సీతమ్మ వాకిట్లో సంక్రాంతి సందడి.
13/01/2013
సంక్రాంతి పండగకి కుటుంబసమేతంగా సినిమాకి వెళ్ళాలనుకుంటున్నరా? అయితే మీ ఇంటికి వచ్చిన బంధుమిత్ర సపరివారసమేతంగా ఈ సినిమాకి వెళ్ళచ్చు. ఈ సినిమా చూసిన తరువాత బాంధవ్యాలు బలపడతాయి. అపోహలు తగ్గుతాయి. హిందీలో రాజశ్రీ వాళ్ళ సినిమాలలో ఉండే ధనిక కుటుంబాలకి బదులు గ్రామీణ తెలుగు మధ్యతరగతి కుటుంబాన్ని పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా. గతంలో వెంకటేష్ చేసిన “సంక్రాంతి” సినిమా కూడ గుర్తొస్తుంది. చితకబాదుడు ఫైట్లు, ఐటెం సాంగ్స్, మసాలా డైలాగులు లేని ఈ సినిమా చూస్తే కొన్ని దశాబ్దాల క్రితం బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టుంటుంది. నగరాల్లో బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు తినే వాళ్ళకి అమ్మ చేతి పెరుగన్నం ముద్ద రుచి గుర్తొస్తుంది.
అలాగని ఇది మరీ గొప్ప సినిమా ఏమీ కాదు. కాని ఒక డిఫరెంట్ సినిమా. ఈగో లని పక్కనపెట్టి ఇంత సింపుల్‌గా సినిమాలో నటించిన వెంకటేష్, మహేష్‌లని ముందుగా అభినందించాలి. మహేష్‌బాబు “బిజినెస్‌మేన్” లాంటి సినిమాలో నటించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ సినిమాలో నటించాడు అనుకుంటున్నాను. అలాగే శ్రీరామరాజ్యం, రాజన్న లాంటి సినిమాలు గొప్పగా ఆడకపోయినా, ఎటువంటి మసాలాలు లేని సినిమా తీసిన నిర్మాతని కూడ అభినందించాలి.
ఎంతోమంది నటీనటులున్న ఈ సినిమాలో అందరూ తమ శక్తిమేరకు బాగా చేసారు. మల్టీ స్టారర్ సినిమాలలో అన్ని పాత్రలకి సరైన న్యాయం జరగడం కష్టమే.ఇందులో దర్శకుడు అన్నిటికంటే ఎక్కువగా సీత పాత్రని ప్రేమించినట్టు కనపడుతుంది. ఆమె చిన్న చిన్న అనుభూతులు కూడ సున్నితంగా చూపించాడు. ఆ పాత్రలో అంజలి చాలా బాగా చేసింది. మాటలు చాల చోట్ల బాగున్నాయి. పాటలు కూడ విన్నదానికంటే సినిమాలో ఇంకా బాగున్నాయి. మహేష్‌బాబుని ఎప్పుడు ఎంతో గ్లామరస్‌గా చూసే యువత ఈ సినిమాలో “మిడిల్‌క్లాస్” మహేష్‌బాబుని చూసి కొంత నిరాశపడచ్చు. వెంకటేష్, మహేష్‌బాబులు ఎడమొహం, పెడమొహంగా, మౌనంగా కూర్చునే సీన్లు మాత్రం బోర్ కొట్టిస్తాయి.
సినిమా నిడివి పెరిగిందని బ్రహ్మానందం పాత్రని మొత్తం తీసేసారని చదివాను. ఒక పావుగంట నిడివి పెరిగినా ఆ పాత్రని ఉంచితే సెకండ్ హాఫ్‌లో కూడ వినోదం పండేది. దానికి బదులు రవిబాబు పాత్రని తీసేసినా నష్టమేమీ లేదు. అలాగే ఈ సినిమాని దర్శకుడు సరిగ్గా ముగించలేదు. సినిమా అర్ధాంతరంగా అయిపోయినట్టు అనిపిస్తుంది. బహుశా సీక్వెల్ తీస్తారేమో? ఇంత పెద్ద సినిమాని ఒక కొత్త దర్శకుడు చేస్తున్నప్పుడు, ఎవరైనా ఒక సీనియర్ దర్శకుడు పర్యవేక్షిస్తే బాగుండేది. తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు అనకుండా, కొన్ని లోపాలున్నా, ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ప్రోత్సహించాలి.
One Comment
leave one →
వెంకటేష్, మహేష్ లు కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో..’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఈ సినిమాకు వస్తున్న వసూళ్లును చూసి బాలీవుడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ నెల 10 నుంచి విదేశాల్లో ప్రీమియర్ షోలతో ‘సీతమ్మ వాకిట్లో..’ ప్రదర్శనలు ప్రారంభం అయ్యాయి. గడిచిన ఐదురోజుల్లోనూ ‘సీతమ్మ వాకిట్లో’ 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఈ కలెక్షన్ల సునామీ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. అమెరికాలో 69 థియేటర్లలో ప్రదర్శించ బడుతన్న ‘సీతమ్మ..’ సినిమాకు వచ్చిన 1.5 మిలియన్ డాలర్ల (6.87 కోట్ల రూపాయిలు) కలెక్షన్లు చూసి బాలీవుడ్ వర్గాలనే విస్మయ పరుస్తున్నాయి. తెలుగు సినిమాకు ఇంత మార్కెట్ ఉందా అని ఆశ్చర్య పోతున్నాయి. దీంతో తొలివారం ముగిసే సరికి ‘సీతమ్మ…’ వసూళ్ళు ఏలా ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా, ‘సీతమ్మ..’ కంటే రెండు రోజుల ముందు విడుదల అయిన నాయక్ సినిమా అమెరికాలో మొదటి నాలుగు రోజుల్లో 2.11 కోట్ల రూపాయిలు వసూళు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.