విషయానికి వెళ్ళండి

ప్రజా రవాణాకు ప్రత్యేక ఇంధనం.

27/10/2013

RTC చార్జీలు మళ్ళీ పెంచుతున్నారు. పెరుగుతున్న డీజిల్ ధరతో పాటు అనేక ఇతర కారణాలవల్ల చార్జీలు పెంచితే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితికి RTC చేరుకుందని చెపుతున్నారు. APSRTC మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలలోని RTCల పరిస్థితీ ఇంతే. సమాజంలోని సామాన్య వర్గాలు తప్పనిసరిగా ఉపయోగించుకునే ప్రభుత్వ సేవల్లో RTC మొదటిది. ఈ సేవ కూడ భారమైతే, ఇప్పటికే తీవ్రమైన ఆహార ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులు ప్రయాణాలు కూడ వీలైనంతగా తగ్గించుకోవాల్సిఉంటుంది.

పెట్రోలియం ఉత్పత్తుల కోసం విదేశాలమీద ఎక్కువగా ఆధారపడే ఇండియాలాంటి దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ సమర్థంగా పనిచేయడం ఎంతో అవసరం. ఇప్పటికే చాలామంది తక్కువ దూర ప్రయాణాలకు బస్సుల మీద ఆధారపడకుండా ద్విచక్రవాహనాలు ఉపయోగిస్తున్నారు. కొంతమంది ప్రమాదం అని తెలిసినా, హైవేలమీద ఆటోలలో ప్రయాణిస్తున్నారు. ఇంకా ధనవంతులైనవాళ్ళు సొంత కార్లు ఉపయోగిస్తున్నారు. వీటివలన పెట్రోలియం ఉత్పత్తుల వాడకం పెరగడంతోపాటు, విలువైన విదేశీమారకద్రవ్యం కూడ ఖర్చయిపోతోంది. అలాగే వాతావరణ కాలుష్యం కూడ విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే విదేశీమారకద్రవ్యం ఆదా చేసుకోవడానికి, వాతావరణ కాలుష్యం తగ్గించుకోవడానికి ప్రజా రవాణా వ్యవస్థని సమర్థవంతంగా, చౌకగా నడపాలి.

ప్రజా రవాణా వ్యవస్థని చౌకగా నడపాలంటే, రవాణాకి అత్యంత ముఖ్యమైన ఇంధనాన్ని RTCలకి అతి తక్కువ ధరకు అందించాలి. ప్రస్తుతం డీజిల్‌పై ఉన్న సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, డీజిల్ ధరని ప్రతీ నెలా పెంచుతూ వస్తోంది. ఒక వేళ RTCకి డీజీల్‌ని తక్కువ ధరకే ఇవ్వాలనుకున్నా, ఆ సబ్సిడీ దుర్వినియోగమవ్వచ్చు. అందుకే దేశంలోని ప్రజా రవాణా వ్యవస్థలకి మాత్రమే ఉపయోగపడే ఒక ప్రత్యేక ఇంధనాన్ని చౌక ధరలకే అందించగలిగితే ఈ వ్యవస్థలు మనుగడ సాగించడమే కాకుండా ఇతర ప్రైవేటు రవాణాదారులకంటే తక్కువ ధరలకు సేవలు అందించగలుగుతాయి.

ఉదాహరణకి CNG ఇంధనాన్ని తీసుకుందాం. 2000 సంవత్సరానికి ముందు దేశరాజధాని ఢిల్లీలో, డీజిల్ వాహనాల వల్ల ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యం ఉండేది. తరువాత సుప్రీం కోర్టు ఎంతో గట్టిగా, పదే పదే ఆదేశించడంతో, నగరంలోని అన్ని పబ్లిక్ వాహనాలు CNGకి మారాయి. తరువాత ప్రపంచంలోనే అతి పెద్ద CNG వాహన వ్యవస్థగా DTC అవతరించింది. దానితోపాటు మెట్రో రైళ్ళు కూడ మొదలవడంతో ఢిల్లీలో కాలుష్యం బాగా తగ్గింది. మొదట్లో CNG ధర చౌకగా ఉండడంతో చాలామంది వాళ్ళ కార్లు కూడ CNGకి మార్చుకున్నారు.

మరి అలాంటి CNG లాంటి ఒక ప్రత్యేక ఇంధనాన్ని తక్కువ ధరకు RTCలకు మాత్రమే ఇవ్వగలిగితే చార్జీలు తగ్గి, ఎక్కువమంది ప్రజా రవాణా వ్యవస్థలని ఉపయోగించుకుంటారు. ట్రాఫిక్, కాలుష్యం, ప్రమాదాలు కూడ తగ్గుతాయి. విదేశీ మారక ద్రవ్యం ఆదా అయి, రూపాయి విలువ పెరుగుతుంది. తక్కువ ధరకు ఇవ్వడమంటే, ఏదో కాస్త సబ్సిడీ విదిలించడం కాకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అన్ని రకాల డ్యూటీలు, సెస్సులు, పన్నులు ఈ ఇంధనానికి మినహాయించి కనీస ధరకు ఇవ్వాలి. ఈ ఇంధనాన్ని ఇతర వాహనాలు ఉపయోగించుకోకుండా నిబంధనలు విధిస్తే, చౌక ధర దుర్వినియోగం కాదు. అలాగే కార్లు, ప్రైవేటు బస్సు సర్వీసులని నిరుత్సాహపరిచినట్టవుతుంది. మొత్తం అన్ని బస్సు డిపోలకీ ఈ CNG సరఫరా చేయడం ఒకేసారి సాధ్యం కాదు కాబట్టి, ఈ ప్రక్రియని దశలవారీగా అమలు చేయవచ్చు. ఇదే కాకుండా RTCలపై ఏ విధమైన పన్ను భారాలు లేకుండా చేసి, అనేక వర్గాలకు ఇచ్చే రాయితీ భారాన్ని కూడ ప్రభుత్వమే భరిస్తే RTC బస్సులు నిజంగానే ప్రగతి రథాలు అవుతాయి.

2 వ్యాఖ్యలు leave one →
  1. 16/12/2013 14:29

    అద్భుతమైన ఐడియా.

  2. bonagiri permalink*
    17/12/2013 09:16

    కృతజ్ఞతలు. కాని ఈ టపాని 40 మంది కూడ చదవలేదు. అదే సినిమాల గురించో, రాజకీయాల గురించో వ్రాస్తే వందలమంది చదువుతారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: