విషయానికి వెళ్ళండి

యమునా తీరంలో గోంగూర వనం

03/07/2016

ఇది సుమారు పుష్కర కాలం నాటి సంగతి. అప్పుడు నేను ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాదులో పని చేసేవాడిని. (నిజానికి అలహాబాదుని హిందీలో ఇలాహాబాద్ అని వ్రాస్తారు.) చాలా కాలం ఉత్తరాదిలో పని చెయ్యడంవల్ల నాకు మన తెలుగు వంటలు కొన్ని దూరమయ్యాయి. దోసకాయలు, బీరకాయలు లాంటి కూరగాయలు అక్కడ దొరకవు. కొన్ని వర్షాకాలం మాత్రమే దొరుకుతాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది మన ఆంధ్ర మాత గోంగూర. మన గోంగూర నార్త్‌లో ఎక్కడా నాకు కనపడలేదు. సెలవుల్లో సొంత ఊరికి వచ్చినప్పుడు ఊరగాయలతో పాటు గోంగూర పచ్చడి కూడ తీసుకువెళ్ళేవాళ్ళం. దిల్లీ లాంటి నగరాల్లో ప్రియ పచ్చళ్ళు దొరుకుతాయనుకోండి. అయినా మన ఇంటిలో చేసుకున్నంత రుచి రాదు కదా!

నేను పని చేసే కంపెనీకి అలహాబాదులో యమునా నదిపై ఒక పెద్ద వంతెన నిర్మించే కాంట్రాక్టు వచ్చింది. నేను కూడ కుటుంబసమేతంగా అక్కడకు షిఫ్ట్ అయ్యాను. అక్కడ మేము ఉండే ఇల్లు అలహాబాదులోనే ఉన్నా, వంతెనకి సంబంధించిన నిర్మాణ పనులు యమునా నదికి ఆవల తీరంలో ఉన్న నైనీ అనే చిన్న ఊరినుండి జరిగేవి. రాజమండ్రికి కొవ్వూరు ఎలాగో, అలహాబాదుకి నైనీ అలాగన్న మాట. ఈ నైనీ అన్న ఊరు సెంట్రల్ జైలుకి ప్రసిద్ధి. ఆ జైల్లోనే నెహ్రూ కుటుంబీకులని స్వాతంత్ర పోరాటకాలంలో నిర్బంధించి ఉంచారట. మా సైట్ ఆఫీసు, స్టోర్ మొదలైనవి నైనీ వైపే ఉండేవి.

yamuna

ఆ ప్రాజెక్టులో మాతో పాటు ఒక కొరియన్ కంపెనీ, మరి కొన్ని ఇండియన్ కంపెనీలు కూడ కలిసి పనిచేసేవి. కొరియన్ కంపెనీవాళ్ళు, ఆఫీసుతోపాటు గెస్టుహౌసులు, మెస్సులు కూడ అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి కావలసిన ఆహర పదార్థాలు చాలావరకు కొరియానుండి టిన్నులలో వచ్చేవి. కాని ఒక రకమైన తెల్లని కాబేజిని మాత్రం అక్కడే సుమారు ఒక ఎకరం భూమిలో పండించేవారు. వాళ్ళు కాబేజిని పండించడం చూసిన నాకు మనం కూడ అక్కడ గోంగూర ఎందుకు పెంచకూడదని అలోచన వచ్చింది.

మాతో పనిచేసే ఒక సూపర్‌వైజర్, వాళ్ళ సొంత ఊరు విజయనగరం వెళుతుంటే అతనికి చెప్పి కొన్ని రకాల కూరగాయల విత్తనాలు తెప్పించాము. అవి మా స్టోరు బయట ఉన్న కొంత ఖాళీ స్థలంలో వేసి పెంచాము. అయితే విజయనగరం విత్తనం మహిమో, యమునాతీరం నేల మహిమో తెలియదు కాని, గోంగూర మొక్కలు మాత్రం చక్కగా పెరిగాయి. ఎటువంటి చీడ, చిల్లులు లేని పచ్చటి, పుల్లని గోంగూర ఆకులు చాన్నాళ్ళకు చూసాము. మొదటిసారిగా ఉత్తరాదిలో గోంగూర పచ్చడి చేసుకుని తిన్నాము. తరువాత గోంగూర పప్పు, పులుసు, అలా కొన్నాళ్ళు గోంగూర అంటే విసుగెత్తేలా తిన్నాము. దిల్లీలో ఉండే మా బంధువులకి కూడ అక్కడకు వెళ్ళినపుడు ఇచ్చాము. ఎప్పుడూ పాలకూర పప్పు తినే హిందీ వాళ్ళకి కూడ పుల్ల పుల్లని గోంగూర పప్పు అలవాటు చేసి బాగుందనిపించాము. మాతోపాటు ఆ ప్రాజెక్టులో ఉన్న ఇతర కంపెనీల తెలుగువాళ్ళు, అక్కడ దగ్గరలోని ఒక PSUలో పనిచేస్తున్న తెలుగువాళ్ళకి కూడ ఇది తెలిసి మా దగ్గర నుండి గోంగూర తీసుకువెళ్ళారు.

Gongura Plant

మేము ఆకులు మాత్రమే జాగ్రత్తగా కోయడంతో గోంగూర మొక్కలు ఏపుగా మూడు నాలుగు అడుగులు ఎదిగాయి. కాస్తంత స్థలంలోనే ఒక చిన్నపాటి గోంగూర వనం తయారయింది. తరువాత పువ్వులు, కాయలు కూడ వచ్చాయి.  ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరు పేరుపాలెంలో చూసిన గోంగూర పువ్వులని మళ్ళీ అప్పుడు చూసాను. చిన్నప్పుడు మా అత్తయ్య వాటితో కూడ పచ్చడి చేసినట్టు గుర్తు.

అయితే కొన్నాళ్ళకి మా గోంగూర వనం అంతమయిపోయింది. ఉత్తరాదిలో శీతాకాలం చాలా చలిగా ఉంటుందని తెలుసుకాని, మొక్కలు ఎండిపోయేంత చలి ఉంటుందని అప్పుడే తెలిసింది. చలి తీవ్రత పెరగడంతో గోంగూర మొక్కలన్నీ ఎండకి మాడిపోయినట్టు చలికి ఎండిపోయాయి. మొక్కలన్ని చచ్చిపోవడంతో బాధపడ్డాము. కాని చలికాలం వెళ్ళిపోయాక మళ్ళీ విత్తనాలు చల్లి మా ప్రియమైన గోంగూరని మళ్ళీ పెంచుకున్నాము.

ఇదంతా ఇన్నాళ్ళకి ఎందుకు గుర్తుకు వచ్చిందంటారా? ఆ మధ్య ఏమీ తోచక “మాయాబజార్” సినిమా మళ్ళీ చూస్తుంటే అందులో శకుని అనుచరులు దుర్యోధనుడికి ఆంధ్రమాత గోంగూర అంటే చాలా ఇష్టమని, వెంటనే తెప్పించమని ఘటోత్కచుడి అనుచరులకి చెప్తారు కదా. అది చూసినప్పుడు గుర్తొచ్చిందన్నమాట. నిజానికి ఇప్పటికీ ఉత్తరాది వాళ్ళకి గోంగూర అంటే తెలియదు. కాని సినీకవులు ఏకంగా దుర్యోధనుడికే గోంగూర మహా ప్రీతి అని కల్పించి మన తెలుగువాళ్ళని రంజింపచేసారు.

 

ప్రకటనలు
One Comment leave one →
  1. 18/10/2017 08:05

    మీ ఈ గోంగూర-వన-భోగపు భోగట్టా బహుబాగు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: