“తాయిల” నాడు
27/03/2011
తాయిల నాడు ఎక్కడ ఉందా? అనుకుంటున్నారా? ఎక్కడో లేదండి. మన పక్కనే ఉన్న తమిళనాడే.
తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఇన్నాళ్ళూ, ప్రజలమీద దాచుకున్న ప్రేమని ఒక్కసారిగా ఒలకపోస్తూ, ఒకరిని మించి ఇంకొకరు పోటాపోటీగా తాయిలాలు ప్రకటించేస్తున్నారు.
గత ఎన్నికల్లో కలర్ టీవీలు ఇస్తామన్నారు. చాలామందికి ఇచ్చారట.ఈసారి కేబుల్ కనెక్షన్ ఇస్తారట.
అలాగే బియ్యం, మినరల్ వాటర్, మిక్సీలు, గ్రైండర్లు ఇంకా పెళ్ళిళ్ళకి బంగారం ఇలా చాలా ఇస్తారట.
ఇవేకాదు విధ్యార్థులకి లాప్ టాప్ కూడా ఇస్తారట.
అన్ని ఉచితమే. ఆల్ ఫ్రీ అన్న మాట.
ఇంకా నయం జె పి గారు వాపోయినట్లు మందు కూడా ఫ్రీ అనలేదు.
ఇకపై తమిళనాట ప్రజలు ఒక రేషన్ కార్డు, వోటర్ కార్డు సంపాదిస్తే చాలు. కాలు మీద కాలు వేసుకుని బతికేయవచ్చు.
ఇంక దేశం లోని పేదలందరూ చలో తమిళనాడు అంటారేమో?
ఇప్పటికే NREGA పథకం పుణ్యమా అని వ్యవసాయానికి, నిర్మాణరంగానికి కూలీలు దొరకట్లేదు.
ఇక అన్నీ ఉచితంగా ఇస్తే ఎవడు పని చేస్తాడు?
చిన్నప్పుడు మనచేత చిన్న చిన్న పనులు చేయించడానికి పెద్దవాళ్ళు లడ్డూలో, జామపళ్ళో, చాకొలెట్లో ఇంకోటో తాయిలం ఆశ చూపించేవాళ్ళు.
ఒకోసారి డబ్బులు కూడా (సినిమాలకో, హోటళ్ళకో) ఇచ్చేవారు. బాగా చిన్నప్పుడు మాకు తాయిలం అన్న పదమే తెలీదు. చక్కగా “అప్పచ్చి” అనేవాళ్ళం.
ఈ తాయిలాన్నే మిస్సమ్మ సినిమాలో తైలం అని రేలంగి ముద్దుగా పిలుస్తాడు. రావుగోపాలరావు బహుమానం అని, నైవేద్యం అని అన్నా, రాజబాబు అమ్యామ్యా అని అన్నా, అర్థం లంచమే. కాని ఎవరూ లంచం అని ఒప్పుకోరు.
ఇప్పుడు తమిళ వోటరు దేవుళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు తాయిలాల నైవేద్యం పెడుతున్నాయి.
దేవుడు ఎప్పుడూ నైవేద్యం తిననట్టు నిజానికి ప్రజలు తినేది గోరంతే. ఆ పథకాల ముసుగులో నాయకులు, అధికారులు భోంచేసేదే కొండంత.
ఒక్క రాజకీయ పార్తీ అయినా మేము ఉద్యోగాలిప్పిస్తాం, మంచి పరిపాలన ఇస్తాం, స్కాములు చెయ్యం అని చెపుతుందా?
అబ్బే! అంత ఆశ లేదంటారా? అదీ నిజమే. ఏం చేస్తాం? పన్నులు కట్టడం తప్ప మనం ఏమీ చేయలేం.
No comments yet