విషయానికి వెళ్ళండి

ఇంటింటా రాజకీయం

26/12/2017

ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన గుజరాత్ ఎన్నికలు ముగిసాయి. బిజెపి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచింది. కాంగ్రెస్ కుల నాయకులని ప్రోత్సహించి, హోరాహోరీ పోరాడినా అధికారానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. అయితే ఈ ఎన్నికలు ఒక విషయాన్ని మళ్ళీ ఋజువు చేసాయి. అదేమిటంటే వెనుకబడ్డ బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలలోనైనా, అభివృద్ధి చెందిన గుజరాత్‌లోనైనా, మన దేశ రాజకీయాలలో కులం పాత్ర ఇప్పటికీ చాలా ఉంది. ఇప్పుడైతే గుజరాత్‌లో ఎన్నికలు ఇంత హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి కాని, ఒకప్పుడు అంటే ఒక ఇరవయ్యేళ్ళ క్రితం చాలా ప్రశాంతంగా, అసలు ఎన్నికలు జరుగుతున్నాయో లేదో అన్నట్టుగా ఉండేవి.

“ఆప్ కా ఆంధ్ర మే ఘర్ ఘర్ మే రాజ్‌నీతి హై”
సుమారు ఇరవయ్యేళ్ళ క్రితం విజయవాడలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన కొద్దిసేపటి తరువాత ఒక గుజరాతీ సహప్రయాణికుడు నాతో అన్న మాట ఇది. అప్పుడు నేను గుజరాత్‌లో పనిచేసేవాడిని. ఆ సహప్రయాణికుడు గుజరాత్ నుండి తరచుగా ఆంధ్రప్రదేశ్ వచ్చి వ్యాపారం చేస్తాడట. అతను అన్న మాటలో నిజం ఉంది. మనం ప్రతీరోజు, ప్రతీచోట రాజకీయాల గురించి మాట్లాడుకుంటాము. సినిమాలానే రాజకీయం కూడ మన నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయింది. మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాలలో ఈ జాఢ్యం ఉంది. నాకు తెలిసినంతవరకు దక్షిణాదిలో తమిళనాడు, ఉత్తరాదిలో యుపి, బీహార్‌లు, లెఫ్ట్ పార్టీల స్థావరాలు కేరళ, బెంగాల్‌లలో కూడ ఈ రాజకీయాల గొడవ ఎక్కువగా ఉంది. మిగిలిన రాష్ట్రాలలో నేను అంతగా చూడలేదు.
నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు అక్కడ (1995 లో) అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నేను జీవితంలో మొదటిసారి ఓటు వేసింది కూడ అప్పుడే. నేను ఉన్న ప్రాంతం ఒక చిన్న మున్సిపాలిటీ. మన ఊళ్ళతో పోలిస్తే అక్కడ ఎన్నికల ప్రచారం చాలా తక్కువ. ఏ విధమైన హడావిడి లేదు. బేనర్లు, జెండాలు కొద్దిగా ఉండేవి. గోడల మీద వ్రాయడం కూడ తక్కువే. అసలు ఎన్నికలు జరుగుతున్నాయో లేదో అన్నట్టుగా ప్రచారం ఉండేది. చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గుజరాత్‌లో మొదటిసారి బిజెపి సొంతంగా అధికారంలోకి వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకూ బిజెపినే అధికారంలో ఉంది.

గుజరాత్ అప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రం. పారిశ్రామికంగా దేశంలో అగ్ర స్థానం కోసం మహారాష్ట్రతో పోటీ పడేది. అప్పుడు నాకు ఏమి అనిపించిందంటే ఎక్కడ రాజకీయాలు తక్కువగా ఉంటాయో అక్కడ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఒకే రాజకీయ వ్యవస్థలోనే ఉన్నా, వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి ఎందుకు వేరు వేరుగా ఉందో, ప్రజలు, ప్రభుత్వం ఆలోచించాలి. వీలైనంతవరకు అంతరాలని సరిదిద్దాలి. ప్రతీ విషయాన్నీ రాజకీయం చెయ్యడాన్ని తగ్గించాలి. బ్యూరోక్రసీ, జుడిషియరీ స్వతంత్రంగా పనిచేసేలా స్వేఛ్చ ఇవ్వాలి. ఏ వ్యవస్థలోనైనా ప్రొఫెషనలిజం ఉంటేనే సరైన విజయం సాధించగలం. కాని మన దేశరాజకీయాలలో అది చాలా తక్కువ. ఒక వేళ ఎవరైనా ఆ దిశగా ప్రయత్నించినా, మన ఓటర్లు వాళ్ళని వెంటనే ఓడించేస్తారు.

మన దేశంలో అధికార వికేంద్రీకరణ పేరు చెప్పి వార్డు మెంబరు నుండి ప్రధానమంత్రి వరకు ఎన్నో వ్యవస్థలు, ఎన్నో పదవులు, ఎన్నో ఎన్నికలు. వీళ్ళంతా ఏమి చేస్తారో ఎవరికీ తెలియదు. వీళ్ళలో ఎంతమందికి అధికారాలు ఉన్నాయో, నిధులు ఉన్నాయో తెలియదు. అసలు ప్రపంచంలో మరే దేశంలోనైనా రాజకీయాల మీద ఆధారపడి మన దేశంలోలా ఇంతమంది బతుకుతున్నారా? అని నా అనుమానం! వీళ్ళలో చాలామంది పరాన్నజీవులు (parasites) కాదా? పైగా వీళ్ళలో చాలామంది అవినీతిపరులు, సహజవనరుల దోపిడీదార్లు. ప్రపంచంలో మరే దేశంలోనైనా ఇన్ని వ్యవస్థలు ఉన్నాయో, లేవో పరిశీలించాలి. అనవసరమైన వ్యవస్థలని తీసివేస్తే ప్రజలమీద భారం తగ్గుతుంది. ఇన్ని వ్యవస్థలూ, ఇంతమంది నాయకులూ మనలని పాలిస్తున్నా, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా, మన ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయాము. నా చిన్నప్పటినుండి ఇదే మాట వింటున్నాను, “మనది అభివృద్ధి చెందుతున్న దేశం” అని. ఇంకెన్నాళ్ళు మనం ఇలాగే ఉంటామో?

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: