విషయానికి వెళ్ళండి

పుట్టింటికి దారేది?

17/09/2017

టపా టైటిల్ చూసి ఇదేదో పవన్ కళ్యాణ్, త్రివిక్రంల కొత్త సినిమా పేరు అనుకుంటున్నారా? అదేమీ కాదు. ఇది నేను చదివిన ఒక కథకి సంబంధించిన టపా. ఆ కథ చదివాకా అసలు ఇలాంటి కథలు కూడ ఉంటాయా? అని ఆశ్చర్యపోయాను. ఇది కథ లాంటి నిజం. నిజానికి ఇది కథ కాదు, వ్యథ. మీరెవరైనా “వంశీకి నచ్చిన కథలు” పుస్తకం చదివి ఉంటే, ఈ కథ కూడ చదివి ఉంటారు. ఆ కథ పేరు “తెగిన పేగు” రచయిత పేరు పిశుపాటి ఉమామహేశం.

ఈ కథ కథాకాలానికి డెబ్బయి యేళ్ళ క్రితం అంటే ప్రస్తుతానికి బహుశా సుమారు ఒక శతాబ్దం క్రితం కేరళలో మొదలవుతుంది. అవి మన ఆంధ్రప్రాంతంలో కన్యాశుల్కం రోజులు. ఎక్కువ శుల్కం ఇచ్చుకోలేని పేదవాళ్ళు, కేరళ ప్రాంతంలో ఆడపిల్లలు ఎక్కువ కాబట్టి అక్కడనుండి పేద కుటుంబాల వధువులని తక్కువ ధరకే “కొని” తెచ్చుకునేవారు. అలా అయిదేళ్ళ ప్రాయంలో నూట అరవై రూపాయలకు అమ్ముడుపోయి వలస వచ్చిన ఒక డెబ్బయి అయిదేళ్ళ ముసలి తల్లి తాను చనిపోయేలోగా ఒక్కసారైనా తన పుట్టిన ప్రాంతానికి వెళ్ళి, తనవాళ్ళని కలవాలని ఆశపడుతుంది.

ఏదో దక్షిణదేశ యాత్రల సందర్భంగా కేరళ వైపు వెళ్ళే అవకాశం వచ్చిన కొడుకు, తల్లిని తీసుకుని అక్కడకు పయనమవుతాడు. కాని ఆ ముసలి తల్లికి తన ఊరు పేరు కాని, తల్లిదండ్రుల పేర్లు కాని సరిగ్గా గుర్తుండవు. వలస వచ్చిన తరువాత ఆమె తన గతాన్నంతా ఇంచుమించు మరిచి పోయి జీవిస్తుంటుంది. చిన్న వయసులోనే ఆమెని తీసుకుని వచ్చేసారు మరి. పాల్ఘాట్ దగ్గర ఏదో చిన్న ఊరని మాత్రమే ఆమెకు జ్ఞాపకం ఉంటుంది. అక్కడకు వెళ్ళాకా పరిసరప్రాంతాల ఊర్ల పేర్లన్నీ ఆమెకు చెపితే, తన ఊరు పేరు గుర్తుపడుతుంది. తీరా ఆ ఊరు వెళ్ళాకా, తన పుట్టిల్లు ఎక్కడో తెలియదు. ఏదో గుడి పక్కన ఇల్లని ఆమెకు లీలగా జ్ఞాపకం. అలా గుళ్ళన్నీ వెతికితే చివరికి ఆమె పుట్టిల్లు దొరుకుతుంది.

కాని ఆమె పుట్టింటి వద్ద ఆమెని గుర్తుపట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆమె తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు. ఆమె అన్నదమ్ముల్లో ఒకడు తన కుటుంబంతో ఆ ఇంట్లో ఉంటాడు. వాళ్ళు ఇప్పటికీ పేదవాళ్ళుగానే ఉంటారు. ఆ ఇంట్లోని కొన్ని పరిసరాలని ఆమె గుర్తు తెచ్చుకుంటుంది. ఇంతలో ఊరిలో అందరికన్నా పెద్దవాడయిన ఒక ముసలాయన వచ్చి ఆమెని గుర్తు పడతాడు. ఆ అన్నాచెల్లెళ్ళని కలుపుతాడు. అది ఒక విచిత్రమైన బంధం. ఒక తల్లికి పుట్టారు. కాని అయిదేళ్ళకే విడిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకి అనుకోకుండా కలిసారు. ఇప్పుడైనా మళ్ళీ కలిసి ఉండలేరు. బహుశా మరెప్పుడూ కలుసుకోరు. ఒకరి భాష ఒకరికి రాదు. ఆమె కొడుకు, ఇంగ్లీష్ వచ్చిన ఒక మళయాళీ, అన్నీ అనువదించి చెపుతుంటారు. ఆ ఇంట్లో ఒక కాఫి మాత్రం తాగి తల్లీకొడుకులు తిరుగు ప్రయాణమవుతారు.

నేను ఈ కథ చదివి చాల ఏళ్ళు అయ్యింది. అయితే ఇప్పుడు గుర్తుకురావడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే ఈ మధ్య టాటా స్కై లో కిడ్స్ మూవీ చానల్లో ఒక సినిమా చూసాను. దాని పేరు “గౌరు – జర్నీ ఆఫ్ కరేజ్”. ఈ సినిమా కథ కూడ ఇంచుమించు తెలుగు కథలానే ఉంటుంది.

ఈ సినిమాలో కూడ ఒక అవ్వ ఉంటుంది. ముసలి వయసులో చావుకు దగ్గరగా బతుకుతుంటుంది. వాళ్ళది రాజస్థాన్‌లోని గొర్రెలకాపర్ల కుటుంబం. ఆమె ఎప్పుడో తన చిన్నప్పుడు పెళ్ళయి వందల కిలోమిటర్ల దూరంలో ఉన్న అత్తింటికి వచ్చేస్తుంది. పరిస్థితి బాగోక మళ్ళీ పుట్టింటికి వెళ్ళే అవకాశం ఆమెకి రాదు. కాని ఎప్పటికయినా తన పుట్టింటికి వెళ్ళి తన అన్నను కలుసుకోవాలని ఆమె ఆశ. కాని అది పేదవాడయిన ఆమె కొడుకు వల్ల కాదు. అప్పులు తీర్చడం కోసం కొడుకు, కోడలు పట్నంలో పనిచెయ్యడానికి వెళ్ళిపోతారు.

ఆ ప్రాంతానికి అప్పుడు కరువు వస్తుంది. ఊరిలోని గొర్రెలకాపర్లందరూ తమ గ్రామం విడిచిపెట్టి తమ గొర్రెలతో కాస్తంత పచ్చగా ఉన్న ప్రాంతాలకి వలస వెళ్ళడానికి ప్రయాణమవుతారు. ఈ అవ్వ పదమూడేళ్ళ మనవడు గౌరు వాళ్ళ కుటుంబం గొర్రెలను తీసుకు వెళ్ళాలి. అవ్వ తన పదేళ్ళ మనవరాలితో ఊరిలోనే ఉండాలి.

కాని వాళ్ళు వెళ్ళబోయే ప్రాంతం తన అవ్వ పుట్టిల్లు ఉన్న “కంకడ్” గ్రామానికి దగ్గరలో ఉందని తెలుకున్న గౌరు తన బామ్మని ఎలాగైనా అక్కడకి తీసుకునివెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. దానికి గ్రామపెద్ద ఒప్పుకోడు. అయినా ఆ మనవడు బామ్మకి ఒక గాడిద అంబారీ తయారుచేసి తన చెల్లెలితో వెనకాలే రమ్మని ప్రయాణమవుతాడు. దారిలో ఇది గమనించిన గ్రామపెద్ద ఒక రాత్రి వీళ్ళని ఒదిలేసి మిగతావాళ్ళతో వెళ్ళిపోతాడు. అయినా పట్టుదలతో గౌరు ఎడారికి అడ్డంపడి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, ఎన్నో మజిలీల తరువాత తన చెల్లెలితో సహా తన బామ్మని ఆమె అన్న దగ్గరకు చేరుస్తాడు.

“పాపం పసివాడు” సినిమాలోలా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొన్న ఆ చిన్నారిని చూస్తే నాకు “లగాన్” సినిమాలో అమీర్ ఖాన్ గుర్తొచ్చాడు. అంతకంటే బాగా చేసాడు. ఎక్కడా బోరు కొట్టని అద్భుతమైన సినిమా ఇది. ఒక విధంగా చెప్పాలంటే ఇది యువతరానికి స్పూర్తినిచ్చే సినిమా. వీలైతే మీరు కూడ తప్పక చూడండి.

ఈ సినిమా చూసిన తరువాత కొన్నేళ్ళ క్రితం చదివిన ఆ కథ గుర్తొచ్చింది. రెండూ ఒకలాంటి కథలే. నేపధ్యమే వేరు. ఇంచుమించు ఒక శతాబ్దం తరువాత కూడ ఆడవాళ్ళలో కొంతమంది పరిస్థితి అలాగే ఉంది. కన్యాశుల్కం కాలంలో అయినా, వరకట్నం రోజుల్లో అయినా నష్టపోయింది స్త్రీలే. ఈ సమస్యకి ఒక్కటే కారణం, స్త్రీలకి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం. ఈ ఇరవయ్యొకటో శతాబ్దంలో మాత్రం చాలామంది స్త్రీలు చదువుకుని ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్వతంత్రంగా బతుకుతున్నారు. భవిష్యత్తు ఇంకా బాగుంటుందని ఆశిద్దాము.

 

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: