విషయానికి వెళ్ళండి

పోలవరం జిల్లా ఏర్పాటుచెయ్యండి

05/09/2017

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యావసరమైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు శరవేగంతో జరుగుతున్నాయి. మరో ఏడాది కాలంలో ఒక దశ పనులు పూర్తి చెయ్యాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే ప్రాజెక్టు సకాలంలో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ప్రాజెక్టుతో ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలు అంటే నిర్వాసితుల సమస్యలు కూడ ప్రభుత్వం త్వరగా పరిష్కరించవలసి ఉంటుంది. నిర్వాసితులకి పరిహారం చెల్లించడం, పునరావాసం, అనుమతులు, వివిధ శాఖల మధ్య సమన్వయం మొదలైనవి చాలా ముఖ్యమైన పనులు. దీనికి ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా పనిచెయ్యాలి. అందుకు ఉభయ గోదావరి జిల్లాల అధికారులు సమన్వయంతో పని చెయ్యాలి. ఆ అధికారులకి ఈ ప్రాజెక్టు పని మాత్రమే కాకుండా, రెండు జిల్లాలలోని ఇతర ప్రాంతాల వ్యవహారాలు కూడ చూడవలసి ఉంటుంది. అలా కాకుండా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఒకే జిల్లా పాలనాయంత్రాంగం అజమాయిషీలో ఉంటే, యంత్రాంగం ఇంకా సమర్ధంగా, వేగంగా పని చెయ్యగలుగుతుంది.

అందుకోసం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు జరుగుతున్న ప్రాంతాలు, ముంపుకి గురయ్యే ప్రాంతాలు కలిపి పోలవరం జిల్లాగా ఏర్పాటు చేస్తే ప్రాజెక్టుకి పాలనాపరమైన వెసులుబాటు వస్తుంది. అలాగే కొత్త జిల్లాకి అధికారులుగా గతంలో ప్రాజెక్టు పనులు జరిగిన ప్రాంతాలలో పని చేసినవాళ్ళని నియమిస్తే వాళ్ళ అనుభవం కూడ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నిర్వాసితుల పునరావాసం, సమస్యలు పరిష్కరించిన అనుభవం ఉన్న కలెక్టరుని కొత్త జిల్లాకి నియమిస్తే పనులు సాఫిగా, త్వరగా జరుగుతాయి. అనుమతుల కోసం అధికారులు ఏలూరుకో, కాకినాడకో వెళ్ళవలసిన అవసరం ఉండదు.

తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కి బదిలీ అయిన ముంపు మండలాలతోపాటు పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల మండలాలు కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చెయ్యవచ్చును. ప్రాజెక్టు పరిధిని బట్టి అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాలలోని మరి కొన్ని మండలాలు కూడ ఇందులో కలపవచ్చును. కేవలం ప్రాజెక్టు నిర్మాణంలోనే కాకుండా, భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణ విషయంలో కూడ ప్రాజెక్టు మొత్తం ఒకే జిల్లా పరిధిలో ఉండడం ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

8 వ్యాఖ్యలు leave one →
 1. విన్నకోట నరసింహారావు permalink
  24/08/2020 12:14

  విభజనలో కేంద్రం చేసిన ఒక మంచి పని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్ర రాష్ట్రానికి బదిలీ చెయ్యడం. లేకపోయినట్లయితే పునరావాసం వగైరాలకు పొరుగు రాష్ట్రం వారి చిత్తం మీద ఆధారపడవలసి వచ్చేది. ఇప్పుడు ఒకే రాష్ట్రానికి చెందిన రెండు జిల్లాల మధ్య సమన్వయం గురించి మాత్రమే మాట్లాడుతున్నది అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం గురించి ఆందోళన పడవలసి వచ్చేది, ప్రాజెక్ట్ పూర్తవడం కూడా సాగతీత అయ్యే ప్రమాదం ఉండేది బహుశః. అ గ్రామాలు ఆంధ్రాకు వచ్చి ఆంధ్ర రాష్ట్రం నెత్తిన పాలు పోసినట్లయింది.

  మీరన్న జిల్లాల మధ్య సమన్వయానికి అసలు అ ప్రాంతాన్ని వేరే జిల్లాగా ప్రకటించడం ఐడియా అయితే బాగానే ఉంది. కానీ కొత్త జిల్లా అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని? అసలే నిధుల కొరతలో ఉన్న రాష్ట్రం, ప్రస్తుతం అన్నన్ని కొత్త జిల్లాలు అవసరమా అనిపిస్తుంది నా మటుకు నాకు.

  బదులు ఒక పని చెయ్యవచ్చేమో? అ ముంపు గ్రామాలనన్నిటినీ ఏదో ఒక జిల్లాకు మాత్రమే అప్పగించేస్తే నయం. వాటిలో కొన్ని గ్రామాల లొకేషన్ పరంగా ఇది వినడానికి విచిత్రంగా ఉంటుందేమో, అధికారుల పర్యటనలకు కాస్త రౌండ్-ఎబౌట్ అవుతుందేమో ….. కానీ సమన్వయం సమస్యను అధిగమించడానికి, ప్రాజెక్ట్ / పునరావాసం పనులు వేగవంతం చెయ్యడానికి అది ఒక మార్గం అనిపిస్తుంది.

 2. విన్నకోట నరసింహారావు permalink
  24/08/2020 22:12

  బోనగిరి గారు,
  మీ ఈ టపా క్రింద ఇవాళ ఉదయం నా వ్యాఖ్య ఒకటి పెట్టాను, కానీ ఇంతవరకు ఇక్కడ కనిపించడం లేదు. కామెంట్ బాక్స్ కు కొంచెం పైన “One Comment” అని చూపిస్తోంది, కానీ దాని మీద క్లిక్ చేసినా కూడా కామెంట్ మాత్రం కనబడడం లేదు (అది నా కామెంటే అయ్యుంటుందని అనుకుంటున్నాను 🙂 ). పొద్దుటి నుండి ఇంత వరకు కూడా ప్రత్యక్ష్యం అవలేదంటే … ఎక్కడయినా ఇరుక్కుందేమో కాస్త చూడగలరా ప్లీజ్? థాంక్స్.

 3. 24/08/2020 22:28

  అవునండీ, spam లోకి పోయింది.

 4. 25/08/2020 12:15

  విన్నకోట వారు, మీ స్పందనకు కృతజ్ఞతలు.
  పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతో పోలిస్తే కొత్త జిల్లాపై పెట్టే ఖర్చు పెద్ద ఎక్కువ కాదని నా ఉద్దేశం. ప్రాజెక్టు త్వరగా పూర్తయితే రాష్ట్రానికి ఎన్నో లాభాలు.

 5. విన్నకోట నరసింహారావు permalink
  25/08/2020 15:27

  బోనగిరి గారు,
  భిన్నాభిప్రాయాలుంటాయి లెండి, ఇబ్బందేమీ లేదు. మీరు సివిల్ ఇంజనీర్ అనుకుంటాను, కాబట్టి నీటి ప్రోజెక్టుల గురించి మీకే అధిక పరిజ్ఙానం ఉంటుంది. ఒక ప్రోజెక్ట్ ప్రాంతాన్ని, దాని ముంపు ప్రాంతాన్ని మొత్తం కలిపి ఒక ప్రత్యేక జిల్లాగా చేసినా, చెయ్యకపోయినా ప్రోజెక్ట్ నిర్మాణ వ్యయం ఏమీ మారదు. పూర్తి అయిన తర్వాత ఇక కాస్త తక్కువగా నిర్వహణ వ్యయం ఉంటుంది. కానీ ఒక కొత్త జిల్లాగా చేస్తే ఆ జిల్లా ఖర్చు శాశ్వతం. అది ఏటేటా పెరగటమే గానీ తగ్గటం ఉండదు.

  కొత్త జిల్లా చేస్తే దానికి కలెక్టర్ నుండి జాయింట్ కలెక్టర్లు, డెప్యూటీ కలెక్టర్లు, తహసిల్దార్లు, MRO ల వరకు అన్నీ కొత్త పోస్టులు పెట్టాలి. SP, ASP, DySP లు కొత్త పొజిషన్లు సృష్టించాలి. ఇది రెవెన్యూ, పోలీస్ శాఖల వరకే. ఇలాగే విద్యా శాఖ, న్యాయ శాఖ, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, సేల్శ్ టాక్స్ శాఖ, అటవీ శాఖ, వైద్య శాఖ, ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖలు, ఇలా ప్రతి శాఖ కొత్తది, ఇంకా, పలు రకాల కార్పొరేషన్లు, ఒక జిల్లా హాస్పిటల్ (GGH .. Govt General Hospital) …. అబ్బో ఒక జిల్లాకు ఉండే సమస్త హంగులు కావాలి కదా. వీట్లన్నిటికీ ఖర్చు తప్పదు. ఒక్క కలెక్టర్ ఆఫీసుకే జీతభత్యాల ఖర్చు సాలీనా రెండు మూడు కోట్లు ఉండదూ? ఇలా అన్ని శాఖలకున్నూ. ఇవి కాక ఈ ఆఫీసులకన్నిటికీ ఆఫీసు భవనాలు (కొత్తవో అద్దెవో), వాహనాలు, వగైరా వగైరా. ఇవేవీ తగ్గించుకో గలిగే ఖర్చులు కావు. పైగా ఇవి శాశ్వతంగా ఉండే ఖర్చులు కూడా.

  కాబట్టి ప్రోజెక్ట్ నిర్మాణ సౌలభ్యం కోసం ఆ ప్రాంతాన్నే ఒక జిల్లాగా మార్చడం అంటే – శ్లాఘించదగ్గ ప్రతిపాదనే – కానీ ఆ జిల్లాకు శాశ్వత ఖర్చు తడిసి మోపెడు అవ్వచ్చు … అని, బదులుగా ప్రోజెక్ట్ & ముంపు ప్రాంతాన్ని ఏదో ఒక జిల్లా అధినంలోనే ఉంచితే సమన్వయ ఇబ్బందులు తగ్గించవచ్చు అనీ నా అభిప్రాయం అని నేను చెప్పదలుచుకున్నది. అంతగా కావాలంటే ప్రోజెక్ట్ పూర్తి అయిన తర్వాత, పునరావాసం ముగిసిన తర్వాత ముంపు గ్రామాలను వాటి వాటికి దగ్గరగా ఉన్న జిల్లాకు బదిలీ చెయ్యవచ్చు.

 6. 28/08/2020 19:02

  ఇది చాలా మంచి ఐడియా . ప్రగతికి ఇలా ఓ జిల్లాను చేయడమే ఉత్తమం. ఫోకస్ బాగా వుంటుంది జిల్లా కూడా అతి త్వరలో ముందంజ వేస్తుంది. జనాళికి దండిగ ఉద్యోగాలు లభ్యమవుతాయి. ఓ రెండు తరాలు జీవించడానికి ఆ పై కొన్ని తరాలు బతికి బట్టకట్టడానికి అవకాశాలు మెండు.

  నా చేతిలో వుంటే వెంఠనే సేంక్షన్ చేసేసి వు‌ందును .

  ఇట్లు

  జిలేబి

 7. 28/08/2020 21:45

  🙏

Trackbacks

 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు. | ఆలోచనాస్త్రాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: