విషయానికి వెళ్ళండి

హోదా (వృధా) పోరాటం

29/04/2018

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం పోరాటం ఉధృతంగా నడుస్తోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా, అన్ని పార్టీలు ఇంచుమించు విడివిడిగా, కొన్ని కలిసి దీక్షలు, నిరసనలు, రాజీనామాలతో ఉద్యమాలు చేస్తున్నాయి. పార్టీలతోపాటు ఇతర సంస్థలు కూడ యధాశక్తీ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రప్రభుత్వం తెగేసి చెప్పిన తరువాత కూడ రాష్ట్రంలోని పార్టీలు పోరాటాలు, ఉద్యమాలు చెయ్యడం అంటే స్వార్థప్రయోజనాల కోసం ప్రజలని మభ్యపట్టడం తప్ప ఇంకేమీ కాదు. ఎన్నికలు ఇంకో సంవత్సరం ఉందనగా అన్ని పార్టీలూ తమ పార్టీల ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నాయి తప్ప ప్రత్యేక హోదా వస్తుందని నమ్మకంతో కాదు. కేంద్రానికి హోదా ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇప్పటికే ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళ పోరాటాలు, దీక్షలు, రాజీనామాలు చూసి భయపడి హోదా ఇచ్చేస్తుందనుకోవడం భ్రమ మాత్రమే. ఒక వేళ కేంద్రానికి సద్బుద్ధి కలిగి ప్రత్యేక హోదా ఇచ్చినా, పక్క రాష్ట్రాలు, ఉత్తరాదిలోని పేద రాష్ట్రాలు ఊరుకోవు.

నాలుగేళ్ళక్రితం ఇలాగే రాష్ట్ర విభజనకి వ్యతిరేఖంగా అందరూ సమైక్య ఉద్యమం చేసారు. కాని విభజన ఆగలేదు. జాతీయపార్టీలు రెండూ కూడబలుక్కుని విభజన చేసేసాయి. పార్టీలు, సంఘాలు, ప్రజలూ అంతా విభజన వద్దే వద్దని ఉద్యమం చేసారు కాని, ఒక వేళ విభజన అనివార్యమయితే మన రాష్ట్రానికి ఏమి కావాలని ఎవ్వరూ అడగలేదు. ఎవరైనా ఒకరిద్దరు ప్రాక్టికల్‌గా ఆలోచించి అడగాలని ప్రయత్నించినా వాళ్ళని సమైక్యద్రోహులుగా చిత్రించి నోరు నొక్కేసారు కాని వాస్తవాన్ని అర్థం చేసుకోలేదు. 1984 లో వచ్చిన “ఛాలెంజ్” సినిమా క్లైమాక్స్‌లో చిరంజీవి రావుగోపాలరావుతో ఇలా అంటాడు. “నువ్వు ఓడిపోతే నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్ళి చేస్తానని పందెం కాసావు కాని, నేను ఓడిపోతే, నీకు ఏమి ఇవ్వాలో అడగనంత పొగరు నీది” అని. ఇలాంటి పొగరుతోనే సీమాంధ్ర నాయకులు తెలంగాణా రాదని, రానివ్వమని ఉత్తర కుమారుల్లా ప్రగల్భాలు పలికారే కాని, ఒక వేళ తెలంగాణా ఇస్తే ఎలా ఇవ్వాలని కాని, సీమాంధ్రకి ఎలా న్యాయం చెయ్యాలని కాని ఎప్పుడూ మాట్లాడలేదు. దాని ఫలితమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తున్న కష్టాలు. అప్పుడే అన్ని విషయాలు మాట్లాడి పద్ధతిగా విభజన చట్టం చేయించి ఉంటే, ఇప్పుడు ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చేది కాదు.  

2014 ఎన్నికలలో బిజెపికి సొంతంగా మెజారిటీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి దురదృష్టం మళ్ళీ మొదలయ్యింది. బిజెపికి టిడిపి మీద ఆధారపడే పరిస్థితి ఉండి ఉంటే కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో కొంత సాయం చెయ్యవలసిన అగత్యం ఉండేది. అయినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయిన కొత్తలో రాష్ట్రానికి మంచి సహకారమే ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్లే ఆ ప్రాజెక్టులో ఈ మాత్రమయినా ప్రోగ్రెస్ ఉంది. అలాగే హుద్‌హుద్ తుఫాను సమయంలో కూడ స్వయంగా ప్రధానమంత్రి వచ్చి సహాయం చేసారు. రాష్ట్రానికి రావలసిన విద్యాసంస్థలు మంజూరు చేసారు. (అందులో కొన్ని మిగతా రాష్ట్రాలతో పాటు వచ్చినవే కాని, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చినవి కావు.) కాని ఆ తరువాత బిజెపి ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలలో వరుసగా విజయాలు సాధించడంతో ఆ పార్టీ ధోరణిలో మార్పు వచ్చింది. బహుశా సొంతంగా అర డజను సీట్లు కూడ గెలుచుకోలేని రాష్ట్రానికి ఎందుకు ఇంత సహాయం చెయ్యాలని అనుకుని ఉంటారు. అప్పటినుండి మన రాష్ట్రంపై కేంద్రానికి నిర్లక్ష్యం మొదలయ్యింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నది ఇదివరకు సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్ధంగా నడిపించిన రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి కాదు. వరుసగా ఎన్నికలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ, షాలు.

ఇప్పుడు రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు, 2019 ఎన్నికలలో 25 సీట్లూ తమకే ఇమ్మని, అలా ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పి ప్రత్యేక హోదా తీసుకువస్తామని ప్రజలకి ఆశలు కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడ అధికారంలోకి వస్తే వెంటనే హోదా ఇస్తామని వాగ్దానం చేస్తోంది. కాని కాంగ్రెసుకి వచ్చే ఎన్నికలలో విజయం లభిస్తుందని దేశంలో ఎవరూ అనుకోవడంలేదు. అది ఇంచుమించు అసాధ్యం. బిజెపికి వచ్చే ఎన్నికలలో పూర్తి మెజారిటీ రాకపోవచ్చు కాని వాళ్ళు మళ్ళీ టిడిపితోనో, వైకాపాతోనో పొత్తు పెట్టుకుంటారని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే అంతకంటే తక్కువ బేరంలో దొరికే పార్టీలు ఇతర రాష్ట్రాలలో ఎన్నో ఉన్నాయి. స్వార్థ, కుటుంబ ప్రయోజనల కోసం కేంద్రంలో ఎవరికైనా మద్దతు ఇచ్చేందుకు ఎన్నో చిన్న చిన్న పార్టీలు దేశంలో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎంతో తప్పనిసరి పరిస్థితులలో తప్ప బిజెపి రాష్ట్ర పార్టీలతో పొత్తు పెట్టుకోదు. ఇప్పుడు బిజెపి దృష్టిలో ఆంధ్రప్రదేశ్‌ది “దిల్ మాంగే మోర్” టైపు. రాష్ట్ర ప్రజల ఆశలు వాళ్ళకి గొంతెమ్మ కోరికలలా కనిపిస్తున్నాయి.

కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తన స్వయంకృషిని నమ్ముకోవాలి తప్ప వేరే దారి లేదు. ఆంధ్రప్రదేశ్‌కి చక్కటి సహజ వనరులు, మానవవనరులూ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఇతర రాష్ట్రాలు అసూయపడేలా అభివృద్ధి చెందగలదు. కాని రాష్ట్రానికి విభజన న్యాయం జరగాలంటే మాత్రం ఏదైనా అద్భుతం జరగాలి. అదేమిటంటే 1, ఎవరైనా ఆంధ్రుడు ప్రధానమంత్రి అవ్వాలి లేదా 2, పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చినా హామీలు అన్నీ అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాలి. అంతవరకూ రాష్ట్రానికి న్యాయం జరగదు. కాబట్టి ప్రజలు రాజకీయనాయకులు చెప్పే మాటలు నమ్మి ఉద్యమాలతో సమయం వృధా చేసుకోవడం అనవసరం. అసలే మన రాష్ట్ర ప్రజలకి ఎమోషన్లు ఎక్కువ, ప్రాక్టికాలిటీ తక్కువ. చివరగా చెప్పొచ్చేదేమిటంటే కులాలకి, కుటుంబాలకీ భజన చేసే ప్రజలు ఉన్నంత కాలం, రాష్ట్రం బాగుపడదు.

9 వ్యాఖ్యలు leave one →
 1. Anon permalink
  29/04/2018 20:29

  Excellent article bayyaa.

 2. 30/04/2018 00:17

  ఆంధ్రకి ప్రత్యేక హోదా దక్కాలంటే అది కేవలం కాంగ్రెస్‌వల్లే సాధ్యం (అలా ఇవ్వడంవల్ల వాళ్ళకు పోయేదేమీ ఉండదు). కాకుంటే కాంగ్రెస్ ఇప్పట్లో గెలిచే అవకాశాలు శూన్యం.

 3. 30/04/2018 09:21

  Thanks bayya, this is my 100th post.

 4. విన్నకోట నరసింహారావు permalink
  30/04/2018 13:00

  100 పోస్ట్ ల మైలురాయి జేరుకున్నందుకు అభినందనలు, బోనగిరిగారూ 👏.

 5. 30/04/2018 14:12

  Thank you sir.

 6. 30/04/2018 14:57

  వామ్మో టపా మొత్తం సొంత బుర్రే !

  మాంచి పట్టుగ రాస్తారండీ ;

  శుభాకాంక్షలతో

  జిలేబి

 7. 30/04/2018 16:44

  కృతజ్ఞతలు, సొంత బుర్రే నండి. అనుమానమా?

 8. శివశంకర ప్రసాద్ permalink
  30/04/2018 20:20

  2004 లో NDA ను తన ఇష్టం వచ్చినట్లు ఆడుకొని తరువాత తను అలిపిరి లో bomb దాడిలో గాయపడి సానుభూతితో గెలుస్తాను అనుకోని , లాభి చేసి టైం వున్నా bjp నాయకులను లోకసభ ఎన్నికలకు సమాయుత్తం చేసి ఓడిపోయేట్లు చేసాడు. ఇది ద్రోహం కాదా ?? 2014 లో మోడీ హవాను చూసి (వ్యక్తిగతంగా మోడీ అంటే ఇష్టం లేకున్నా ) అదికార వ్యామోహం కోసం NDA తో జత కట్టి ముఖ్య మంత్రి పదవిని అలరించాడు .ఇప్పుడు విడిపోవడానికి ముఖ్యంగా జగన్ పాదయాత్రను , ప్రజాభిమానం చూసి తట్టుకోలేక తనతో BJP కూడా రమ్మంటే (కేంద్రం CBI అండతో , జగన్ ను అణచడానికి సహకరించక పోతే ) కేంద్రం తో యుద్దమా ?? బాబు ప్రజలను మాయమాటలతో ఒకసారి మోసం చేయవచ్చు కాని అన్నిసార్లు మోసం చెయ్యలేవు . మీ వుయాసం బావుంది .

 9. 01/05/2018 14:35

  అన్నింటికీ బాబుని తిడుతూ కూర్చుంటే ఎలా? ఈ పాపంలో అందరికీ భాగం ఉంది.
  వడ్డించేవాడు మనవాడు కానప్పుడు ఎంత అరిచినా ప్రయోజనం ఉండదని నా పోస్టు భావం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: