విషయానికి వెళ్ళండి

రెండు గుండెల మైథునం

17/03/2013

ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని చాలా ఎదురు చూసాను. ఆఖరికి డివిడి వచ్చేవరకు చూడడం కుదరలేదు. బెంగళూరులో “మహంకాళి” లాంటి సినిమాలు కూడ రిలీజ్ చేసారు కాని “మిథునం” సినిమా ఇప్పటివరకు రాలేదు. ఒక మంచి సినిమాని ప్రేక్షకుల మధ్య కాకుండా ఇంట్లోనే చూడాల్సివచ్చింది.

కథని సినిమాగానో, టివి సీరియల్‌గానో తీయడం కత్తిమీద సాము లాంటిది. వంశీ పసలపూడి కథలు టివిలో సరిగ్గా చూపించలేకపోయారు. మిథునం లాంటి అద్భుతమైన కథ వ్రాసినందుకు శ్రీరమణ గారి జన్మ ధన్యమైతే, ఆ కథని అంతే అద్భుతంగా సినిమా తీసినందుకు భరణి గారి జన్మ ధన్యమయ్యింది. భరణి గారిలో ఇంత మంచి దర్శకుడు, మంచి రచయిత ఉన్నాడని నాకు తెలియదు. ప్రేమకథ అంటే కేవలం యువతీయువకుల కథే చూపించనక్కరలేదు, అమ్మానాన్నల కథని కూడ చక్కని ప్రేమకథగా చూపించవచ్చని నిరూపించారు. ఏ వయసులోనైనా కొనసాగేది రెండు మనసుల మైథునం మాత్రమే అని, అదే అర్థనారీశ్వరతత్వమని చక్కగా చెప్పారు. జీవితభాగస్వామిని ఎంచుకునేటప్పుడు, యువతీయువకులు అయిదేళ్ళు, పదేళ్ళ కోసం కాకుండ యాభై ఏళ్ళ సాహచర్యం కోసం ఎంచుకోవాలన్న సందేశం ఉంది.

అల గేటెడ్ కమ్యూనిటి పురంబులో, ఆ మూల అపార్ట్‌మెంటు సౌధంబులో, పద్నాల్గవ అంతస్థులోని మూడు బెడ్ రూముల లగ్జరీ ఫ్లాట్‌లో బ్రతకడమే సౌఖ్యం కాదని మట్టితో బ్రతుకుతూ, ప్రకృతితో మమేకవడమే పరమసుఖమని చెప్పారు. శ్రమైక జీవన సౌందర్యానికి వయసు అడ్డం కాదని చూపించారు. ఈ సినిమాలో రేడియో ఉంటుంది కాని టివి ఉండదు. ఇదివరకు రేడియో వింటూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు టివి వచ్చాక సోఫాలకి శిలాజాల్లా అతుక్కుపోయి మరీ టివి చూస్తున్నారు. అప్పదాసు ఇల్లే ఒక పెద్ద థియేటరు. ఇక వాళ్ళకి హోం థియేటర్ ఎందుకు? ఈ సినిమా ఒక డ్రీం రిటైర్మెంట్. ఒక ఫాంటసీ వానప్రస్థం.

సినిమా ప్రారంభంలోనే వందేమాతరం పాట వినిపిస్తూ అమ్మా నాన్నల పాదాలు మాత్రమే చూపించడం బాగుంది. ఇక అక్కడనుంచి అప్పదాసు తిండి యావ (బహుశా అప్పదాసు దృష్టిలో అది ఒక కళ), వాళ్ళిద్దరి మధ్యన జరిగే సరదా సంఘటనలు, చిలిపి తగాదాలు, ప్రేమ కబుర్లు, అలకలు, అనుభూతులు, మాటలు, పాటలు అన్నీ కథలో ఉన్నవే కాకుండ మరిన్ని జోడించి మంచి విందు భోజనం తిన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. చివరికి అప్పదాసు మరణంతో సినిమా చూస్తున్న వాళ్ళ హృదయం, కన్నులు చెమ్మగిల్లకమానవు.

నాకు బాగా నచ్చింది ఈ సినిమాలోని డైలాగులు. కథలోని మాటలు ఇంచుమించు అన్నీ ఉంచుతూనే మరిన్ని మాటలు భరణి చక్కగా కలిపారు. జంధ్యాల గారి తర్వాత సినిమాల్లో చక్కని తెలుగు మాటలు వ్రాసేవాళ్ళే కరువయ్యారు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో, అన్నీ పంచ్ డైలాగులే కాని మంచి డైలాగులు ఉండటంలేదు. భరణి గారు మరిన్ని మంచి సినిమాలకి మాటలు వ్రాస్తే బాగుంటుంది.

బుచ్చి లక్ష్మి పాత్రకి లక్ష్మి చక్కగా సరిపోయింది. బాలు ఎక్కడైనా కొంచెం ఎక్కువ చెసి ఉండచ్చు కాని, లక్ష్మి చాలా బాగా చేసింది. ఈ పాత్రకి ఇంతకంటే న్యాయం చెయ్యగలిగేది బహుశా షావుకారు జానకి మాత్రమే అని నా అభిప్రాయం. బాలు తన పాత్రని బాగా “ఇష్టపడి” చేసినట్టు అనిపించింది. బెల్లం ముక్క కొడుతూ వేలుకి దెబ్బ తగిలించుకుని, కట్టు కట్టిన తరువాత భార్యని మళ్ళీ బెల్లం ముక్క అడిగేటప్పుడు బాలు అమాయకపు నటన అద్భుతః. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఈ పాత్రని చంద్రమోహన్ పోషించి ఉంటే ఇంకా సహజంగా ఉండేదనిపించింది. రెండోసారి చూసినపుడు జంధ్యాల సినిమాల్లో నటించిన కీ. శే. పుచ్చా పూర్ణానందం గుర్తొచ్చారు. ఆయన శరీరం, వాచకం ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాయనిపించింది.

కథలోని ఒక కీలకమైన సన్నివేశం, ఫ్లాష్‌బాక్‌లో పెళ్ళి పల్లకీలో వధూవరులు వేరుశనక్కాయలు పంచుకోవడం. అది కూడ సినిమాలో పెట్టి ఉంటే బాగుండేది. చేంతాడు యాభై ఏళ్ళ తరువాత తెగడం, అంత పెద్ద బాలు నూతిలో దూకి పైకి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. అలాగే భార్యని దొంగముంజ అనడం అవసరమా? చిన్న చిన్న లోపాలున్నా వదిలేసి, ఇంత మంచి సినిమా తీసినందుకు చిత్ర నిర్మాణ భాగస్వాములందరినీ అభినందిద్దాము.

9 వ్యాఖ్యలు leave one →
 1. 18/03/2013 10:36

  బెంగళూరులో ఎప్పటికైనా ఈ సినిమా విడుదల అవ్వదా అని ఆశగా ఎదురు చూస్తూ కళ్ళు కాయల కాచిన మేము కూడా మన వరూధిని గారు ఇచ్చిన లింక్ పుణ్యాన టీ.వీ లోనె ఈ సినిమాని చూడగలిగాము. చాలా మంచి సినిమా. మీరు రాసిన వన్నీ నిజమే.. చిన్న చిన్న లోపాలతో సహా. లక్ష్మి గారు చాలా బాగా చేసారు. యేసుదాసు గారి గానం మహాద్భుత: ‘అల గేటెడ్ కమ్యూనిటీ’

 2. బోనగిరి permalink*
  18/03/2013 17:59

  ధన్యవాదాలు సుభద్ర గారు.
  బెంగళూరులో ఒరిజినల్ డివిడి మరియు విసిడి దొరుకుతోందండి.
  నెట్‌లో చూస్తే సిడి కంటే ఎక్కువే ఖర్చవుతుందనుకుంటా.

 3. 11/04/2013 01:09

  విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు!

 4. బోనగిరి permalink*
  11/04/2013 09:10

  ధన్యవాదాలు జలతారువెన్నెల గారు.
  మీకు, బ్లాగు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.

 5. 16/04/2013 22:21

  “చాలా రోజులు గడిచిపోయాయి ఇప్పుడు చెబితే ఏం బావుంటుంది?” అనిపించినా “మరేం పరవాలేదులే” అని చెబుతున్నా.. ఉగాది శుభాకాంక్షలు మీకు 🙂
  మీ రివ్యూ బాగుందండీ. నిజంగా ఈ సినిమా చూస్తున్నపుడు గాని చూశాక గాని కలిగిన అనుభూతిని వివరించడం కష్టమే!

 6. 12/06/2013 03:12

  బావుందండి. మొన్న శ్రీరమణగారు మావూరొచ్చినప్పుడు ఈ విషయాలు కొన్ని (సినిమాగురించి కాదు, కథ గురించి) ముచ్చటించాము. రేపో యెల్లుండో సారంగ పత్రికలో వస్తుంది

 7. bonagiri permalink*
  12/06/2013 18:33

  కొత్తపాళి గారు, ధన్యవాదాలు.
  ఆ విషయాలు సారంగ పత్రికలో వచ్చినప్పుడు లింక్ ఇవ్వండి.

 8. Konagalla Harsha permalink
  21/06/2013 17:14

  మా అమ్మ గారు, నాన్న గారు ఈ చిత్రాన్ని youtube లో చూసి ఎంతో సంతోషించారు. నాకు కూడా అప్పటిదాక తెలియదు తనికెళ్ళ బరణీ లో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడని, బాలసుబ్రమణ్యం లో ఇంత మంచి నటుడు ఉన్నాడని. ఈ చిత్రం లో బాలసుబ్రమణ్యం కుంభాలు కుంభాలు తిన్నాక, ఆకరిన త్రిఫలచూర్ణం రెండు చెంచాలు వేసుకోవడం నవ్వు వచ్చింది

Trackbacks

 1. ‘బాలు’తా తీయగా చల్లగా… | ఆలోచనాస్త్రాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: