విషయానికి వెళ్ళండి

PK – OMG కన్నా పీకిందేమీ లేదు.

05/02/2015

PK పీకిందేమీ లేదని అనడంలో ప్రాస కోసం తక్కువ స్థాయి భాష వాడడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఈ రెండు సినిమాలలోనూ, దర్శకులు చేసింది కోడిగుడ్డుకి ఈకలు పీకడమే. కాకపోతే OMGలో కాస్త ఎక్కువ ఈకలు పీకారు. PKలో అంత ఎక్కువ పీకక పోయినా, నిరసనలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. నా దృష్టిలో PK సినిమాలో నిషేధించవలసినంత “దృశ్యం” ఏమీ లేదు. భయపడేవాడే మందిరానికి వెళతాడని అన్నప్పుడు, మందిరం అన్న మాటకి అర్థం దేవాలయం అని మాత్రమే కాకుండా ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరమైనా అని తీసుకోవాలని నా అభిప్రాయం. OMG సినిమాలోనే ఇంతకంటే ఎక్కువ విమర్శలు, వెటకారాలు, హేళనలు, వితండవాదనలు ఉన్నాయి. అయితే సినిమా చివరిలో కొన్ని సద్విమర్శలు కూడ ఉన్నాయి. అసలు OMG సినిమా ఇప్పటికే వచ్చిన తరువాత PK సినిమా తీయవలసిన అవసరమే లేదు. అదే కాన్సెప్టు, చాలా వరకు అదే సన్నివేశాలు PKలో కూడ ఉన్నాయి. OMG కాన్సెప్టుకి ఒక గ్రహాంతర వాసిని, ఒక ప్రేమ కథని కలిపారు అంతే. క్లైమాక్స్ కూడ సాధారణ టివి కార్యక్రమంలా ఉంది. PK తో పోలిస్తే, OMG లోనే చెప్పదలుచుకున్న విషయాన్ని  సూటిగా, సుత్తి లేకుండా చెప్పారు. అలాగే ఈ సినిమాకి PK అని ఇంగ్లీష్ అక్షరాల పేరు పెట్టి ప్రేక్షకులని కన్‌ఫ్యూజ్ చేయడం ఎందుకు? హిందీలో “पीके” అని పెట్టవచ్చు కదా. ఆమిర్‌ఖాన్, హీరాని, వినోద్ చోప్రాల మీద నాకు గౌరవం ఉంది. వీళ్ళు అందరిలా మాస్ మసాలా సినిమాలు కాకుండా, కొంతైనా వైవిధ్యంగా ఉండే సినిమాలు తీస్తారు. కాని ఈ సినిమాలో అది లేదు. OMG సినిమాని రీమిక్స్ చేసి వదిలారంతే.

ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో గ్రహాంతరవాసులు అంటే మనుషుల్లా కాకుండా ప్రత్యేక ఆకారంలో ఉన్నట్టు, వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్సుడుగా ఉన్నట్టుగా చూపించారు. వాళ్ళు భూమి మీదకు రాగలిగారంటే, మన కంటే తెలివైన వాళ్ళు, ఎక్కువ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అయి ఉండాలి కదా! అలాగే ఇక్కడకు వచ్చే ముందు ఇక్కడి పరిస్థితులని ముందే అవగాహన చేసుకునే ఉండాలి కదా! కాని ఈ సినిమాలో ఆ గ్రహాంతరవాసి చాలా అయోమయంగా భూమి మీదకు వస్తాడు. ఆ మాత్రానికి గ్రహాంతరవాసి బదులు ఏ ఆదిమానవుడో అడవుల్లోంచో, హిమాలయాల్లోంచో వచ్చినట్టు చూపించవచ్చు.

ఈ సినిమాలో ఇంకో తప్పు ఏమిటంటే, పీకే కి ఎదుటి వ్యక్తుల చేతులు పట్టుకుని, వాళ్ళ మనసులో ఉన్న విషయాలన్నీ చదివే శక్తి ఉంటుంది. మరి అలాంటప్పుడు తాను పోగొట్టుకున్న రిమోట్ కోసం సంజయ్ దత్ అండతో రిమోట్ దోచుకున్న వ్యక్తిని పట్టుకుని, అతని చేతుల ద్వారా రిమోట్ ఎవరికి అమ్మాడో తెలుసుకోవచ్చు కదా! రిమోట్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవడానికి దిల్లీ మహానగరం అంతా తిరగడం ఎందుకు? నీ రిమోట్ ఎక్కడ ఉందో దేవుడికే తెలియాలి అని దారిన పోయే దానయ్యలు చెప్పిన మాట పట్టుకుని, గుళ్ళూ గోఫురాలు తిరిగి దేవుడిని అన్వేషించడం, దేవుడు కనపడుటలేదని కరపత్రాలు పంచిపెట్టి విమర్శించడం, ఇవన్నీ ఎందుకు?

ఈ రెండు సినిమాలు తీసిన వాళ్ళు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, నమ్మకం వేరు, మూఢ నమ్మకం వేరు. మతం నమ్మకం. కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు మూఢ నమ్మకాలు. అలాగే దేవాలయం నమ్మకం, ఆశ్రమం మూఢ నమ్మకం. నమ్మకాన్ని గౌరవించాలి. నమ్మకాన్ని విమర్శించడం అనవసరం. విమర్శించినా పద్ధతిగా విమర్శించాలి. హేళన చెయ్యకూడదు. నమ్మకాన్ని ఎవరైనా విమర్శించినా, ప్రజలు పట్టించుకోరు. తమ విశ్వాసాలని వదులుకోరు. మూఢ నమ్మకాలని తీవ్రంగా విమర్శించవచ్చు. దాని వలన కొంతమందైనా హేతుబద్ధంగా ఆలోచించి మూఢ నమ్మకాలు వదులుకుంటారు. సంఘ సంస్కర్తల ప్రభావంతో ఎన్నో మూఢ నమ్మకాలు సమాజం నుండి కనుమరుగయ్యాయి. అలాగే దేవుడు నమ్మకం, స్వాములు, బాబాలు మూఢ నమ్మకం. నా దృష్టిలో ఈ స్వాములు, బాబాలు దైవసమానులు (GOD MEN) కారు. వీళ్ళు కేవలం దళారులు. వీళ్ళ దగ్గరకు వెళ్ళే వాళ్ళు అమాయకులు, అజ్ఞానులు అయినా అయి ఉండాలి లేకపోతే ఆ వ్యవహారంలో స్వప్రయోజనం ఉన్న స్వార్థపరులు అయినా అయి ఉండాలి. కాని ఈ సినిమాలలో దేవుళ్ళనీ, బాబాలనీ ఒకే గాటన కట్టి ఇష్టమొచ్చినట్టు విమర్శించడం వలన సమాజంలో ఎటువంటి మార్పూ రాదు.

ఇలాంటి సబ్జెక్టుల మీద సినిమాలు తీస్తే సీరియస్‌గా తియ్యాలి కాని కామెడీ కోసం, వినోదం కోసం తియ్యకూడదు. వినోదం కోసం తీస్తే వివాదాస్పద అంశాలు లేకుండా చూసుకోవాలి. వినోదం కోసం తియ్యడం వలన ఆశించిన ప్రయోజనం కూడ నెరవేరదు. ప్రేక్షకులు సినిమా చూసి ఆనందిస్తారు కాని ఆలోచించరు. ఒకసారి 1985లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన “దేవాలయం” సినిమా గుర్తుకు తెచ్చుకోండి. అందులో హీరో కూడ మొదట నాస్తికుడే. దేవుడు ఉన్నది నిజం అయినా కాకపోయినా, దేవాలయం ఉన్నది నిజం అని అర్థం చేసుకుని, తప్పనిసరి పరిస్థితులలో పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తాడు. దేవాలయాన్ని దోచుకుంటున్న దుర్మార్గుల ఆట కట్టిస్తాడు.

ఈ PK సినిమా కథని రాఘవేంద్రరావు లాంటి కమ్మర్షియల్ దర్శకుడు సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది? చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఎటువంటి గొడవలు, నిరసనలు ఉండవు. అవును, ఆయన ఇలాంటి కథతోనే ఒక సినిమా తీసాడు. అదే జగదేకవీరుడు – అతిలోకసుందరి. నాకైతే రెండు సినిమా కథలలో పెద్ద తేడా కనిపించలేదు. ఆ తెలుగు సినిమాలో శ్రీదేవి ఇంద్రలోకం నుండి భూమి మీదకు వచ్చి తన ఉంగరం (రిమోట్) పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం కోసం హీరో చిరంజీవి దగ్గరకు చేరుతుంది. ఆంజనేయ భక్తుడైన హీరో తన సంపాదనలో కొంత భాగం దేవుడికిస్తూ, కొంతమంది అనాథలని పోషిస్తూ ఉంటాడు. అక్కడా ఒక దొంగ స్వామి, అమ్రేష్ పురి ఉంటాడు. కాని హీరో దేవుడిని వెతుకుతూ కూర్చోకుండా, శక్తిమంతుడైన దొంగ స్వామిని చివరికి తన మానవశక్తితోనే అంతం చేస్తాడు.

PK సినిమా చివరిలో ఇంకో జోక్ ఏమిటంటే, టేప్ రికార్డర్ వినడానికి PK బోలెడన్ని బ్యాటరీలు భూమి మీద నుంచి పట్టుకెళతాడు. స్పేస్‌షిప్‌లో గ్రహాంతరయానం చెయ్యగలిగినవాళ్ళకి మన బ్యాటరీలు అవసరమా? లేక ప్రకటనల ఆదాయం కోసం అలా చూపించారా? నాకైతే యమగోల సినిమా చివరిలో అల్లు రామలింగయ్య అమాయకంగా పెట్టె నిండా పెన్నులు, సీసాలు మొదలైనవి తీసుకెళ్ళడం గుర్తొచ్చింది.

4 వ్యాఖ్యలు leave one →
 1. veeresh permalink
  05/02/2015 20:34

  Exclent explaination exactly what i am thinking…thanks for sharing..

 2. 05/02/2015 20:45

  .pk is domain name for pakistan. There is so much external hidden forces financing this movie.

 3. Simhadri Rao permalink
  05/02/2015 21:40

  పి కే మీద మీ విమర్శ దేవుళ్ళ మీద మీకున్న గుడ్డి నమ్మకాన్నితెలియజేస్తుంది

Trackbacks

 1. భరత్ అనే “లీడర్” | ఆలోచనాస్త్రాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: