సుమారు పాతికేళ్ళ కిందటి సంగతి. అప్పుడు నేను హైస్కూల్లో చదువుతున్నాను. ఎవరో చెప్పేవారు, ఊళ్ళోకి కిరసనాయిలు టాంకరు వచ్చిందని. అంతే, అందరూ తలో అయిదు లీటర్ల డబ్బా పట్టుకుని స్కూలు మానేసి కిరోసిన్ డిపో దగ్గర క్యూలో నుంచునేవాళ్ళం. ఒక పూటంతా నుంచుంటే ఒక డబ్బా కిరోసిన్ దొరికేది. ఒకోసారి అది కూడా లేదు. అప్పట్లో, ఇప్పటిలా ప్రతి ఇంట్లో గాస్ స్టవ్వులుండేవి కావు. కట్టెలు, బొగ్గులు, రంపపు పొట్టు లాంటివాటితో పొయ్యి వెలిగేది. హటాత్తుగా కాఫీ పెట్టడం లాంటి అవసరాలకి కిరోసిన్ స్టవ్ వాడేవాళ్ళు. కొన్నాళ్ళకి గాస్ స్టవ్వులు అందరికీ అందుబాటులోకి వచ్చాకా, కిరోసిన్ అవసరం తగ్గిపోయింది.
ఇలాంటి క్యూలతో పాటు కరెంట్ బిల్లు కట్టడానికి, బాంకుల్లో డబ్బు తీసుకోవడానికి, వెయ్యడానికి, డిడిలకి క్యూ తప్పేది కాదు. స్టేట్ బాంకులో టెల్లర్ కౌంటర్ దగ్గర క్యూలో నుంచోవడం నరకమే. రైల్వే టికెట్లకి, రిజర్వేషనుకి చాంతాడంత క్యూలు ఎలాగూ ఉండేవి. ఇక సినిమా టికెట్ల కోసం క్యూలలో తొక్కిసలాటలు, చొక్కాలు చింపుకోవడం మామూలే.
ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక, చాలా పనులు ఇంటినుంచే అయిపోతున్నాయి. ఎంతో అవసరం ఉంటే తప్ప సామాన్యుడు బాంకుల గడప తొక్కనక్కర్లేదు. అన్ని రకాల బిల్లులు ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. రైల్వే టికెట్లు, బస్ టికెట్లు, సినిమా టికెట్లు లాంటివన్నీ ఆన్లైన్లోనే కొనుక్కోవచ్చు. మనకు నచ్చితే బోలెడంత షాపింగ్ కూడా ఆన్లైన్లోనే చేసెయవచ్చును. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా చాలా పనులు చక్కపెట్టేయవచ్చు.
ఇంటర్నెట్ పుణ్యమా అని ఇంతమంది క్యూల బారి నుండి చాలావరకు తప్పించుకున్నారు కాని, మన సమాజం లోని కొంతమంది మాత్రం ఇంకా క్యూల్లోనే మగ్గుతున్నారు. వాళ్ళే రైతులు. న్యూస్ పేపర్లలో, టివి చానళ్ళలో, రైతుల క్యూలు కిలోమీటర్ల పొడుగున ఇంకా కనపడుతూనే ఉన్నాయి. ముందు బాంకులోన్ల కోసం, తరువాత విత్తనాల కోసం, ఎరువుల కోసం చాంతాడంత క్యూల్లో నుంచోవడం రైతులకి మామూలయిపోయింది. చివరికి పంట పండాకా అమ్ముకోవడానికి కూడా మార్కెట్ యార్డుల్లో రైతులుకి క్యూలు తప్పడం లేదు.
ఎంతో మంది సామాన్యులని క్యూలలోంచి బయటపడేసిన ప్రభుత్వాలు రైతులనెందుకు పట్టించుకోవు? ఒకవేళ గ్రామాల్లో రైతులకి ఇంటర్నెట్ అందుబాటులో లేదనుకున్నా, అందరిదగ్గరా ఉన్న మొబైల్ ఫోన్లని ఉపయోగించుకోవచ్చుకదా.
నేను వ్యవసాయ కుటుంబం నుంచి రాలేదు కాబట్టి నాకు రైతుల సమస్యలు పూర్తిగా తెలియవు. కాని ప్రకృతితో, ప్రభుత్వంతో, దళారులతో ఎప్పుడూ పోరాడే రైతులని కనీసం క్యూల బెడద నుంచైనా తప్పించడం మంచిదని నా అభిప్రాయం.
ఎందుకంటే అమ్మకి కోపం వస్తే అన్నం వండదు. కాని రైతుకి కోపం వస్తే అన్నం ఉండదు.
Trackbacks