SILENCE _ PLEASE _ INDIA
25/11/2015
చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్ అని విద్యార్థులని కోప్పడుతుంటే ఎందుకో అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు మీడియాలో నాయకుల, మేధావుల, సెలబ్రిటీల గొడవ చూస్తుంటే, పాపం టీచర్ల బాధ ఏమిటో అర్థం అవుతోంది. స్కూలు విద్యార్థులు చిన్న పిల్లలు కాబట్టి గోల చెయ్యడంలో వింతేమీ లేదు. కాని ఈ పెద్ద మనుషులు ఎందుకు రోజూ గొంతు చించుకుని గోల చేసి మనలని ఇబ్బంది పెట్టడం? వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలతో ఎందుకు రోజూ రాద్ధాంతం చెయ్యడం? వీళ్ళని చూస్తుంటే నాకు కూడా గట్టిగా “సైలెన్స్ ప్లీజ్” అని అరవాలనిపిస్తోంది.
ప్రజలు అందరూ చాలా సహనంతోనే ఉన్నారు. వాళ్ళకి అసలు అసహనం వ్యక్తం చేసే తీరికా లేదు, అవకాశమూ లేదు. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ అనుకుంటా, ఒక మీటింగులో చెప్పాడు. భారతీయులు చాలా సహనశీలులు. లేకపోతే మురికివాడల పక్కనే సూపర్ లగ్జరీ ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నా, ఇలా ఎందుకు జరుగుతోంది? అని ప్రశ్నించకుండా తరాలు గడిపేస్తున్నారు. ఇదే మరో దేశంలో అయితే ఈపాటికే విప్లవం వచ్చి ఉండేది అని ఒక విదేశీయుడు పవన్‌తో అన్నాడట.
ప్రజలు సహనంతోనే ఉన్నా, వివిధ పార్టీల, సంస్థల నేతలు, నిజమైన లేదా స్వయంప్రకటిత మేధావులు, ఇంకా సెలబ్రిటీలు, లిజండ్లు మొదలైన మీడియా సేవీ పెద్ద మనుషులు మాత్రమే సహనానికి, అసహనానికి మధ్య దోబూచులాట ఆడుతున్నారు. వీళ్ళలో ఒక వర్గం వాళ్ళు నోటిదురుసుతో ఏదో ఒక ప్రకటన చెయ్యడం, రెండో వర్గం వాళ్ళూ దాన్ని ఖండిస్తూ మళ్ళీ ప్రకటన చెయ్యడం, ఇలా గొడవ రగిలిస్తున్నారు. ఆ తరువాత ప్రతీ టివి చానల్లో చర్చ జరపడం, మళ్ళీ అక్కడ అరుపులు, కేకలు. ఇవన్నీ సామాన్యులకి చిరాకు తెప్పిస్తున్నాయి.
నాయకుల్లారా, దయచేసి 2019 ఎన్నికల వరకూ ఎక్కువ మాట్లాడకండి, ప్రశాంతంగా ఉండండి. పార్లమెంటుని సజావుగా జరగనివ్వండి. ఎన్నికల ముందు మళ్ళీ మీ రాజకీయాలు మొదలుపెట్టండి. అంతవరకూ వీలైతే ప్రజలకు సేవ చెయ్యండి. లేకపోతే మా మానాన మమ్మల్ని వదిలెయ్యండి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇన్నేళ్ళూ ఎలా బతికేసామో, ఇక ముందు కూడ అలాగే బతికేస్తాము. మీరు ఎప్పటిలాగే VIPల్లా దర్జాగా బతకండి. మీ సదుపాయాలకి, మీ దారికి మేము అడ్డు రాము.
మేధావులు, సెలబ్రీటీల్లారా, మా కోసం మీరు గొంతు చించుకోనక్కర్లేదు. నిజంగా మీరు సమాజానికి సేవ చెయ్యాలనుకుంటే, అది మీరు చేసే పనిలో చూపించండి, మీ స్టేట్మెంట్లలో కాదు. మీ సౌకర్యాలకి ఈ దేశంలో ఏ లోటూ ఉండదు. మీకు మానవ సేవలు ఇక్కడ చౌకగా కూడా లభిస్తున్నాయి. మీరు కావలనుకున్నప్పుడు ఏ దేశానికైనా వెళ్ళగలరు. ఇంకెందుకు మీకు అసహనం?
శబ్ద కాలుష్యం తగ్గించడం కూడ స్వఛ్చభారత్లో భాగమే కదా! భారతీయులారా ప్రశాంతంగా ఉండండి. సైలెన్స్ ప్లీజ్ ఇండియా.
One Comment
leave one →
అల్లరి కుర్రాళ్ళు మాటల్తో చెప్తే వింటారా!
పాపం టీచర్లకి తలనొప్పి తప్పదు కదా!
బెత్తానికి పని చెప్పకుండా బుధ్ధి తెచ్చుకునే కాల్మా ఇది?!