాచారం కావాలంటే https://padmaawards.gov.in/  వెబ్ సైట్ చూడవచ్చును.

అయితే మన దేశంలో అన్నిచోట్లా రాజకీయాలు ఉన్నట్లే ఈ అవార్డుల్లో కూడా రాజకీయాలు చోటుచేసుకున్నాయని చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీల అస్మదీయులకు ఈ పురస్కారాలు త్వరగా ఇస్తారన్న అభిప్రాయం కూడ ఉంది. ఈ అవార్డుల కోసం కొంత మంది పైరవీలు చేస్తారని కూడ అంటారు. ఈ అవార్డులకున్న క్రేజ్ అలాంటిది.

అయితే ఈ పురస్కారాలు అందుకున్నవారు అందుకు తగ్గ హుందాగా ప్రవర్తించకపోవడం సరికాదని నా అభిప్రాయం. ఉదాహరణకి దేశ అత్యున్నత గౌరవం, భారతరత్న అందుకున్న సచిన్ టెందూల్కర్ విషయం తీసుకోండి. ఆయన ఇప్పటికీ మీడియాలో అనేక వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తున్నాడు. నాకు తెలిసి గతంలో భారతరత్న అందుకున్నవారెవరూ వ్యాపార ప్రకటనలలో కనిపించలేదు. కేవలం సమాజానికి ఉపయోగపడే, సదవగాహన కలిగించే ప్రభుత్వ ప్రకటనలలోనే కనిపించారు. సచిన్ అద్భుతమైన క్రీడాకారుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. కాని ఒక గొప్ప స్థాయికి చేరుకున్న తరువాత ఆ స్థాయికి తగ్గట్టుగానే నడుచుకుంటే బాగుంటుంది. ఈ క్రింది చిత్రం చూడండి.

Paytm FIRST GAMES కి సచిన్ బ్రాండ్ అంబాసిడర్. అందులో క్రికెట్, ఫుట్ బాల్ లాంటి ఫాంటసీ ఆటలతో పాటు, రమ్మీ, హార్స్ రేసింగ్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ బెట్టింగ్ గేమ్స్. ఇప్పుడు ప్రతీవాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. సాధారణ ప్రజలు ఇలాంటి ఆటలకి అలవాటు పడితే, బోలెడన్ని డబ్బులు పోగొట్టుకుంటారు. వీటికి కొన్ని రాష్ట్రాలలో అనుమతి కూడ లేదు. మామూలు ప్రకటనలలో నటించడమే కాకుండా, ఇలాంటి ఆటలని కూడ ప్రోత్సహించడం భారతరత్న సచిన్ కి తగునా? అలాగే గంగూలీ, ధోనీ మొదలైన క్రికెటర్లు కూడ ఇటువంటి ఫాంటసీ క్రీడల యాప్స్‌కి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు కూడ పద్మ అవార్డులు తీసుకున్నవాళ్ళే.

ఇక ప్రముఖ హిందీ హీరో అజయ్ దేవగన్ సంగతి చూడండి. ఈయన మరో అడుగు ముందుకు వేసి పాన్ మసాలా ప్రకటనలో కూడ కనిపిస్తాడు. ఈయనకి కూడ ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం పాడు చేసే పాన్ మసాలాని ప్రోత్సహించే ఈయనకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం సమంజసమా?

ఇంక మిగతా వాళ్ళ సంగతి చూస్తే అమితాబ్ నుండి చిరంజీవి వరకు మన దేశంలోని సూపర్ స్టార్లు అందరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసినవాళ్ళే. అదే కాక ఇంకా అనేక రకాల విలాస వస్తువుల ప్రకటనలలో నటించినవాళ్ళే. వీళ్ళలో చాలామంది పద్మ పురస్కారాలు అందుకున్నవాళ్ళే.

నా అభిప్రాయం ఏమిటంటే ఈ పురస్కారాలు అందుకున్నవాళ్ళెవ్వరూ ఇక ముందు ఎటువంటి వాణిజ్య ప్రకటనలలోనూ నటించకూడదని నియమం పెట్టాలి. అప్పుడే ఈ అవార్డులకున్న విలువ పెరుగుతుంది. అప్పుడే సెలబ్రిటీలు, లిజండరీలు ఈ అవార్డుల కోసం వెంపర్లాడడం కూడ తగ్గుతుంది. ముందుగా కనీసం భారతరత్న విషయంలోనైనా ఈ నిబంధన పెడితే బాగుంటుంది.

రైలు ఎక్కని సంవత్సరం

22/01/2021

రైలు ప్రయాణం అంటే చిన్నప్పటినుండి అందరికీ సరదాయే. ప్రతీ ఏటా మనం కనీసం ఓ పది సార్లయినా రైలు ప్రయాణం చేస్తాము. ఉద్యోగరీత్యా ప్రయాణించేవాళ్ళు ఇంకా ఎక్కువ సార్లు రైలు ఎక్కవలసి ఉంటుంది. మన దేశంలో నూటికి తొంభయి మందికి ట్రైనే ముఖ్యమయిన ప్రయాణ సాధనం మరి!

అలాంటిది, గడిచిన 2020 సంవత్సరంలో నేను ఒక్క సారి కూడ రైలు ఎక్కలేదు. నాకు ఊహ తెలిసి గత నలభయి సంవత్సరాలలో నేను రైలు ఎక్కని సంవత్సరం ఇదే అయ్యుంటుంది. నేనే కాదు, చాలామంది భారతీయులు గత సంవత్సరం రైలు ఎక్కి ఉండరు. గత ఏడాది జనవరి ఒకటికి నేను విజయవాడలో ఉన్నాను. రెండు రోజుల తరువాత బెంగళూరు వచ్చాను. రైల్లో రిజర్వేషన్ దొరకకపోవడంవల్ల విమానంలో రావాల్సివచ్చింది. తరువాత ఫిబ్రవరిలో ఆఫీసు పని మీద గోవాకి విమానంలోనే వెళ్ళి వచ్చాను. ఇక ఆ తరువాత మార్చి నుండి ఎక్కడికీ వెళ్ళలేదు.     

మార్చి నెల నుండి దేశంలో కరోనావైరస్ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. మానవజాతి మనుగడకే కామా పెట్టింది కరోనావైరస్. గత మార్చి నెలాఖరు నుండి దేశంలో రైళ్ళు ఆగిపోయాయి. బహుశా భారతీయ రైల్వే చరిత్రలో ఇలా ఎప్పుడూ జరిగి ఉండదు. తరువాత దశలవారీగా రైళ్ళని పునరుద్ధరించినా ప్రయాణికులు రైళ్ళు ఎక్కడానికి భయపడుతూనే ఉన్నారు. కొంత మంది ప్రజలు కూడ ప్రభుత్వం చెపుతున్న నియమ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రయాణిస్తున్నారు. ఆ నిర్లక్ష్యం వలన ఇతరులకే కాకుండా, వాళ్ళకు కూడ ప్రమాదమే అని గుర్తించడంలేదు.

నేను వీలైనంతవరకూ 2020 సంవత్సరం ముగిసే వరకూ ఎక్కడికీ ప్రయాణించకూడదనే అనుకున్నాను. కాని డిసెంబరులో హఠాత్తుగా రెండు సార్లు ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. భయపడుతూనే, వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, తక్కువ సమయం పడుతుందని విమానంలోనే ప్రయాణం చేసాను. రైల్లో అయితే 12 గంటలు పైగా పట్టే ప్రయాణం, విమానంలో గంటలో అయిపోతుంది కదా!

ఇప్పుడు 2021 వచ్చింది. అయినా ఇంకా రైల్లో వెళ్ళాలంటే భయంగానే ఉంది. ఈ నెలలో కూడ ఒక సారి విమానంలోనే ప్రయాణం చేసాను. ఇప్పుడు కరోనా కేసులు బాగా తగ్గాయి. అలాగే వైరస్‌కి టీకాలు వెయ్యటం కూడ మొదలయ్యింది కాబట్టి, బహుశా కొన్ని నెలల తరువాత రైల్లో ప్రయాణించడానికి భయపడాల్సిన అవసరం ఉండదనుకుంటున్నాను. ఏమైనా 2020 ఎన్నో వింతలు, విశేషాలతో పాటు చాలామంది రైలు ఎక్కని సంవత్సరంగా కూడ రికార్డు సృష్టించింది.