విషయానికి వెళ్ళండి

వకాడా సాబ్

30/11/2015

సుమారు ఇరవయ్యేళ్ళ క్రితం నేను గుజరాత్‌లోని కఠియావాడ్ ప్రాంతంలో ఒక సిమెంట్ ఫాక్టరీ నిర్మించే కంపెనీలో పనిచేసేవాడిని. ఫాక్టరీ నిర్మించే ప్రదేశం చిన్న గ్రామం కాబట్టి, మాకు దగ్గరలోని ఒక చిన్న పట్టణంలో నివాస సదుపాయం కల్పించారు. అప్పటికి నాకు ఇంకా పెళ్ళి కాలేదు. నాలాంటి మరో ఐదుగురితో కలిసి ఒక ఇంటిలో ఉండేవాళ్ళం. మా ఆరుగురిలో ఇద్దరు తెలుగువాళ్ళం. మరొక వ్యక్తి తెలుగు బాగా తెలిసిన కన్నడిగుడు. మాకు భోజనానికి, టిఫినుకి మెస్ ఇంకోచోట ఉండేది. అక్కడ నుండే సైట్‌కి కంపెనీ బస్ బయలుదేరేది.

ఆ చిన్న పట్టణంలో ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉంది. ఆ స్టేషనుకి రోజుకి ఒకే ఒక పాసింజరు రైలు వచ్చి వెళ్ళేది. కాని గూడ్సు రైళ్ళు కొన్ని వచ్చేవి. మా రూము స్టేషనుకి అవతలి వైపు ఉండేది. అంటే మేము మెస్సుకి వెళ్ళాలన్నా, బజారుకి వెళ్ళాలన్నా ఆ స్టేషను దాటి వెళ్ళాలి. రైళ్ళు తక్కువే కాబట్టి, మేము పట్టాలు దాటుకుంటూ, స్టేషనులోనుండి ఊరిలోకి వెళ్ళేవాళ్ళం.

మా ఆరుగురిలో ముగ్గురు తెలుగు వచ్చినవాళ్ళ కావటంతో మిగతా రూముల్లో ఉండే తెలుగువాళ్ళు కూడ ఆదివారం మా రూముకి వచ్చేవారు. అక్కడ తెలుగు పత్రికలు దొరకవు కాబట్టి, మేము పోస్టులో కొన్ని తెప్పించుకునేవాళ్ళం. అలాగే ఎవరైనా ఊరికి వెళితే తెలుగు సినిమా కేసెట్లు తీసుకొచ్చేవారు. ఈ పత్రికలు, కేసెట్లుతో మాకు కాలక్షేపం అయ్యేది.

ఒక ఆదివారం మధ్యాహ్నం మేము మెస్సు నుండి తిరిగివస్తుంటే, స్టేషన్లోని ఒక ఉద్యోగి మమ్మలని ఆపి వకాడా సాబ్ మమ్మల్ని పిలుస్తున్నారని చెప్పాడు. ఈ వకాడా సాబ్ ఎవరా? మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారా? అని అడిగితే, ఆయన ఈ స్టేషన్‌కి సూపరిండెంట్ అని అక్కడ ఉన్న నేం బోర్డ్ చూపించాడు. దాని మీద ఎస్ ఎన్ వకాడా, స్టేషన్ సూపరిండెంట్ అని హిందీలో వ్రాసి ఉంది. అయినా ఆ వకాడా సాబ్ ఎందుకు మమ్మల్ని కలవాలనుకుంటున్నాడో మాకు అర్థం కాలేదు. సరే, మనలని ఏం చేస్తార్లే అని ఆ రూములోకి వెళ్ళబోయాము. అప్పుడు ఆ ఉద్యోగి, సాబ్ ఆఫీసులో లేరు, పక్కనే ఉన్న క్వార్టర్సులో ఉన్నారని అక్కడికి తీసుకు పోయాడు. ఆ సాబ్ ఇంటికి ఎందుకు పిలుస్తున్నాడా అని మాకు కంఫ్యూజన్ ఇంకా పెరిగిపోయింది.

ఆ స్టేషన్ బిల్డింగ్ పక్కనే ఉద్యోగులకు నాలుగైదు క్వార్టర్స్ ఉన్నాయి. అందులో ఒక క్వార్టర్లోకి మమ్మల్ని తీసుకెళ్ళి ఆ వకాడా సాబ్‌ని పిలిచి చిన్న ఉద్యోగి వెళ్ళిపోయాడు. క్వార్టర్లోంచి సుమారు యేభయ్యేళ్ళు దాటిన వకాడా సాబ్ బయటికి వచ్చి మమ్మల్ని అచ్చ తెలుగులో లోపలికి ఆహ్వానించారు. అది మాకు పెద్ద షాక్. ఊరు కాని ఊరిలో తెలుగులో మాట్లాడే ఈ వకాడా సాబ్ ఎవరా అని ఆశ్చర్యపోయాము. తరువాత ఆయనే మా సందేహలన్నీ తీర్చారు.

ఆయన తెలుగువాడే. ఎన్నో ఏళ్ళ క్రితం ఉద్యోగరీత్యా గుజరాత్ వచ్చి అక్కడే ఉండిపోయారు. ఆయన అసలు పేరు వాకాడ సూర్యనారాయణ. ఉత్తరాదిలో టైటిల్తో పిలిచే అలవాటు కాబట్టి, అది కాస్తా ఎస్ ఎన్ వకాడా అయిపోయింది. ఆయనా మా గోదావరి వాడే! స్వస్థలం తాడేపల్లి గూడెం అని చెప్పారు. మేము రోజూ స్టేషన్లోంచి వెళ్ళేటప్పుడు తెలుగులో మాట్లాడుకోవటం విని మమ్మల్ని పిలిచారట. ఆ ఊరిలో మేము మూడేళ్ళు పైనే ఉన్నాము. అప్పుడప్పుడు ఆయనని కలిసేవాళ్ళం. ఆ ఊరు వదిలిపెట్టాకా మళ్ళీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలియదు, కాని వకాడా సాబ్‌గా మాకు గుర్తుండి పోయారు.

 

2 వ్యాఖ్యలు leave one →
 1. 30/11/2015 18:18

  ఆ వకాడా ని పకోడా అని చదివి వచ్చా 🙂 చాలా బాగుంది మీ టపా !

  ‘దేశం కాని దేశం’ లో కొంత భాష తెలిసిన వాళ్ళు ఇట్లా తారస పడితే అదో ఇది (ఏది?) 🙂

  చీర్స్
  జిలేబి

 2. anon permalink
  01/12/2015 13:55

  బఖాళా బాత్ హై.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: