Skip to content

 దేవుడా, నా దేశాన్ని మోదీ భక్తులనుండి, మోదీ ద్వేషులనుండి రక్షించు.

31/10/2015

ఈ రోజు అక్టోబర్ 31. సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, వందలాది సంస్థానాలని ఏకం చేసి జాతీయ సమైక్యత సాధించిన ఉక్కు మనిషి పటేల్. అందుకే గత సంవత్సరం నుండి భారత ప్రభుత్వం సర్దార్ పటేల్ జయంతిని నేషనల్ యూనిటీ డే గా పాటిస్తోంది.

OH! MY GOD, PLEASE SAVE MY1

కాని ఇప్పుడు ఆ దేశ సమైక్యతకి ముప్పు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏ న్యూస్ చానల్ చూసినా, ఏ వార్తా పత్రిక చదివినా ఒక వైపు మోదీ భక్తులు, మరో వైపు మోదీ ద్వేషులు చేస్తున్న మాటల యుద్ధమే కనిపిస్తోంది. బ్లాగులు, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా నిండా ఈ ఇద్దరి వాదనలే కనిపిస్తాయి. వీళ్ళిద్దరూ బద్ధ వ్యతిరేఖులే అయినా, వాదనలు, ప్రతివాదనలు చెయ్యడంలో ఇద్దరూ సమ ఉజ్జీలే. ఇద్దరూ ప్రతీ విషయం మీద అతిగా స్పందిస్తూ ఉంటారు. రెండు వర్గాలూ, వాళ్ళ భావజాలం, వాళ్ళ సిద్ధాంతాలు మాత్రమే సరి అయినవని అనుకుంటారు కాని వాస్తవాలని అంగీకరించరు.

మోదీ భక్తులకి మోదీ చేసే ప్రతి పని గొప్పగానే కనపడుతుంది. సద్విమర్శలని కూడ స్వీకరించలేరు. మోదికీ ఓటు వేసినవాళ్ళందరూ మోదీ భక్తులు కారని వీళ్ళు గుర్తుంచుకోవాలి. ఇదివరకటి అసమర్థ, అవినీతి పాలనకి వ్యతిరేఖంగా, గుజరాత్ తరహా అభివృద్ధి దేశమంతటా సాధించగలడన్న ఆశతో ప్రజలు మోదీకి ఓటు వేసారని వీళ్ళు గ్రహించాలి.  

ఇక మోదీ ద్వేషులకి మోదీ చెసే ప్రతి పనీ తప్పుగానే కనపడుతుంది. ప్రతీ విషయంలోనూ మోదీని విమర్శించడం తప్ప వీళ్ళకి ఇంకేమి ఆలోచన ఉండదు. మోదీ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని అని వీళ్ళు గుర్తుంచుకోవాలి. అంశాల వారీ విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు కాని, ఏమి చేసినా విమర్శిస్తే, ప్రజలకి లోకువ అవుతారని వీళ్ళు గ్రహించాలి.

వీళ్ళ గొడవల్లో ప్రజోపయోగ అంశాలు మరుగున పడుతున్నాయి. అనవసర విషయాలతో సమయం వృధా అవుతోంది. ఇప్పటికిప్పుడు వీళ్ల మాటల యుద్ధం వల్ల కొంప మునిగేదేమీ లేదని అనిపిస్తున్నా, వీళ్ళని ఇలాగే వదిలేస్తే, వాదనలు ముదిరి, చిలికి చిలికి గాలివాన అయితే ఇది ఎంతవరకూ పోతుందో చెప్పలేము. కాబట్టి ప్రభుత్వం రెండు వర్గాలనీ నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వర్గాల మాటల యుద్ధంలో దేశం పరువు పోకుండా కాపాడాలి.

ఏ పార్టీకి, ఏ సిద్ధాంతానికి సంబంధం లేని నాలాంటి సగటు పౌరుల అవేదన ఇది.

ప్రకటనలు

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: