అపరిమిత కాల్స్ కాలుష్యం – డిజిటల్ వినాశనం
03/09/2016
టెక్నాలజీ అనేది ఒక ఆయుధం లాంటిది. అది ఎంతవరకూ అవసరమో అంతవరకే వాడుకోవాలి కాని, ఉంది కదా అని అవసరానికి మించి ఉపయోగిస్తే వినాశనం జరుగుతుంది.
ఇప్పుడు రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న మొబైల్ సర్వీసు కూడ ఇలాగే అవసరానికి మించి వాడుకునే అవకాశం ప్రజలకి కల్పిస్తోంది. వాయిస్ కాల్స్ అన్నీ ఉచితమట. డేటా చార్జీలు కూడ మిగతా ఆపరేటర్లకంటే చాలా తక్కువ. అంటే వినియోగదార్లందరూ ఎప్పుడూ ఫోన్లలో మాట్లాడుతూనే ఉండచ్చు. నెట్ బ్రౌజింగ్ చేస్తూ, పాటలు, సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటూ, 24 గంటలూ సోషల్ మీడియాలోనే జీవితాన్ని గడిపేయవచ్చు.
ఒక దశాబ్దం క్రితంతో పోలిస్తే ఇప్పటికే మొబైల్ ఫోను చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. అది కాక గ్రూపులని, ఆఫర్లని, మరొకటని కొంతమంది ఇంచుమించు ఉచితంగానే మాట్లాడుకుంటున్నారు. దీనివలన ఫోన్ అన్నది ఇప్పుడు అవసరానికి ఉపయోగపడటం కాక టైం పాస్ వ్యవహారంలా, అది కూడ ముదిరి వ్యసనంలా తయారయ్యింది. దీనివలన ఎంత సమయం వృధా అవుతోంది? చేతిలో ఫోను, చెవుల్లో ఇయర్ ఫోన్ లేకుండా కనిపించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు యువతలో? విద్యార్థులు చదువుల మీద కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆఫీసుల్లో ఫోన్‌తో సమయం వృధా చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
డ్రైవర్లు మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ నడపడంవల్ల ప్రమాదానికి గురైన స్కూలు బస్సుల గురించి మనం వార్తలు చదువుతున్నాము. కార్లు, బైకులు డ్రైవింగ్ చేస్తున్నపుడు కూడ ఫోన్లలో మాట్లాడుతూ ప్రమాదాలు చేసేవాళ్ళు, రోడ్లపై నడుస్తున్నప్పుడు ఫోన్లలో మాట్లాడుతూ ప్రమాదం కొని తెచ్చుకునేవాళ్ళు బోలెడంతమంది. దీనికంతటికీ కారణం అతి తక్కువగా ఉన్న కాల్ చార్జీలే. ఇప్పుడు ఆ కాల్స్ కూడ ఉచితంగా చేసుకోవచ్చంటే, ఇక ఎవరూ ఫోన్లు వదలరు. ఇప్పటికే కాల్ డ్రాప్స్ పెరిగాయి. ఫోన్ వాడకం అపరిమితమయితే ఇంకా పెరుగుతాయి. అందుకోసం మరిన్ని సెల్ టవర్లు పెడతారు. దానివలన రేడియేషన్ కూడ పెరగవచ్చు.
ఫోన్ వాడకం అపరిమితమయితే కొన్ని వేల కోట్ల పని గంటలు వృధా అవుతాయి. రోడ్లపై ప్రమాదాలు పెరుగుతాయి. మనిషితో మనిషి సూటిగా మాట్లాడే సందర్భాలు తగ్గిపోతాయి. మానవ సంబంధాలు ఇంకా దెబ్బ తింటాయి. మానసిక సమస్యలు కూడ పెరగవచ్చు. డేటా చార్జీలు కూడ తగ్గటంతో వినియోగదారులు అనవసరమైన చెత్త అంతా ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకుంటారు. సినిమాల పైరసీ బెడద ఇంకా పెరుగుతుంది.
ఈ అపరిమిత కాల్స్ కాలుష్యం మనకు అవసరమా? ఇది స్వఛ్చ్ భారత్ అన్న భావనకి, నినాదానికి వ్యతిరేఖం కాదా? ఇది డిజిటల్ విప్లవం కాదు. డిజిటల్ వినాశనం.
ఈ కాల్స్ కాలుష్యం, డిజిటల్ వినాశనం నుండి మన దేశాన్ని రక్షించి, స్వఛ్చ్ భారత్ సాధించాలంటే ఉచిత కాల్స్, తక్కువ డేటా చార్జీలను ప్రభుత్వం నియంత్రించాలి. డిజిటల్ విప్లవానికి అవసరమైన సర్వీసులను మాత్రమే ప్రోత్సహించాలి. మిగతా వాటిని పరిమితంగా మాత్రమే ఉపయోగించుకునేలా మార్పులు చెయ్యాలి. అవసరమైతే వీటి మీద స్వఛ్చ భారత్ సెస్సు విధించాలి. ప్రజల ముఖ్య అవసరాలపై సెస్సు విధించటం మానేసి, ఇలాంటి వాటిపై స్వఛ్చ్ భారత్ సెస్సు అమలు చేస్తే బాగుంటుంది. ఒక్కో కాల్‌పై నిమిషానికి ఒక రూపాయి, డేటాపై ఒక్కో జిబికి పది రూపాయలు వసూలు చేసినా, ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి. స్వఛ్చ్ భారత్ కి నిధుల ఢోకా ఉండదు. చార్జీలు లేదా పన్నులు పెరిగితే, ప్రజలు అవసరమైనంతవరకే మొబైల్ ఫోన్ ఉపయోగించుకుంటారు. శబ్ద కాలుష్యం, ప్రమాదాలు తగ్గుతాయి. అన్నిటికి మించి ప్రజల విలువైన సమయం ఆదా అవుతుంది. స్వఛ్చ్ భారత్ సాకారమవుతుంది.
ప్రకటనలు
2 వ్యాఖ్యలు
leave one →
CALLushyam పై మీ వ్యాఖ్య ఆలోచింపచేస్తోంది. ఐననూ ప్రపంచం అంతటా నడుస్తున్న బిగ్ బిజినెస్సుల ‘ప్రజా’స్వామ్య ప్రభుత్వం లో ప్రజలు ఎక్కువగా ఆలోచించకూడదు. 😃
నేను మీరు చెప్పినది కచ్చితంగా అంగీకరిస్తాను..
కానీ ఎయిర్టెల్ లాంటి సంస్థల విపరీత రుసుముల దందాను ఆపాలంటే ఇలాంటి గట్టి పోటీ అవసరమే! ఇన్నాళ్ళు లేని ఆఫర్లు ఇప్పుడు ఎగపడి ఎలా ఇస్తున్నారు . జియో దెబ్బకే కదా..