శతాబ్దిలో సాధుకోకిలతో..
11/06/2013
నేను ఆఫీసు పనిమీద అప్పుడప్పుడు బెంగళూరు నుండి చెన్నయి వెళుతుంటాను. వీలైనంతవరకు చెన్నయికి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోనే ప్రయాణం చేస్తాను. అలా వెళ్ళినప్పుడు ఒకసారి జరిగింది ఈ సంఘటన. ఎప్పటిలాగే ఆ రోజు బోగీలోకి ఎక్కి నా సీట్లో కూర్చొంటుండగా పక్క సీట్లలో ఉన్న ముగ్గురు పెద్దగా మాట్లాడుకొంటున్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి చేతిలో టాబ్లెట్‌తో, ఏవో పాటలు హమ్ చేసుకుంటూ చాలా హడావిడిగా ఉన్నాడు. వీళ్ళేవరో బాగా డబ్బున్న పార్టీ అనుకున్నాను. రైలు బయలుదేరిన తరువాత ఆ టాబ్లెట్ వ్యక్తి నా పక్కన సెటిలయ్యాడు. ఇంకో వ్యక్తి, నా ముందు సీట్లోను, మరొకతను అటు పక్క సీట్లోను సెటిలయ్యారు.
టీ, బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ అయ్యాకా వాళ్ళు ముగ్గురూ కబుర్లు మొదలెట్టారు. కాని వాళ్ళు కన్నడంలో మాట్లాడుకోవటంతో నాకు అంతగా అర్థం కాలేదు. నేను కూడ వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. కొంతసేపు అయిన తరువాత TTE వాళ్ళదగ్గరకి వచ్చి టిఫిన్ బాగానే ఉందా?, ఇంకా ఏమైనా కావాలా? అని అడిగాడు. వీళ్ళెవరబ్బా, VIPలా? అని వాళ్ళని పరిశీలించి చూసాను. కాని నాకు ఏమీ తెలియలేదు. తరువాత కొంతమంది ప్రయాణికులు కూడ నా పక్కనున్న వ్యక్తిని విష్ చేయడం చూసాను. ఇలా మూడు గంటల ప్రయాణం తరువాత ట్రైను కాట్పాడి చేరుకుంది. అక్కడ ఆ ముగ్గురూ కిందకు దిగారు. అప్పుడు TTEని అడిగాను నా పక్కన కూర్చున్నవాళ్ళెవరని? నా పక్కన కూర్చున్న వ్యక్తి ప్రముఖ కన్నడ సినిమా హాస్యనటుడు “సాధుకోకిల” అని TTE చెప్పాడు.
నేను బెంగళూరు వచ్చాకా కన్నడ సినిమాలు ఎలా ఉంటాయని, నా కొలీగ్సుని అడిగితే, తెలుగు సినిమాలన్నీ ఇక్కడ రిలీజ్ అవుతాయి కాబట్టి కన్నడ సినిమాలు చూడవలసిన అవసరం లేదని చెప్పారు. నేను కూడ KSRTC బస్సులో ప్రయాణించినప్పుడు తప్ప ఇంకెప్పుడూ కన్నడ సినిమాలు చూడలేదు. కాబట్టి ఈ సాధుకోకిల ఎవరో నాకు తెలియలేదు. రైలు బయలుదేరిన తరువాత ఆ సాధుకోకిల వచ్చి నా పక్కన కూర్చున్నాక అతనితో మాటలు కలిపాను. నేను తెలుగు వాడినని, చాలా కాలం ఉత్తరాదిలో ఉండడం వలన ఆయనెవరో తెలియలేదని చెప్పాను. పాపం మూడు గంటలు పక్కనే కూర్చుని ప్రయాణం చేసినా, అతనిని గుర్తించనందుకు కొంచెం ఫీలయ్యాను.అప్పుడతను మామూలుగానే మాట్లాడాడు. తాను హాస్యనటుడే కాకుండా, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడ అని ఒక సినిమాకి పాటల రికార్డింగుకి చెన్నయి వెళుతున్నామని చెప్పాడు. తెలుగులో కూడ కొన్ని సినిమాలలో నటించానని చెప్పాడు. పాటల రికార్డింగుకి చెన్నయి ఎందుకు వెళ్ళడం, బెంగళూరులో చేయరా అని అడిగితే, చెన్నయిలో మాత్రమే అన్ని రకాల వాయిద్యాలు బాగా వాయించేవాళ్ళు దొరుకుతారని, అందుకే కొన్ని తెలుగు సినిమాలు కూడ చెన్నయిలో రికార్డింగు చేస్తారని చెప్పాడు. వాళ్ళు సాధారణంగా కారులోనే చెన్నయికి వెళతారట, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కి కొత్తవి, ఆధునికమైన బోగీలు వేసారని చాలా బాగుందని ఎవరో చెపితే రైల్లో వచ్చారట. మిగతా ఇద్దరిలో ఒకతను సినిమా దర్శకుడని, ఇంకొకతను ఎడిటర్ అని చెప్పాడు.
ఈ సంఘటన జరిగి ఏడాది పైనే అయ్యింది. ఎప్పటినుంచో బ్లాగులో వ్రాద్దామనుకుని బద్ధకించి వ్రాయలేదు. ఇప్పుడు ఏమీ తోచక వ్రాస్తున్నాను. అప్పుడు తెలుగులో థమన్ ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. అదే విషయం సాధుకోకిల అడిగితే చెప్పాను. తను, మణిశర్మ, థమన్ కలిసి పనిచేసామని, చిన్నప్పుడు థమన్ “బాయ్స్” సినిమాలో నటించాడని, థమన్ అసలు పేరు సాయికుమార్ అని చెప్పాడు. ఏం గుర్తొచ్చిందో ఏమో కాని వెంటనే థమన్‌కి ఫోన్ చేసి అడిగాడు, చెన్నయిలో ఉన్నావా? అని. థమన్ ఉన్నానని చెప్పినట్టున్నాడు, అయితే కలుస్తాను అని ఫోన్ పెట్టేసాడు. తెలుగులో కంటే కన్నడలోనే మంచి మెలొడీ పాటలు వస్తున్నాయని చెప్పాడు.అలా మరో రెండు గంటలు ఆయనతో కలిసి ప్రయాణించాను. తరువాత అతని దర్శక మిత్రుడిని అడిగి నా మొబైల్ ఫోన్ కెమేరాతో ఒక ఫొటో తీయించుకున్నాను. కొన్ని రోజుల తరువాత టీవీలో ఉపేంద్ర నటించిన “సూపర్” సినిమా వస్తే చూసాను. అందులో సాధుకోకిల మన ఆలీతో కలిసి చడ్ఢి బ్రదర్స్‌గా నటించాడు. ఈ సినిమా మీలో చాలమంది చూసే ఉంటారు. కన్నడ పోకిరీలో బ్రహ్మనందం పాత్ర కూడ సాధుకోకిల చేసాడు.
2 వ్యాఖ్యలు
leave one →
Interesting. కానీ కమెడియన్ కి సాధుకోకిల అని భలే పేరే? 🙂
కొన్నేళ్ళ కిందట ఒక లేడీ బ్లాగర్ ఫ్లైట్‌లో బ్రహ్మానందం గారిని కలిసిన వైనం రాశారు. ఆయన కూడా చాలా కేజువల్ గా ఉన్నారని రాసిన గుర్తు.
ఇదో సరదా సంఘటన.
ఇంకో సరదా విషయం చెప్తాను. నేను బ్లాగు మొదలుపెట్టి నాలుగేళ్ళు దాటింది. ఎక్కువగా ఏమీ వ్రాయలేదనుకోండి. కాని నా బ్లాగులో ఎక్కువ కామెంట్లు (6) వ్రాసింది మీరే.