విమానయానంలో పేర్ల వేట
29/11/2014
శంషాబాద్ విమానాశ్రయం లోని ఒక (డొమెస్టిక్) టెర్మినల్‌కి NTR పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించడం పెద్ద గొడవ అయిపోయింది. నేతలు అందరూ పార్టీలవారీగా, ప్రాంతాలవారీగా విడిపోయి గొడవలు పడుతున్నారు. ఒక వర్గం ఇదివరకే, బేగంపేటలో ఉన్న పేరునే పునరుధ్ధరించామని అంటుంటే, మరో వర్గం మా ప్రాంతంలో ఉన్న విమానాశ్రయానికి మీ ప్రాంత నేత పేరేమిటని ఆగ్రహిస్తున్నారు. మరో (పార్టీ) వర్గం, మా నేత పేరు మాత్రమే ఉండాలి, మరో పేరు ఉండడానికి వీల్లేదని వాదిస్తోంది.
ఇక్కడ అందరూ వాళ్ళ భావోద్వేగాలకే విలువనిస్తున్నారు కాని వాస్తవాలని పట్టించుకోవడం లేదు. నా దృష్టిలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవి.
హైదరాబాదు ఇంకా ఉమ్మడి రాజధానిగానే కొనసాగుతోంది. APకి కొత్త రాజధాని ఏర్పడి హైదరాబాదు కేవలం తెలంగాణాకి మాత్రమే రాజధాని అయినప్పుడు వేరే ప్రాంతం అన్న వాదన ఒప్పుకోవచ్చు. శంషాబాదు ఎయిర్పోర్ట్ ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించబడింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిర్‌పోర్టులో 13 శాతం వాటా ఉందట. విద్యుత్తులో రెండు రాష్ట్రాలకీ వాటా ఉన్నప్పుడు ఇందులో కూడ వాటా ఉండాలి కదా!
NTR ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసాడు. ఆంధ్ర ప్రాంతాన్నెలా పరిపాలించాడో, తెలంగాణా ప్రాంతాన్ని కూడ అలాగే పరిపాలించాడు. ఆయన హైదరాబాదులోనే చనిపోయాడు. సమాధి కూడా అక్కడే ఉంది. కాబట్టి ఆయన తెలంగాణాకి తస్మదీయుడు కాదు.
అయినా, ఒక టెర్మినల్‌కి NTR పేరు పెట్టినంతమాత్రాన, NTRని గొప్పగా గౌరవించినట్టు అవుతుందా? అది కూడ, తెలంగాణా వాళ్ళూ వద్దు మొర్రో! అంటున్నప్పుడు. అంతగా NTRని గౌరవించాలనుకుంటే, గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసి, దానికి NTR పేరు పెడితే బాగుంటుంది.
అలాగే గతంలో మన ముఖ్యమంత్రిని (ఎయిర్‌పోర్టులోనే) అవమానించిన ప్రముఖుని పేరు హైదరాబాదు విమానాశ్రయానికి అవసరమా? ప్రధానమంత్రి పదవిని చేపట్టి, మన దేశం యొక్క దశ, దిశలని మార్చివేసే విధంగా పరిపాలించిన మన తెలుగు వాడు, మేధావి P V నరసింహారావు గారి పేరు శంషాబాదు విమానాశ్రయానికి పెట్టడం నా దృష్టిలో సముచితం. ఇది నా అభిప్రాయం మాత్రమే.
One Comment
leave one →
పిచ్చి గాకపోతే విమానం యెక్కేవాడు పాస్‌పోర్టు జాగ్రత్తగా వుందా లేదా తిక్కెట్టు ఖరారయిందా లేదా అని చూసుకుని వెళ్తాడు గానీ విమానాశ్రయం పేరు ఫలాది అయితేనే వెళ్తాను అంటాడా?