విషయానికి వెళ్ళండి

ప్రజల వద్దకు ప్రజాస్వామ్యం

11/02/2015

2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన అపూర్వ విజయం చూసిన తరువాత నాకు మన దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రజాస్వామ్యం ప్రజల వద్దకు వచ్చినట్టు అనిపించింది. ఇది ఒక ప్రజాస్వామ్య విప్లవం. ఝాడూ జాదూ చేసింది.

పేరుకి ప్రజల కొరకే ప్రజాస్వామ్యం అయినా, ఇప్పటివరకు మన ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఓటు వెయ్యడంతోనే అంతమవుతూ వచ్చింది. రాజకీయాలు కేవలం కోటీశ్వరులకు మాత్రమే అన్న స్థాయికి చేరిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజల మేలు కోసమా, లేక అస్మదీయుల మేలు కోసమా అని అడిగే అవకాశం ప్రజలకు లేకుండా పోయింది. గెలిచినవాళ్ళు “5 సంవత్సరాల రాజరికం” చేసే స్థాయికి ఎదిగిపోయారు. ప్రజలకు రీకాల్ హక్కు వచ్చే వరకు, వీలైనంత తక్కువ దుర్మార్గులని ఎన్నుకోవడం తప్ప ఎవరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి వచ్చింది.

దేశ ప్రజలలో రాజకీయాల మీద ఏర్పడ్డ ఈ ఏహ్య భావం గత కొన్నేళ్ళుగా పెరుగుతూ వచ్చింది. అయితే సామాన్యులెవరైనా రాజకీయ నాయకులని ఈ విషయం మీద ప్రశ్నిస్తే, దూరంగా ఉండి మాట్లాడడం కాదు చేతనైతే ఎన్నికలలో పోటీ చేసి రాజకీయాలని మార్చమని నాయకులు ప్రతి సవాలు విసురుతున్నారు. దానికి సమాధానంగా సామాజిక ఉద్యమ నేత, అణ్ణా హజారే అనుచరుడు, అరవింద్ కేజ్రీవాల్ చీపురు గుర్తుతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి, తొలి ఎన్నికలలోనే 2013లో అధికారం చేపట్టారు. పూర్తి మెజారిటీ రాకపోవడంతో, కాంగ్రెసు పార్టీ మీద ఆధారపడ్డ ఆ ప్రభుత్వాన్ని జన లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టనివ్వకుండా సాంప్రదాయ పార్టీలు ఇబ్బందులు పెట్టాయి. దానితో విసిగి కేజ్రీవాల్ రాజీనామా చేసారు.

2014 లోక్‌సభ ఎన్నికలలో AAP పంజాబ్‌లో కొన్ని సీట్లు గెలవగలిగింది కాని, దిల్లీలో ఒక్క సీటు కూడ గెలవలేకపోయింది. తరువాత వరుస అసెంబ్లీ ఎన్నికలలో, దేశవ్యాప్తంగా బిజెపి ఘనవిజయాలు సాధించడంతో దిల్లీలో కూడ బిజెపి గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కాని 2015లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి ఎన్నికల తేదీ వరకు అనుకోని మార్పులు ఎన్నో జరిగాయి. బిజెపి గత ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్‌ని కాకుండా ఒకప్పుడు కేజ్రీవాల్‌తో కలిసి పని చేసిన కిరణ్ బేదీని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కేజ్రీవాల్‌ని అరాచకవాదిగా ఎద్దేవా చేసిన బిజెపి, కిరణ్ బేదీ రామ్‌లీలా మైదానంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన విషయం మర్చిపోయింది. ధనబలం, కండబలం లేని పిచ్చుక లాంటి AAP మీద వీలైనన్ని బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు. అయితే ఆ అస్త్రాలన్నీ తన మీదనే ప్రయోగించినట్టు ఆమ్ ఆద్మీ భావించాడు. కుల మత భేదాలకు అతీతంగా అందరూ ఓటింగ్ చేసి AAPకి అపూర్వ విజయం కట్టబెట్టారు.

ఈ విజయంతో సామాన్యులు కూడ రాజకీయ పార్టీ స్థాపించి మన వర్తమాన ప్రజాస్వామ్యంలో విజయం సాధించవచ్చని కేజ్రీవాల్ నిరూపించాడు. సామాన్యులు కూడ కోట్లు ఖర్చు పెట్టకుండా పోటీ చెయ్యవచ్చని, గెలవవచ్చని AAP అభ్యర్థులు నిరూపించారు. రాజకీయాలు కేవలం నేతల వారసులు, లిక్కర్ కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, సివిల్ కాంట్రాక్టర్లు, బిల్డర్లు లాంటి బిలియనీర్లకే పరిమితం కాదని, భవిష్యత్తులో ప్రజాసేవని కూడ కెరీర్‌గా ఎంచుకోవచ్చని యువతకి భరోసా కలిగించారు. అయితే కేజ్రీవాల్ ప్రభుత్వం ఎన్నికలలో చేసిన వాగ్దానాలని, ప్రజల ఆశలని, ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి. వర్తమాన ప్రజాస్వామ్యంలో జరిగిన ఈ అపురూప ప్రయోగం సఫలం కావాలని ఆశిద్దాము.

 

No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: