విషయానికి వెళ్ళండి

రైతులకి కూడ MLC స్థానాలు కేటాయించండి.

09/04/2017

ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో MLC ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా కొన్ని పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల నియోజకవర్గాలనుండి కూడ MLC లు ఎన్నికయ్యారు. అంటే మన వ్యవస్థలో పట్టభద్రులకి, ఉపాధ్యాయులకి చట్ట సభలలో తమ వాణిని వినిపించే అవకాశం ఉంది. కాని దేశ జనాభాలో ముఖ్య భాగమైన, దేశానికి వెన్నెముక అయిన రైతులకి మాత్రం వాళ్ళ కష్టాలు చట్ట సభలలో చెప్పుకునే అవకాశం లేదు.

విత్తనాల కొనుగోలు నుంచి చేతికొచ్చిన పంట అమ్ముకొనేవరకూ రైతులు దళారులతో, వ్యాపారులతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇది కాక ప్రకృతితో పోరాటం సరేసరి. ఋణాలు, మాఫీలు రైతులకే అందుతున్నాయో లేక భూస్వాములకీ, అసలు వ్యవసాయం చెయ్యనివాళ్ళకు చేరుతున్నాయో ఖచ్చితంగా చెప్పలేము.

మన దేశంలో ఆత్మహత్య చేసుకునేవాళ్ళలో కూడ రైతులదే ప్రముఖ స్థానం. ఇటీవల దేశ రాజధానిలో తమిళనాడుకి చెందిన రైతులు ఆత్మహత్య చేసుకున్న తమ సహచరుల కపాలాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారంటే మనం మధ్యయుగాల్లో ఉన్నమో, ఆధునిక కాలంలో ఉన్నామో అర్థం కాకుండా ఉంది.


నేను వ్యవసాయ కుటుంబం నుంచి రాలేదు కాబట్టి నాకు రైతుల సమస్యలు పూర్తిగా తెలియవు. కాని ప్రకృతితో, ప్రభుత్వంతో, దళారులతో ఎప్పుడూ పోరాడే రైతులకి చట్టసభలలో ప్రత్యేకంగా ప్రాతినిధ్యం కల్పిస్తేనైనా, వాళ్ళ సమస్యలకి సరైన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. బహుశా స్వాతంత్రం వచ్చిన కొత్తలో రైతులే ఎక్కువగా ప్రజప్రతినిధులుగా ఎన్నికయ్యేవారు అనుకుంటాను. అందుకే ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు రైతులకి ప్రత్యేకంగా ప్రాతినిధ్యం కల్పించి ఉండరు. కాని ఇప్పుడు మాత్రం, సివిల్ కాంట్రాక్టర్లు, లిక్కర్ కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఈ రోజు సామాన్య రైతులెవరూ ఎన్నికలలో పోటీ చెయ్యగలిగే పరిస్థితి లేదు. మరి రైతులకి సభలలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు?

ఇప్పుడున్న ప్రజాప్రతినిధులందరూ సభలలో రైతుల గురించి కంటితుడుపుగా మాట్లాడతారు కాని, సమస్యలు మాత్రం ఎప్పటికీ పరిష్కరించరు. రైతుల సమస్యలు వాళ్ళకి రాజకీయాలు చెయ్యటానికి చక్కటి అవకాశాలుగా మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అలా కాకుండా రైతుల సమస్యలు రైతులే చట్ట సభలలో చర్చించి ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు, పరిష్కారాలు చూపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే, రైతులకి చట్ట సభలలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలి.

అందుకోసం కనీసం జిల్లాకి ఒకరైనా రైతు MLC ఉండేలా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. నిజంగా వ్యవసాయం చేసేవాళ్ళకి మాత్రమే అవకాశం లభించేలా జాగ్రత్తలు కూడ తీసుకోవాలి. రైతు నియోజకవర్గాల్లో ఓడిపోతే తమ ప్రభుత్వానికి రైతుల మద్దతు లేదన్న విమర్శ వస్తుందన్న భయంతోనైనా అధికారంలో ఉన్నవాళ్ళు రైతు సమస్యలపై దృష్టి సారిస్తారు.
పంచ్ డైలాగుల భాషలో చెపితే కాని అర్థం కాని జనాలకి గతంలో నేను వ్రాసిన వాళ్ళింకా క్యూల్లోనే ఉన్నారు టపాలోని మాటలు మళ్ళీ వ్రాస్తున్నాను. రైతుల సమస్యలని మన సమస్యలుగా పరిగణించి సత్వరం పరిష్కరించాలి. ఎందుకంటే “అమ్మకి కోపం వస్తే అన్నం వండదు. కాని రైతుకి కోపం వస్తే అన్నమే ఉండదు.”

5 వ్యాఖ్యలు leave one →
 1. విన్నకోట నరసింహారావు permalink
  09/04/2017 09:35

  బ్రహ్మాండమైన ఐడియా 👌👏. కానీ ఇలా బ్లాగుల్లో మాత్రమే అనుకుంటే సరిపోదు. వార్తాపత్రికలలో కూడా వ్రాయాలి (Letters to the Editor). ముఖ్యమంత్రి గారికి ఇ-మెయిల్ ఇవ్వాలి. తనది వ్యవసాయ కుటుంబం అంటారుగా, కాబట్టి సానుకూలంగా ఆలోచించే అవకాశాలు ఉండచ్చు.

 2. 10/04/2017 05:39

  “అమ్మకి కోపం వస్తే అన్నం వండదు. కాని రైతుకి కోపం వస్తే అన్నమే ఉండదు.”

  ఇది నిజంగా నిజం!

 3. 14/04/2017 14:49

  విన్నకోట గారు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. గతంలో కొన్ని సార్లు ఆ ప్రయత్నం కూడ చేసానండి. కాని స్పందన ఏమీ కనపడలేదు. తెలుగు బ్లాగులని మీడియాతో సహా ఎవరూ పట్టించుకోరనుకుంటాను.

  లలిత గారు, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

 4. 15/04/2017 15:25

  అసలు రైతు అంటే ఎవరు? వంద ఎకరాల మాగాణి కౌలుకు ఇచ్చి పట్టణాలలో బెంజ్ కారుల్లో తిరిగేవారు కూడా మేము రైతులమని చెప్తారు. పక్కనే పారే కాలువ నీళ్లతో మూడు పంటలు వేసుకొనే వాళ్ళూ రైతులే, అర ఎకరం మెత్త పొలంలో ఆరుతడి పంట వేసుకొని వాన కోసం ఎదురు చూసే వారూ రైతులే. భూమిహీన కౌలు రైతులు & వ్యవసాయ కూలీలను మాత్రం ఎవరూ రైతులుగా గుర్తించరు.

  చట్ట సభలలో గ్రామీణ వర్గాలకు ప్రాతినిధ్యం లేదనుకోవడం పొరపాటు. ఎవరో కొందరిని మినహాయిస్తే పెద్ద పదవులలో ఉన్న వారందరూ గ్రామీణ నేపధ్యానికి చెందిన వారే. ఒకటి రెండు తప్ప పార్టీలన్నీ వారి చేతులలోనే ఉన్నాయి.

  రైతే లేకపోతే అన్నం ఉండదు నిజమే కానీ ఇదే మాట పరిశ్రమలకు/వర్తకులకు/ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుంది. అన్ని వర్గాలూ ముఖ్యమే. ఇది గుర్తించకపొతే “సైనికులు లేకుంటే భద్రత ఉండదు కనుక మేమే గొప్ప” తరహా వాదనలు మొదలు అవుతాయి.

  ఇక ఎంఎల్సీ సీట్లకు వస్తే ఆంద్ర రాష్ట్రంలో మొత్తం టీచర్ ఎంఎల్సీలు అయిదుగురు మాత్రమే.

 5. avndp permalink
  09/12/2020 16:16

  మంచి సూచన. కానీ వీరిని ఎవరు ఎన్నుకోవాలి? రైతులు రైతులకు మద్దతు తెలిపేంత ఐక్యత ఉన్నదా? లోపాలను అధిగమించేలా విస్తృత చర్చ జరిపి మీ ఆలోచన ప్రకారం నిజమైన రైతులకు అవకాశం కలిగేలా చేస్తే మంచిదే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

<span>%d</span> bloggers like this: