విషయానికి వెళ్ళండి

INDIA – STUCK IN MONEY JAM

19/11/2016

నవంబర్ 8 రాత్రి ఎప్పటిలానే TV ఆన్ చేసి అమెరికా ఎన్నికలపై ప్రణయ్ రాయ్ విశ్లేషణ చూస్తున్నాను. స్క్రీన్ కింద కాసేపటిలో దేశప్రజలని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడతారని స్క్రోలింగ్ వచ్చింది. ప్రధాని అంతకు ముందే దేశాధ్యక్షుడిని, త్రివిధ దళాధిపతులని కలిసారని వ్రాసాడు. భారతదేశం బహుశా పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించబోతోందేమోనని భయపడ్డాను. అయితే ప్రధాని కాసేపు దేశపరిస్థితులని వివరించి, 500, 1000 నోట్లని రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే చాలా ఆనందపడ్డాను. ఇంతకాలానికి నల్లధనంపై యుద్ధం ప్రకటించే సత్తా ఉన్న ప్రభుత్వం వచ్చిందని గర్వపడ్డాను.

moneyjam

పెద్ద నోట్ల రద్దువల్ల దేశానికి ఎన్నో దీర్ఘకాల ప్రయోజనాలు ఉన్నాయి. అంతా మంచే జరుగుతుందని అనుకున్నాను. అయితే రోజులు గడిచే కొద్దీ, నోట్ల రద్దు ప్రభావం అర్థమయ్యింది. నగరాల్లో ఉండే ఉద్యోగులకి నోట్ల అవసరం తక్కువే. కాని చిన్న చిన్న వ్యాపారస్తులకి, రోజువారీ ఆదాయం సంపాదించుకునేవారికి చేతిలో నోట్లు లేకపోతే చాలా కష్టం. ఇక గ్రామాలు, చిన్న పట్టణాల్లో వారి పరిస్థితి ఇంకా ఘోరం. వీళ్ళందరికీ క్రెడిట్ కార్డులు ఉండవు. ఉన్నా తీసుకునే దుకాణాలు తక్కువ. చాలామందికి బాంక్ ఖాతాలు ఉండవు. వీళ్ళంతా కరెన్సీ లేకుండా రోజులు ఎలా గడపాలి? కూలి పనులు చేసుకునేవాళ్ళకి పని ఎవరు ఇస్తారు? రైతులు, పండ్లు, కూరగాయలు అమ్మేవాళ్ళు కొనుగోలుదారులు లేకపోతే వాటిని ఏమి చేసుకోవాలి? ఇలా వ్రాసుకుంటూపోతే ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు, ట్రక్కు డ్రైవర్లు, రోగులు, ఇంట్లో శుభకార్యాలు పెట్టుకున్నవాళ్ళు మొదలైన అందరికీ ఏమి చెయ్యాలో పాలుపోని పరిస్థితి.

దశాబ్దాలుగా మన దేశంలో కరెన్సీ మీద ఆధారపడ్డ ఆర్ధిక వ్యవస్థ ఉండడం దీనికి కారణం.ఇప్పుడు ఒక్కసారిగా నగదు చలామణిలో లేకుండాపోవడంతో వ్యవస్థ అంతా స్థంభించిపోయింది. ఎంతో జాగ్రత్తగా, పకడ్బందీగా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెపుతోంది. మరి ఇంత తీవ్రమయిన నిర్ణయం తీసుకునేముందు ఎన్ని కష్టాలు వస్తాయో ఊహించలేదా? ప్రధానంగా ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి.

మొదటిది నగదు చలామణిలో లేకపోవడం. బాంకులు పరిమితంగా నగదు మార్పిడికి, పాత నోట్ల జమకి అనుమతించినా పొడవాటి లైన్లతో బాంకులు కిక్కిరిసిపోయాయి. ATMలు ఇప్పటికీ పూర్తిగా పనిచెయ్యడంలేదు. వ్యాపారస్తులకి నగదు లేకపోవడం అంటే అర్థం, సైనికులకి ఆయుధం లేకపోవడమే. ఆయుధం లేకుండా సైనికుడు యుద్ధం ఎలా చెయ్యలేడో, నగదు లేకుండా వ్యాపారస్తుడు వ్యాపారం చెయ్యలేడు. వ్యాపారం తగ్గితే ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు తగ్గిపోతాయి. ఆదాయం తగ్గిపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుంది? సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు అవుతాయి?

1000 నోట్లు, 500 నోట్లు ఒకేసారి రద్దు చెయ్యడంతో ప్రజల దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. అలా కాకుండా 1000 నోట్లు మాత్రమే రద్దు చేసి ఉంటే సమస్య ఇంతగా ఉండేది కాదు. అసలు ఒక నెల ముందుగానే కొత్త 500 నోట్లు ATMల ద్వారా పంపిణీ చేసి ఉన్నా బాగుండేది. ప్రజల దగ్గర కొంతైనా నగదు ఉండేది. నిత్యావసరాలకి ఇబ్బంది ఉండేది కాదు. ద్రవ్యోల్బణం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఎన్ని 100 నోట్లు పట్టుకెళ్ళినా ఏమీ కొనగలిగే పరిస్థితి లేదు. ఆర్ధిక వ్యవస్థ మనుగడకి 500 నోట్లు చాలా అవసరం. ఇప్పటికయినా మించిపోయిందేమీ లేదు. 2014, ఆ తరువాత ముద్రించిన 500 నోట్లు చెల్లుతాయి అని ప్రకటిస్తే సమస్య చాలావరకు తగ్గుతుంది. కావాలంటే ఒకటి, రెండేళ్ళ తరువాత ఈ పాత నోట్లని చలామణి లోంచి తొలగించవచ్చు. విచిత్రం ఏమిటంటే పెద్ద నోట్లు రద్దు చేసామని చెబుతూ 2000 నోటు జారీ చెయ్యడం. దీనివలన తాత్కాలికంగా నల్లడబ్బు తగ్గినా, మళ్ళీ కొన్నేళ్ళకి ఇంకా ఎక్కువ తయారవుతుంది.

ఇక రెండో సమస్య, ఆర్ధిక వ్యవస్థ నుండి నల్ల ధనం తొలగిపోవడం. మనకి నచ్చినా, నచ్చకపోయినా, మంచైనా, చెడ్డైనా నల్ల ధనం మన ఆర్ధిక వ్యవస్థలో ఒక భాగం అయిపోయింది. ఎన్నో పరిశ్రమలు, వ్యాపారాలు నల్ల ధనం మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. దీనికి వ్యాపారస్తులనే తప్పు పట్టలేము. వాళ్ళ స్వార్థం ముఖ్య కారణం అయినా, మన వ్యవస్థలలో లోపాలు, రాజకీయ నాయకుల, ఉద్యోగుల అవినీతి కూడ దీనికి చాలవరకు కారణం. ఎంతోమంది ఈ పరిశ్రమల్లో, వ్యాపారాల్లో ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు నల్ల ధనం ఒక్కసారిగా తగ్గిపోతే కొంతమందికి ఉద్యోగాలు పోయి రోడ్డున పడతారు. దశల వారీగా నల్లధనం అదుపులో తీసుకువస్తే ఈ పరిశ్రమలు తమ పద్ధతులు మార్చుకొంటాయి. లేకపోతే కొన్ని పరిశ్రమలు, వ్యాపారాలు ఆగిపోయి దేశంలో ఆర్ధిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. GDP వృద్ధి రేటు ఈ సంవత్సరం తగ్గిపోతుందని అంటున్నారు. Ease of doing businessలో మన దేశం ప్రపంచంలో 130వ స్థానంలో ఉంది. ప్రొఫెషనల్‌గా కంపెనీలు నడపగలిగే పరిస్థితి మన దేశంలో ఇంకా పూర్తిగా లేదు. ఇందు కోసం వ్యవస్థలలో ఎన్నో మార్పులు తేవాలి.

కేవలం పెద్ద నోట్ల రద్దు వలన అవినీతి అంతం అయిపోదు. పది సంవత్సరాల UPA పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఆ కేసులన్నీ ఇప్పటికీ తెమలలేదు. CBI, ED లాంటి సంస్థలు పెట్టిన కేసులు త్వరగా పరిష్కరించి, అవినీతిపరులకి శిక్ష పడేలా చేస్తే మిగిలినవాళ్ళకి భయం కలుగుతుంది. ఆ అవినీతి సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. 

కేంద్ర ప్రభుత్వానికి మంచి మెజారిటి ఉంది. గొప్ప నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన ప్రధాని మోది గారికి ఉంది. మోది గారు, మీరు దూకుడుగానే నిర్ణయాలు తీసుకోండి. కాని పర్యవసానాలు బాగా ఆలోచించి తగిన ముందు జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకుంటే, ప్రజలు ఇబ్బంది పడకుంటా ఉంటారు. అంతే కాదు ప్రతిపక్షాలు విమర్శించడానికి అవకాశం ఉండదు. ఏమయినా ఒక్క విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఇది వాస్తవిక ప్రపంచం. దర్శకుడు “శంకర్” సినిమా కాదు.  

ప్రకటనలు
One Comment leave one →
  1. 19/11/2016 15:52

    నరేంద్రుడు తీసుకున్న నిర్ణయం మెచ్చుకో తగినదే. కానీ దాని వలన సామాన్య ప్రజలకు కలిగే ఇబ్బందులను ఊహించి, పరిష్కార మార్గాలతో అమలు చేయవలసింది.

    ఇది బ్యాంకుల నెత్తి మీద బరువు అయింది. రోజు రాత్రి 11 గంటల వరకు పనిచేసినా వారానికి 50 వేల కోట్ల రూపాయలు మాత్రమే కొత్త నగదుతో మార్చగలిగాయి.

    2000ల నోటు గురించి నరేంద్రుడు వివరణ ఇస్తే బాగుండేది. అయినా ఈ నిర్ణయం తీసుకోడానికి చాల దమ్ము ఉండాలి. తల తోక లేని వడ్డీ వ్యాపారాలు మూర్ఛపోయారు. కాష్ అవసరం లేని సమాజాన్ని సాధి స్తేనే ఇప్పటికైనా నల్ల ధనం ఆపే అవకాశం ఉంటుంది

    నీ టపా ప్రస్తుతం ప్రజల మనసులో ఉన్న సందేహాలని బయట పెట్టినట్టు అనిపించింది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: