పెద్ద నోట్ల తద్దినం
సరిగ్గా ఇవ్వాల్టికి పెద్ద నోట్లు రద్దయి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరకాలంలో ఏమైనా అద్భుతాలు జరిగాయా అని పరిశీలిస్తే స్టాక్ మార్కెట్ సూచీలు పెరగడం, పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెరగడం తప్ప ఇంకేమీ జరగలేదు. నోట్ల రద్దు అయిన కొన్ని నెలల వరకు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయరంగంలోని వారు కూడ అష్టకష్టాలు పడ్డారు. నిరుద్యోగ సమస్య అలాగే ఉంది. నిర్మాణ రంగం బాగా దెబ్బతింది.
నగరాల్లో ఉండే ఉద్యోగులకి నోట్ల అవసరం తక్కువే. కాని చిన్న చిన్న వ్యాపారస్తులకి, రోజువారీ ఆదాయం సంపాదించుకునేవారికి చేతిలో నోట్లు లేకపోతే చాలా కష్టం. ఇక గ్రామాలు, చిన్న పట్టణాల్లో వారి పరిస్థితి ఇంకా ఘోరం. సాధారణ పౌరులు గంటలకొద్దీ లైన్లలో నిలబడి నాలుగు వేలు, పది వేలు తీసుకోగలిగితే కొంతమంది కోటీశ్వరులు తమ కోట్లాది రూపాయలను సులభంగా మార్చుకోగలిగారు. అసలు 500, 1000 లాంటి పెద్ద నోట్లు రద్దు చెయ్యడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే అంతకంటే పెద్దదైన 2000 నోటు ఎందుకు తెచ్చారో ఇప్పటివరకు చెప్పలేదు. అంతకంటే దారుణం ఏమిటంటే, ముద్రించబడిన 2000 నోట్లు ఎవరికి ఎన్ని ఇచ్చారో, అవన్నీ ఎక్కడికి చేరాయో లెక్క చెప్పలేదు. అసలు బ్యాంకుల వద్ద అయినా ఆ వివరాలు ఉన్నాయో లేదో తెలియదు. ఇప్పటికైనా 2000 నోట్లు ఎవరికి ఎన్ని ఇచ్చారో లెక్క తేల్చగలిగితే బోలెడంత నల్లధనం బయటికొస్తుంది.
ప్రభుత్వ ఉద్దేశం నల్లధనం వెలికితీయడమే అయితే, కేవలం 1000 నోటు ఒక్కటే రద్దు చేసి ఉంటే సరిపోయేది. 2000 నోటు ముద్రించే అవసరం ఉండేది కాదు. 500 నోట్లతో ప్రజల అవసరాలు చాలావరకు తీరేవి. 90 శాతం మందికి ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. అప్పుడు 1000 నోట్లు కేవలం బ్యాంకు అకౌంట్లలోనే జమ చెయ్యాలనే నిబంధన పెట్టి ఉంటే సగం నల్లధనం అయినా పట్టుబడటానికి ఆస్కారం ఉండేది. అలా కాకుండా రెండు నోట్లూ రద్దు చేసి, ఆ తరువాత సవాలక్ష మినహాయింపులు ఇచ్చి మొత్తం ఒక ప్రహసనంలా తయారు చేసారు. ఈ మొత్తం వ్యవహారం కొండని తవ్వి ఎలకను పట్టిన చందంగా మిగిలింది. వెనక్కి రావనుకున్న పాత నోట్లు కూడ బ్యాంకులకి చేరి లక్ష్యం దెబ్బతింది.
కేవలం పెద్ద నోట్ల రద్దు వలన అవినీతి అంతం అయిపోలేదు. ఇప్పటికీ ACB దాడులలో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడుతున్నాయి. పది సంవత్సరాల UPA పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఆ కేసులన్నీ ఇప్పటికీ తెమలలేదు. CBI, ED లాంటి సంస్థలు పెట్టిన కేసులు త్వరగా పరిష్కరించి, అవినీతిపరులకి శిక్ష పడేలా చేస్తే మిగిలినవాళ్ళకి భయం కలుగుతుంది. ఆ అవినీతి సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే లక్షల కోట్ల ఆదాయం వస్తుంది.
భారతదేశం లాంటి పెద్ద దేశంలో, నూటపాతిక కోట్ల జనాభా కలిగిన దేశంలో ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి, తగిన జాగ్రత్తలు తీసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తాము. కాని ఈ నోట్ల రద్దు విషయంలో అటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించదు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ ఏ దేశాధినేత అయినా, ఇన్ని కోట్ల ప్రజల జీవితాలని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా అని నా అనుమానం.
పెద్దనోట్ల రద్దు “ఒకేఒక్కడు” తరహా పరిష్కారం. వ్యవవస్తని నమ్మని నాయకుడు (ఆయన విద్యాధికుడూకాదు) సొంతబుర్ర వాడి నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే తగలబడుతుంది.