విషయానికి వెళ్ళండి

నెం. 481 ఫాస్ట్ పాసింజరు.

10/04/2010

నేను మనదేశంలోని ఎన్నో ప్రాంతాలు తిరిగాను. ఎన్నో రైళ్ళలో ప్రయాణించాను.
ఇంతవరకు ప్రయాణించిన రైళ్ళలో ఎక్కువసార్లు ప్రయాణించింది ఈ నెం. 481 ఫాస్ట్ పాసింజరులోనే.
మీరు ఎక్కువసార్లు ప్రయాణించిన రైలు మీకు గుర్తుకువస్తోందా?
ఈ రైలు గుంటూరు నుండి మా వూరు నరసాపురం వెళుతుంది.

 

సుమారు ఇరవయ్యేళ్ళ క్రితం సంగతి. అప్పుడు నేను విజయవాడ లోని సిధ్ధార్థ ఇంజనీరింగు కాలేజిలో చదివేవాడిని.
నాలుగేళ్ళలో కనీసం వందసార్లు ఈ రైలు ఎక్కి వుంటాను.
మొదట్లో ప్రతీ ఆదివారం మా వూరు వెళ్ళేవాడిని. తరువాత వారం విడిచి వారం వెళ్ళేవాడిని.
ఎప్పుడు వెళ్ళినా ఈ రైలులోనే వెళ్ళేవాడిని. విజయవాడలో సాయంత్రం సుమారు ఆరింటికి బయలుదేరేది.
ఈ రైల్లో ఎప్పుడూ కనపడే ఒక గుడ్డి భిక్షగాడి పాట మాత్రం ఇప్పటికీ గుర్తు ఉంది నాకు.
“ఇల్లు నాదంటావు డబ్బు నాదంటావు నీ ఇల్లు ఎక్కడే చిలకా” అని ఏవొ తత్వాలు పాడేవాడు.
మీలో ఎవరైనా ఈ రైల్లో ప్రయాణించి ఉంటే మీకు కూడా అతని పాట గుర్తుండే వుంటుంది.
అతను గుడివాడ దగ్గర దిగిపోయేవాడనుకుంటాను.

గుడివాడ వరకు చాల మంది ఉద్యోగులతో కిక్కిరిసి ఉండే రైలు తరువాత కొంత ఖాళీ అయిపోతుంది.
భీమవరం తరువాత మూడొంతులు ఖాళీ అయిపోయేది.
ఇక పాలకొల్లు తరువాత బోగీకి నలుగురయిదుగురు మాత్రమే ఉండేవారు.
మా వూరు నరసాపురం చేరేటప్పటికి పదకొండు దాటేది.
ఈ అయిదు గంటల ప్రయాణం కేవలం 140 కిలోమీటర్ల దూరానికే.
అంటే మీకర్థమయిందనుకొంటాను ఈ రైలు ఎంత ఫాస్టో.

నేను కొన్నిసార్లు శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో న్యూడిల్లీ నుండి కాన్ పూర్ వెళ్ళాను.
శతాబ్ది ఎక్స్ ప్రెస్ 440 కిలోమీటర్ల దూరాన్ని కేవలం అయిదు గంటలలోపు పూర్తిచేస్తుంది.
దూరప్రాంత రాజధాని రైళ్ళు ఇదే ప్రయాణాన్ని ఇంకా వేగంగా పూర్తిచేస్తాయి.
దాన్నీ దీన్నీ పొల్చలేముకాని, మరీ ఇంత తేడానా?

యేడాది క్రితం అనుకుంటా మళ్ళీ ఈ రైల్లో వెళ్ళాను. అయినా అదే పరిస్థితి.
ఈ రైలు గుడివాడ దాటడానికే సుమారు రెండు గంటలు పడుతుంది.
ఎందుకంటే ఈ బ్రాంచ్ లైను అంతా సింగిల్ లైనే.
ఈ రూటులో ఎన్నొ కొత్త రైళ్ళు వేసారు కాని డబల్ లైను మాత్రం ఇప్పటికీ వేయలేదు.
కనీసం విజయవాడ నుండి గుడివాడ వరకైనా రెండు లైన్లు వేస్తే ఎంతొ సమయం ఆదా అవుతుంది.

ఈ ప్రాంతం నుండి ఎంతొ మంది సివిల్ కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులయ్యారు.
కానీ ఎవరూ పట్టించుకోరు. కనీసం వాళ్ళ కాంట్రాక్టుల కోసమైనా రెండో లైను మంజూరు చేయించవచ్చుకదా.
గుడివాడ నుండి ఉయ్యూరు మీదుగా తెనాలికి ఒక లింకు లైను నిర్మిస్తే ఇక్కడనుండి గూడూరు వైపు వెళ్ళే రైళ్ళు త్వరగా వెళతాయి.
అలాగే విజయవాడ స్టేషనుకి రద్దీ తగ్గుతుంది.
ముఖ్యమంత్రి గారు తెనాలి ప్రాంతం వాళ్ళే కాబట్టి ఆయన ప్రయత్నిస్తే బాగుంటుంది.
కైకలూరు నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరములో ఉన్న ఏలూరు కి లింకు లైను నిర్మించినా ప్రయోజనం ఉంటుంది.
అత్యాశే కాని, బాపట్ల నుండి రేపల్లె, మచిలీపట్నం, నరసాపురం, కోటిపల్లి, కాకినాడ మీదుగా పిఠాపురం వరకు కొత్త రైల్వే లైను వేస్తే తీరప్రాంతం అంతా అభివృధ్ధి చెందుతుంది.

 

2 వ్యాఖ్యలు leave one →
  1. 10/04/2010 17:36

    మేము రాజోలులో ఉండే రోజుళ్ళో పాలకొల్లులో ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్ళేవాడిని. పాసింజర్ కి, ఫాస్ట్ పాసింజర్ కి తేడా ఏమిటని ఒక రైల్వే అధికారిని అడిగాను. ఫాస్ట్ పాసింజర్ కొన్ని స్టేషన్లలో ఆగదు అంతే కానీ స్పీడ్ లో తేడా ఏమీ ఉండదు అని సమాధానం చెప్పాడు.

Trackbacks

  1. వరద ప్రయాణం | ఆలోచనాస్త్రాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: