Skip to content

అసంపూర్ణ పరిష్కారం.

01/08/2013

ఏకాభిప్రాయం రావాలన్న సాకుతో ఏళ్ళతరబడి నానబెట్టిన తెలంగాణా సమస్యని, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకపక్షంగా పరిష్కరించింది. అయితే ఈ పరిష్కారం సంపూర్ణంగానూ లేదు, అందరికీ సమానమైన న్యాయం జరిగేటట్టుగానూ లేదు. తెలంగాణా ప్రాంతానికి లాభం కలిగేలా, మిగతా ప్రాంతాల వారికి అన్యాయం జరిగేలా రాజకీయ పరిష్కారం జరిగింది.

మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల మనోభావాలని తప్పకుండా గౌరవించాలి. ఎవరూ కాదనరు. మరి అందులో సుమారు కోటి మంది దాకా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం ప్రజల అభిప్రాయం సంగతేమిటి? అలాగే కోటిన్నర మంది ఉన్న రాయలసీమ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండమని ఎలా తీర్పు ఇస్తారు?

ఇప్పటివరకు హైదరాబాద్ అన్ని ప్రాంతాల వారికి రాజధానిగా ఉంది. అందుకే అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసి ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు రాజధాని ఒక ప్రాంతానికే చెందుతుందని ప్రకటించడం ఏ విధంగా న్యాయం? ఇది ఎలా ఉందంటే ఉమ్మడి కుటుంబంలో ఒక బిడ్డ బాగా చదువుతున్నాడని, అందరూ కలిసి కష్టపడి వాణ్ణి చదివిస్తే, ఉద్యోగం వచ్చాకా వాడు వేరు కాపురం పెట్టాడట. దశాబ్దాల క్రితం జై తెలంగాణా, జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చినప్పుడే రాష్ట్రాన్ని విభజించి ఉంటే, ఈనాటికి ఎవరి పాట్లు వాళ్ళు పడి వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేవారు. హైదరాబాదు నుండి వచ్చే ఆదాయం ఆగిపోతే సీమాంధ్రలో ఉచిత విద్యుత్తు, రూపాయికి కిలో బియ్యం లాంటి అనేక సంక్షేమ పథకాలకి డబ్బులు ఎక్కడనుండి వస్తాయి?

1. ఎలాగు విభజన తప్పదు కాబట్టి, రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా అంటే, హైదరాబాద్, తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ అని నాలుగు రాష్ట్రాలుగా విభజించండి.

2. హైదరాబాద్ ఆదాయంలో కొంత భాగాన్ని మిగిలిన మూడు రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన కొన్నేళ్ళపాటు పంచండి.

3. భౌగోళికంగా హైదరాబాదు ఎలాగూ తెలంగాణాలోనే ఉంటుంది కాబట్టి ఇందుకు వాళ్ళని ఒప్పించండి.

4. హైదరాబాదు అందరిదీ అయితే, మిగిలిన మూడు ప్రాంతాలవారు కేవలం పరిపాలనా అవసరాలకోసం తగుమాత్రంగా తమ తమ రాజధానులని నిర్మించుకోవచ్చు. రాజధానుల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టక్కరలేదు

ఇదే ఈ సమస్యకి సంపూర్ణ, శాశ్వత పరిష్కారం. ఇలా చేస్తే అన్ని ప్రాంతాల వాళ్ళూ సంబరాలు చేసుకుంటారు. సమస్యని అందరికీ అమోదయోగ్యంగా పరిష్కరించినందుకు కాంగ్రెసుకి ఇప్పటికంటే కొన్ని సీట్లు ఎక్కువగా కూడ రావచ్చు. 

1984 లో వచ్చిన “ఛాలెంజ్” సినిమా క్లైమాక్స్‌లో చిరంజీవి రావుగోపాలరావుతో ఇలా అంటాడు. “నువ్వు ఓడిపోతే నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్ళి చేస్తానని పందెం కాసావు కాని, నేను ఓడిపోతే, నీకు ఏమి ఇవ్వాలో అడగనంత పొగరు నీది” అని. ఇలాంటి పొగరుతోనే సీమాంధ్ర నాయకులు తెలంగాణా రాదని, రానివ్వమని ఉత్తర కుమారుల్లా ప్రగల్భాలు పలికారే కాని, ఒక వేళ తెలంగాణా ఇస్తే ఎలా ఇవ్వాలని కాని, మిగిలినవాళ్ళకి ఎలా న్యాయం చెయ్యాలని కాని ఎప్పుడూ మాట్లాడలేదు.

మన సమస్యని మనం, మన అసెంబ్లీలో చర్చించుకుని పరిష్కరించుకోవాలి కాని, ఎక్కడో ఉన్న అధిష్టానం ఇచ్చే తీర్పులకి ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పటికైనా, సీమాంధ్ర నాయకులు కళ్ళు తెరిచి న్యాయం కోసం పోరాడకపోతే, భావి తరాలవారు మిమ్మల్ని క్షమించరు. న్యాయం కోసం పోరాటం చెయ్యకపోతే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు లాంటి ముఖ్య నాయకులని చరిత్ర క్షమించదు. ఇప్పుడు ఎంత పోరాటం చేసినా, సీమాంధ్రకు ఎంతో కొంత న్యాయం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. న్యాయం జరగకపోతే 2004లో సమైక్యవాదమే మా వాదం అని చెప్పిన తెలుగుదేశాన్ని ఉచిత విద్యుత్తు, రెండు రూపాయల కిలో బియ్యం కోసం ఓడించినందుకు పశ్చాత్తాపపడుతూ, సీమాంధ్రులు కలకాలం ప్రతిఫలం అనుభవించవలసిందే.

 

 

ప్రకటనలు
8 వ్యాఖ్యలు leave one →
 1. తాడిగదప శ్యామలరావు permalink
  01/08/2013 20:34

  అయ్యా,

  మీరు పరిష్కారాల గురించి మాట్లాదుతున్నారు.
  సంతోషం.

  కాంగ్రెసు వారికి కావలసింది సమస్యకు పరిష్కారం కాదు.
  అలా కాంగ్రెసువారు పరిస్కారం దిశగా అలోచిస్తారనీ, అలోచిస్తునారనీ అనుకోవటం జనం మూర్ఖత్వం.
  కాంగ్రెసువారికి ఒక విధానం ఉంది.
  అది స్వలాభం.

  అవును. కాంగ్రెసుకు ఏది లాభం అని తప్ప వారికి తెలుగువారి యేది లాభం, దేశానికి ఏది లాభం, దీర్ఘకాలికంగా ఏది మంచి ఫలితాలిచ్చే పరిష్కారం లాంటి చచ్చు ప్రశ్నలకు సమాధానం వెదకటం కాంగ్రెసువారి విధానం కానేకాదు.
  అది తెలుసుకోలేకపోవటం మన తెలివితక్కువతనం.

  దెబ్బతిన్నవాళ్ళూ బాధపడండి.
  అంతకంటే మీరేం‌ చేయగలరు పాపం.

 2. 01/08/2013 23:24

  దశాబ్దాల పోరాటం ఫలించింది. స్వప్నం నిజమయ్యింది.

  “నాకు భాష రాదన్నోడు, నా యాసను ఎక్కిరించినోడు
  సిగ్గు లేకుండా ఈరోజు కలిసి ఉందామంటున్నాడు”: Kaloji

 3. bonagiri permalink*
  02/08/2013 13:56

  @ syamalarao: మీరు చెప్పినది కరక్టే, కాంగ్రెసుకి స్వలాభమే ముఖ్యం.
  కాని ఇంకా సమయం మించిపోలేదు.
  ఐకమత్యంగా పోరాడితే కొంతైనా న్యాయం జరుగుతుంది.

 4. bonagiri permalink*
  02/08/2013 16:18

  @ Jai: మీ పోరాటం ఫలించినందుకు అభినందనలు.

  ఇక పోతే మిమ్మల్నే కాదు, మా గోదావరి యాసని కూడ వెక్కిరిస్తుంటారు. ఉత్తరాంధ్ర యాసని కూడ వేళాకోళం చేస్తుంటారు. అయినా అది విడిపోయేటంత విషయం కాదు.

  ఇంకా కలిసే ఉందామని నేనడంలేదు. అన్ని వనరులని న్యాయంగా పంచమంటున్నాను. అంతే.

 5. Dr.Acharya Phaneendra permalink
  04/08/2013 06:24

  సీమాంధ్ర సోదరులారా!
  హైదరాబాదుతో 50 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకోలేక మీరెంత బాధ పడుతున్నారో మాకు తెలుసు. కాని కుటుంబాలు విడిపోతున్నప్పుడు కూడ ఇలాంటి బాధలు తప్పవు. 50 ఏళ్ళుగా మనస్పర్థలు పెరుగుతూనే వచ్చాయి గాని మానసిక ఐక్యత కుదరనే లేదు. కాబట్టి ఇక విడిపోక తప్పదు.
  కాని విడిపోయే ముందు కూడ ఇంకా కుయుక్తులేనా? మాకు దక్కని హైదరాబాదు మీకూ దక్కకూడదు అన్న దుష్ట బుద్ధి తగునా? భౌగోళికంగా మా గుండెకాయగా ఉన్న హైదరాబాదును మానుండి ఎలా వేరు చేయమనగలుగుతున్నారు? పోని! 1956లో హైదరాబాదును మీరు మద్రాసు రాష్ట్రం నుండి పట్టుకొచ్చారా ? లేదే? అప్పటికే హైదరాబాదు మాది. అప్పటికే అసెంబ్లీ భవనాలు, హైకోర్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆసుపత్రి లాంటి అన్ని వసతులున్న మా రాజధాని. 50 ఏళ్ళు రాజధానిగా ఉన్నందుకే మీరు వదులుకోలేకపోతే … మాకు హైదరాబాదు 400 ఏళ్ళుగా రాజధాని! మేమెలా వదులుకొంటాం? 50 ఏళ్ళుగా కలసి చేసుకొన్న అభివృద్ధి అని మీరు వాపొతున్నారు. మరి మేము 400ల ఏళ్లుగా చేసుకొన్న అభివృద్దే! దాన్ని ఎలా వదులుకోగలం? అంత సులువుగా కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని, లేదా వేరే రాష్ట్రం చెయ్యాలని అనడానికి మీకు మనసెలా ఒప్పింది? తెలుగువాళ్ళే నిర్మించిన చెన్నపట్నంపై హక్కును సాధించుకోలేక తమిళులకు అప్పగించి వచ్చారే? ఇప్పుడు హైదరాబాదుపై అంత హక్కుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అందులో న్యాయం ఉందా? 50 ఏళ్లుగా అప్పటికే మాదైన మా ఇంట్లో మీరు మాతో ఉండడానికి ఒప్పుకొన్నాం. ఆ ఇంటికి మీరు రంగులు వేయించి ఉండవచ్చు. ఫర్నిచర్ సమకూర్చి ఉండవచ్చు. అంతమాత్రాన విడిపోయేటప్పుడు ఆ ఇల్లే మీదవుతుందా? లేక మాకూ దక్కకుండా చేసిపోతారా? ఎంత దురాలోచన అది? గుజరాతీలు బొంబాయి గురించి ఇలాగే పేచి పెట్టినప్పుడు అంబేడ్కర్ “ఎప్పటికైనా ఓనర్ ఓనరే! టెనెంట్ టెనెంటే!” అన్న విషయం మీ మేధావులకు తెలియనిదా? హైదరాబాదులో ఉండే సీమాంధ్రులు ఇక ముందు తెలంగాణ పౌరులుగా ఇక్కడే ఉండిపోవచ్చు. సీమాంధ్ర ప్రాంతంలో ఉండే సోదరులు కూడ మా ఆత్మీయులుగా వస్తూ పోతూ ఉండవచ్చు. భారత రాజ్యాంగమే ఈ హక్కును ప్రతి భారతీయ పౌరునికి కల్పించింది. ఇప్పుడున్న ఈ అనుబంధాన్ని ఇలాగే కొనసాగించుకోవాలి గాని, వెళ్ళే ముందు హైదరాబాదును మాకు కాకుండా చేసి వైషమ్యాలు పెంచుకోవచ్చా? కాస్త ఆలోచించండి.

 6. kalluri bhaskaram permalink
  04/08/2013 08:02

  తెలంగాణ ఇస్తే ఎలా ఇవ్వాలో, అందరికీ ఎలా న్యాయం చేయాలో సీమాంధ్రనాయకులు మాట్లాడలేదన్నారు. నాయకులు సరే, జనం మాట్లాడారా? మాట్లాడబోయిన వారి మీద కూడా విరుచుకుపడి నోరు మూసే ప్రయత్నం చేశారు.
  కాంగ్రెస్ స్వలాభం చూసుకుంది అంటున్నారు. ఏ విషయంలోనో స్పష్టత లేదు. తెలంగాణ నిర్ణయం తీసుకోవడంలో స్వలాభం చూసుకుందా లేక సీమాంధ్ర ప్రాంతానికి తగిన ప్యాకేజ్ ప్రకటించకపోవడంలో చూసుకుందా? రెండోది అయితే అర్థం చేసుకోవచ్చు. మొదటిదైతే బీజేపీ, ఎన్సీపీ, బీఎస్పీ తదితర పార్టీలు కూడా తెలంగాణకు అనుకూలమే. యూపీఏ లో ఏకాభిప్రాయం కుదరడం కూడా తెలంగాణ ప్రకటనకు దోహదం చేసింది. టీడీపీ తెలంగాణాను వ్యతిరేకించలేదు. ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఇవ్వకపోయినా రేపు ఎన్డీయే అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తుంది. కాంగ్రెస్ కు ఉన్న సంకోచాలు బీజేపీకి లేవు కూడా. తెలంగాణ ప్రకటన వల్ల ఆ పార్టీకి వచ్చేదే తప్ప పోయేదేమీ ఉండదు.
  ఇక స్వలాభం విషయం. రాజకీయ పార్టీల నిర్ణయాలు/చర్యల్లో స్వలాభం-పరలాభం అనేవి విడదీయడం కష్టం. రెండూ కలిసే ఉంటాయి. ఏ పార్టీ అయినా తన అస్తిత్వాన్ని, ప్రయోజనాన్ని చూసుకుంటూనే ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. రెండు రాష్ట్రాలు-ఒక వోటు అంటూ తెలంగాణ అనుకూల తీర్మానం చేసిన బీజేపీ, తను అధికారంలో ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకోలేదంటే, స్వలాభమే కారణం. అప్పుడు తెలంగాణాను వ్యతిరేకించిన చంద్రబాబు మద్దతుపై ఆధారపడింది కనుక స్వలాభం చూసుకుంటూ తెలంగాణాను పక్కన పెట్టింది. రేపు అధికారంలోకి వచ్చినా స్వలాభం ఉందనుకుంటేనే తెలంగాణ ఇస్తుంది. నష్టం అనుకుంటే ఇవ్వదు.

 7. bonagiri permalink*
  04/08/2013 12:39

  ఫణీంద్ర గారు, భాస్కరం గారు, మీ స్పందనలకి ధన్యవాదాలు.
  నేను నాయకుడిని కాదు, పాత్రికేయుడిని కాదు.
  ఒక సామాన్య పౌరుడిగా నా అభిప్రాయం వ్రాసాను. తప్పులుంటే సరిదిద్దండి.

 8. 12/08/2013 11:40

  Yes you are right.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: