విషయానికి వెళ్ళండి

బాహుబలి – The Grand Plate Meals

02/08/2015

Baahubali

ఫైవ్ స్టార్ హోటల్‌కి బఫే కోసం అని వెళితే ప్లేట్ మీల్స్ పెట్టి పంపిస్తే ఎలా ఉంటుంది? పంచ భక్ష్య పరమాన్నాలతో కూడిన బ్రహ్మాండమైన విందు భోజనం అని పిలిచి ప్లేట్ చిన్నదిగా ఉంది, కొన్ని ఐటెంస్ మాత్రమే ఇవ్వాళ తినండి, మిగిలిన వాటికి రేపు మళ్ళీ రండి అని రూల్ పెడితే ఎలా ఉంటుంది? బాహుబలి సినిమా మొదటి భాగం అలాగే ఉంది. కథని అర్థంతరంగా ఆపేసి రెండో భాగం వచ్చే ఏడాది చూడండి అంటే, టివిలో సిన్సియర్‌గా డైలీ సీరియళ్ళు చూసేవాళ్ళకి బానే ఉంటుందేమో కాని, సగటు సినిమా ప్రేక్షకుడికి కడుపు నిండదు.

సినిమాని రెండు భాగాలుగా చెయ్యడంవల్ల ప్రేక్షకుడు అసంతృప్తిగా హాలు నుండి బయటికొస్తాడు. విలన్‌పై హీరో విజయం సాధించి శుభం కార్డు పడితేనే సినిమా పూర్తయినట్టు భావించడం మనకి అలవాటు. మూడు గంటల సమయం తీసుకున్నా, కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించి, మొత్తం కథని ఒకే సినిమాగా చూపించి ఉంటే బాగుండేది. లేకపోతే కొంత కథని వర్తమానంలోనూ, కొంత ఫ్లాష్ బాక్ కథని చూపించే బదులు, మొదటి భాగంలో అమరేంద్ర బాహుబలి కథని మొత్తం చూపించి, రమ్యకృష్ణ బాలుడిని నది దాటించే సన్నివేశం దగ్గర మొదటి భాగం ముగిస్తే బాగుండేది. రెండో భాగంలో శివుడి కథని మొదలుపెట్టి పగ తీర్చుకోవడంతో పూర్తిచేస్తే ఏ భాగానికా భాగం ఇండిపెండెంట్‌గా, ఇంచుమించు సమగ్రంగా ఉండేది. వీలైతే మరిన్ని సీక్వెల్స్ కూడ తీసుకోవచ్చు.

సినిమాలో చాలా దృశ్యాలు, సన్నివేశాలు అద్భుతంగా ఉండి కనువిందు చేసాయి. రమ్యకృష్ణ బాలుడిని నది దాటించే ప్రయత్నం, జలపాతాలు, ప్రభాస్ శివలింగాన్ని భుజానికెత్తుకోవడం, ప్రభాస్ తమన్నాల యుగళగీతం, మాహిష్మతి రాజ్య నగర దృశ్యాలు, రానా విగ్రహాన్ని నిలబెట్టే సన్నివేశం, యుద్ధ సన్నాహాలు, కాలకేయుడితో యుద్ధ సన్నివేశాలు, ఇలా చాలా సీన్లు రిచ్‌గా, గ్రాండ్‌గా తీసారు. పోరాట దృశ్యాలు చాలానే ఉన్నాయి. కొన్ని బాగున్నాయి కాని, మరి కొన్నింటి నిడివి మరీ ఎక్కువై కథ నెమ్మదిగా జరగడానికి కారణమయ్యాయి.

సన్నివేశాలు వేటికవి విడిగా చూస్తే గొప్పగా ఉన్నాయి కాని, వాటినన్నింటినీ సరిగ్గా కలపవలసిన కథ బలంగా లేదు. సీన్లు రిచ్‌గా తియ్యడంలో పెట్టిన శ్రద్ధ స్క్రిప్టుపై పెట్టలేదనిపిస్తుంది. కథ మామూలు చందమామ కథే. అది కూడ గతంలో మగధీర సినిమాలో చూసిన కథే. అక్కడ అరగంటలో చెప్పిన కథని ఇక్కడ అయిదు గంటలకు విస్తరించారు. కాని మగధీరలో ఉన్నంత ఆసక్తికరంగా బాహుబలిలో చూపించలేకపోయారు. కాకపోతే ఇటువంటి పాత్రని రాం చరణ్ కంటే బాగా చెయ్యగలనని ప్రభాస్ నిరూపించాడు.

నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్, రాణా, రమ్యకృష్ణ, సత్యరాజ్, ఇలా ఇంచుమించు పాత్రధారులంతా చాలా బాగా చేసారు. కాని సినిమాలో పాటలు గొప్పగా లేవు. పచ్చబొట్టు పాటైతే డబ్బింగ్ సినిమా పాటలా ఉంది. రాజమౌళి బియాండ్ కీరవాణి ఆలోచిస్తే బాగుంటుంది. మాటలు చాలా తక్కువగా ఉన్నాయి కాని, కొన్ని బాగున్నాయి.

నాకు ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేదు కాబట్టి నాకు తెలియదు కాని, చాలా సన్నివేశాలు వివిధ ఇంగ్లీష్ సినిమాలనుండి కాపి కొట్టారని అంటున్నారు. అదే నిజమయినా మనం చిన్నపుడు చదువుకున్న చందమామ కథల లాంటి ఒక భారతీయ కథని మన భాషలో ఇంత ఘనంగా చూపించినందుకు రాజమౌళిని, నిర్మాతలని అభినందించాలి. ఎప్పుడూ చూసే రొటీన్ పగ సాధింపు సినిమాల కంటే ఈ సినిమా చాలా బెటర్. చివరలో చిన్న సందేహం. కాలకేయుడి భాష వేరేదైనప్పుడు అతని పేరు కూడ ఆ భాషలోనే ఉండాలి కదా!

 

2 వ్యాఖ్యలు leave one →
 1. ప్రభాకర్ రెడ్డి permalink
  02/08/2015 11:06

  కాలకేయుడు అనేది అతని పేరు కాదనుకుంటాను.ఆ సమూహాన్ని కాలకేయులు అని పిలుస్తారు సినిమాలో. నాకు అర్ధమైనది ఏమిటంటే-కాల(నల్లని) కేయం (శరీరం) కలవారు కనుక కాలకేయులు అని వీరు పేరు పెట్టి ఉంటారు.భారతీయుడు,మదరాసీ ఇలా ఒక గుంపుకి పెట్టిన పేరు అని.

 2. శివరామప్రసాద్ కప్పగంతు permalink
  06/09/2015 05:53

  “…..వాటినన్నింటినీ సరిగ్గా కలపవలసిన కథ బలంగా లేదు. సీన్లు రిచ్‌గా తియ్యడంలో పెట్టిన శ్రద్ధ స్క్రిప్టుపై పెట్టలేదనిపిస్తుంది….”
  బహుబాగా చెప్పారు. ఈ సినిమాకి ఇంత పాపులారిటీ రావటం, అదిచూసి ఇదేదో ఘోప్ప సినిమా అని ఆ తెస్సిన వాళ్ళు అనేసుకోవటం ఏమంత శుభపరిణామం కాదు. కంప్యూటర్ గ్రాఫిక్ లతో కాదు కథతో సినిమా బాగుండాలి, కథనంతో సినిమాను నడపాలి. కంప్యూటర్ గ్రాఫిక్స్ యాక్టర్ కు వేసే మేకప్ వంటివి మాత్రమె! ఎంతటి గొప్ప మేకప్ మాన్ దగ్గర మేకప్ చేయించుకున్నా నటన దగ్గర సున్నా అయినా, మేకప్ భలేగా ఉన్నది అనేసి, సినిమా గొప్పగా ఉన్నది అనుకుంటే ఎలా ఉంటుందో, ఈ సినిమా కూడా అంతే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: