విషయానికి వెళ్ళండి

తెరల ప్రపంచం (World of screens)

16/06/2018

ప్రస్తుతం మనం తెరల ప్రపంచంలో (world of screens) బతుకుతున్నాము. అగ్గిపెట్టె సైజు నుండి ఐ మాక్స్ వరకు కోటానుకోట్ల తెరలు మనలని చుట్టుముట్టి ఉన్నాయి. అసలీ ప్రపంచంలో మనుషుల కంటే తెరలే ఎక్కువగా ఉన్నాయేమో? నిద్ర లేచినప్పటినుండి మళ్ళీ నిద్ర పోయేవరకు మన జీవితం చాలావరకు తెరల ముందే తెల్లారిపోతోంది. మనం మేల్కొని ఉండే సుమారు 15 గంటల్లో, ఎక్కువ సేపు మన ముందు ఏదో ఒక తెర ఉంటోంది. ఈ తెరల వల్ల మన కళ్ళకి ఎంత హాని జరుగుతుందో నాకు తెలియదు కాని, మన మనసులకి, అంతకు మించి సమాజానికి చాలా హాని జరుగుతోంది.

ఒక్కసారి మనం 1980లలోకి వెళదాం. ఎందుకంటే నాకిష్టమైన దశాబ్దం అదే. కారణం, నా టీనేజ్ మొత్తం ఆ దశాబ్దంలోనే గడిచింది. అప్పుడు మన ఊళ్ళలో సినిమా హాళ్ళు ఎక్కువగా ఉండేవి. సామాన్య ప్రజలకి అంతకు మించిన వినోదం ఏదీ అందుబాటులో ఉండేది కాదు. నాటకాలు, తోలుబొమ్మలాటలు లాంటివి ఉన్నా, అవి అప్పటికే పండగలకి, తిరణాళ్ళకే పరిమితం అయిపోయాయి. అప్పటి తరానికి తెర అంటే సినిమా తెర మాత్రమే! సాధారణ ప్రేక్షకులు నెలకు ఒకటో, రెండో సినిమాలకి వెళితే, కాస్త సినిమా పిచ్చి ఉన్నవాళ్ళు వారానికో సినిమాకి వెళ్ళేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో ప్రేక్షకులు తెర ముందు నెలకి 6 నుండి 12 గంటలు కాలం గడిపే వారు. మిగతా టైములో వినోదం కావాలంటే రేడియో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ రేడియోలో ఉన్న సౌకర్యం ఏమిటంటే, మన పని మనం చేసుకుంటూనే ఆ కార్యక్రమాలు వినవచ్చు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు మధ్యాహ్నం అమ్మలక్కలతో కాలక్షేపం చేసేవారు. పిల్లలు, మగవాళ్ళు సాయంత్రం బయట తిరిగేవారు. ఏమైనా అందరూ వీలైనంతవరకు, సాటి మనుష్యులతోనే సమయం గడిపేవారు. ఇప్పటిలా Gadgetsకి అతుక్కుపోయేవారు కాదు. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను, అప్పట్లోనే మా నరసాపురం టేలర్ హైస్కూల్లో 16mm థియేటర్ ఉండేది. అందులో మాకు అప్పుడప్పుడు డాక్యుమెంటరీలు, న్యూస్ రీళ్ళు మొదలైనవి చూపించేవారు. ఆ రోజుల్లో నవరాత్రులకి, ఉత్సవాలకి రోడ్ల మీద తెరలు కట్టి 16mm projector తో పాత సినిమాలు ప్రదర్శించేవారు.

ఇప్పుడు మనం 1990లలోకి వెళదాము. ఈ దశాబ్దంలో టెలివిజన్లు ఇంచుమించు అందరి ఇళ్ళలోకి ప్రవేశించాయి. నిజానికి కొంతమంది డబ్బు ఉన్న కుటుంబాలలోకి 1980లలోనే టివి వచ్చినా, సామాన్యుల ఇళ్ళలోకి 1990లలోనే వచ్చింది. ఇక అప్పటినుండి మనకి తెరల ప్రపంచం మొదలయ్యింది. ఇదివరకు వినోదం కోసం మనం తెర దగ్గరకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు తెర తిన్నగా మన నట్టింటిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు నెలకి 6-12 గంటలు ఉండే తెర సమయం (screen time) కాస్తా ఇప్పుడు రోజుకి కనీసం 6 గంటలు అయ్యింది. మన ఇంటికే తెర రావడంతోనే, మనిషికి మనిషి దూరం అవ్వడం మొదలయ్యింది. సోఫాలకి శిలాజాల్లా అతుక్కుపోయి టివి తెర ముందు కూర్చోవడం వల్ల మనుషులు ఇంటి నుండి బయటకి రావడం తగ్గిపోయింది. ఎవరైనా బంధుమిత్రులు ఇంటికి వచ్చినా, టివి చూడడం మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళతో మాట్లాడడంలో లేకపోయింది. టివికి తోడు VCPలు వచ్చి ఆదివారాలని, సెలవులని మింగేసాయి. 1990 దశాబ్దం చివరికి కంప్యూటర్లు కూడ మన సమాజంలోకి ప్రవేశించాయి. కాని ఆఫీసులలోనే ఎక్కువగా కనపడేవి. ఆఫీసులలో తెరల ముందు కూర్చుని పని చేసే సంస్కృతి మొదలయ్యింది.

కొత్త శతాబ్దం 2000 నుండి మొబైల్ ఫోన్లు (సెల్ ఫోన్లు) మార్కెట్లోకి వచ్చాయి. కాని ఈ ఫోన్లలో తెరలు అగ్గిపెట్టె సైజులో మాత్రమే ఉండి నంబర్లు చూసుకునేందుకు, చిన్న చిన్న గేమ్స్ ఆడుకునేందుకు మాత్రమే పనికివచ్చేవి. కాల్ చార్జీలు కూడ ఎక్కువగా ఉండడం వలన ఎవరూ ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడేవారు కాదు. అందువలన సమయం పెద్దగా వృధా అయ్యేది కాదు. నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ వాడడం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. బహుశా మొబైల్ ఫోన్‌ని మనిషి సద్వినియోగం చేసుకున్న కాలం ఇది మాత్రమే అయ్యుంటుంది. ఈ కాలంలోనే Laptops కూడ మన జీవితంలోకి ప్రవేశించాయి. ఆఫీసులనుండి ఇంటికి కూడ వచ్చేసాయి. ఇంట్లో కూడ తెర ముందు పని చెయ్యడం మొదలయ్యింది.

2010కి కొంచెం అటూ ఇటూగా Smart phones రావడం మొదలయ్యింది. ఇక్కడ నుండి మనుషులకి తెర కష్టాలు మొదలయ్యాయి. అయిదారు అంగుళాల తెరలతో internet సదుపాయంతో social media apps తో ఈ smart phones మన జేబులనే కాకుండా మన జీవితాలని కూడ ఆక్రమించేసాయి. మాట్లాడడం రాని పసి పిల్లలకి కూడ ఆడుకోవడానికి smart phone కావాలి. స్కూలు, కాలేజి విద్యార్థులు కాస్త ఖాళీ దొరికితే చాలు గేమ్స్ ఆడుకోవడం, సోషల్ మీడియాలో లీనమయిపోవడం ఇప్పుడు చాలా మామూలు విషయం. గత కొన్నేళ్ళుగా కొత్త మొబైల్ కంపెనీలు వచ్చి కాల్ చార్జీలు, డేటా చార్జీలు బాగా తగ్గించేసాయి. చాలా వరకు కాల్స్, డేటా ఉచితంగా కూడ ఇచ్చేయడంతో ఈ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ అపరిమిత కాల్స్ కాలుష్యం, డిజిటల్ వినాశనంపై గతంలోనే ఒకసారి వ్రాసాను. అది ఇక్కడ చదవండి.

ప్రస్తుతం డిజిటల్ ప్రొజెక్టర్లు కూడ రావడంతో, ఇంటిలోకే థియేటర్ లాంటి తెర వచ్చేసింది. అయితే ఎన్ని తెరలు వచ్చినా జరగని వినాశం, విధ్వంసం స్మార్ట్ ఫోన్ తెర వలనే జరుగుతోంది. మన కళ్ళు ప్రపంచాన్ని చూసేది తక్కువ, ఈ ఫోన్ తెరని చూసేది ఎక్కువ అయ్యింది. ప్రపంచంతో మన సంబంధం ఫోన్ ద్వారానే జరుగుతోంది. అసలే అపార్ట్మెంట్ కల్చర్, పక్క ఫ్లాట్లలో ఎవరున్నారో కూడ తెలియదు. నలుగురు కుటుంబసభ్యులకీ నాలుగు గదులు ఉంటున్నాయి. మనిషి, మనిషికి మధ్య గోడలు, మనిషి, మనిషికో తెర. ఎవరికీ మరో మనిషితో మాట్లాడే అవసరం లేదు. అంతా ఫోనే చూసుకుంటుంది. అన్నీ ఆన్‌లైన్లో దొరుకుతున్నపుడు, స్మార్ట్ ఫోన్ వాడవలసిందే కాని అవసరమైనంత వరకే వాడితే అందరికీ మంచిది. కనీసం టివి అయితే నలుగురూ కలిసి చూడవచ్చు, కాని స్మార్ట్ ఫోన్ వల్ల మనిషి మరీ ఒంటరివాడు అయిపోయాడు. అసలు ఒక వ్యక్తికి మరీ ఇంత personalized screen అవసరమా? అన్న విషయం సామాజిక శాస్త్రవేత్తలు పరిశీలించాలి.

మనసు పెట్టి ఆలోచిస్తే, మన Heart కూడ ఫోన్ లాంటిదే. దానితో కూడ ప్రపంచాన్ని చూడవచ్చు, వినవచ్చు, అందరితో మాట్లాడవచ్చు. నిజానికి ఇంతకాలం మనం చేస్తున్నది అదే! ఇప్పుడు హృదయాన్ని కాదని యంత్రాన్ని ఉపయోగిస్తున్నాము. మనిషి మరో మనిషితో ప్రత్యక్షంగా మాట్లాడేటప్పుడు కలిగే భావోద్వేగం (ఆనందం కాని, ప్రేమ కాని, మరేదైనా సరే) యంత్రం ద్వారా కలుగదు. దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ఫోన్లు ఉపయోగించక తప్పదు కాని, నాజూకు ఫోను మోజులో పడి దగ్గరగా ఉన్న వాళ్ళని కూడ పలకరించకపోవడం తప్పే అవుతుంది. Gadgetsతోనే రోజంతా గడుపుతూ పిల్లలు, మనవలు తమని పట్టించుకోవడంలేదని పెద్దవాళ్ళు వాపోతున్నారు. ఒంటరిగా ఉండేవాళ్ళకి ఒక చిన్న స్పర్శ కూడ ఎంతో ఆనందాన్ని కలుగచేస్తుంది. కాని మనం ఆ స్పర్శని టచ్ స్క్రీన్‌కే ఇస్తున్నాము. సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలియని వాళ్ళ ఎమోషన్స్‌కి స్పందించే మనం, మన పక్కనే ఉన్న వాళ్ళ ఎమోషన్స్‌ని పట్టించుకోకపోవడం కరక్టేనా? ఆలోచించండి, Smart Phone తక్కువగా వాడండి, Heart Phone ఎక్కువగా వాడండి.

 

6 వ్యాఖ్యలు leave one →
 1. 25/06/2018 14:50

  వారం క్రితం నా బ్లాగులో వ్రాసుకున్న “తెరల ప్రపంచం” పోస్టు ఆధారంగా ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఆర్టికల్. కొన్ని వాక్యాలు యధాతధంగా వాడుకున్నారు. నా బ్లాగుకు కూడ క్రెడిట్ ఇచ్చి ఉంటే బాగుండేది.

  ‘తెర’ జీవితాలంటే సాధారణంగా సినిమా నటులవే అనుకుంటుంటాం గానీ వాస్తవంలో ఇప్పుడు మనందరివీ ‘తెర’ జీవితాలే! లేస్తూనే మొబైల్‌ ముఖం చూస్తాం. ఇంట్లో, ఆఫీసులో కంప్యూటర్ల ముందే పని. కాస్త సమ యం చిక్కితే టీవీకి అతుక్కుపోతాం. ప్రయాణాల్లోనూ మొబైళ్లు, ట్యాబ్లెట్లే. ఇలా మన జీవితంలో అత్యధిక భాగం ఏదో ఒక ‘తెర’ ముందే గడిచి పోతోంది. మన జీవితాల్లో ఈ ‘స్క్రీన్‌ టైమ్‌’ అన్నది సగటున రోజులో 6 గంటలకు పైగా ఉంటోంది. ఈ స్క్రీన్‌లన్నింటి నుంచీ వెలువడే నీలి కాంతి (బ్లూ లైట్‌) మన కంటికీ, ఒంటికీ కూడా సమస్యలు తెచ్చిపెడుతోందని పరిశోధనా రంగం గుర్తించింది. దీన్నుంచి తప్పించు కోవటం తక్షణావసరమనీ హెచ్చరి స్తోంది. మరి మనల్ని పూర్తిగా ఆవరించిన ఈ ‘నీలి విప్లవాన్ని’ మనం ఎదుర్కొనేదెలా?

  తెరల మధ్యే తెల్లవారుతోంది!
  ఉదయం లేస్తూనే మొబైల్‌ చూడటంతో మొదలయ్యే మన జీవితం రోజంతా డిజిటల్‌ స్క్రీన్ల మధ్యే గడిచిపోతోంది. ఇలా రోజులో అధిక భాగం ఏదో ఒక డిజిటల్‌ స్క్రీన్‌ను, చాలా దగ్గర నుంచి చూస్తుండటం క్రమేపీ పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతోందని, దీనివల్ల ఒకప్పటి కంటే ఇప్పుడు కంటి వ్యాధులు, నిద్ర సమస్యలు పెరిగిపోతున్నాయని పరిశోధకులు గుర్తించారు.

 2. 25/06/2018 15:48

  -++

  మీ టపాను మీరే కాపీ కొట్టేసి నాలుగైదు చోట్లో పెట్టేసుంటే కాపీ అయిపోయిందే అని చింతించక పోయుందురు 🙂

  బెటర్లక్ నెక్స్ట్ టైం :).

  ఈనాడు వాడికి ఓ కంప్లెయింట్ పడేయ రాదూ ?

  భళారే! ఈనాడే వరుస గ టపా వాడుకున్నారు! మీరే
  ములాజా లేకుండా సదరు కతలన్ ముందుగా కాపికొట్టే
  సి లాగించేసుండొచ్చుకద? నరుడా! సీ, మరీ యింతగా మీ
  గులాబ్జామూనున్ కైవిడిచి రికదా! గోడుగా చింతలేలా!

  జిలేబి

 3. 25/06/2018 16:39

  బైదివే మీ టపా హెడ్డింగు దగ్గరో క్రిందనో మీ పేరు బోల్డు అక్షరాలతో పెట్టండి.

  ఎవర్రాసేరో అని వెతికి పేరు పట్టడానికి అరరె ఇది
  మన బోనగిరి గారిది అని కనుక్కోవడానికి నాకే ఓ అరగంట పట్టింది ఆ నాగురించి లో ఎక్కడో మూలలో నక్కి వున్నారు 😉

  కాబట్టి వచ్చే టపాల నించి బోళ్డు ళెటర్స్ తో మీ పేరు ప్రఖ్యాతంగా కనిపించేటట్లు పెట్టండి. కాపీ కొట్టే వాడు దయార్ద్ర హృదయుడై వుంటే మీకో థాంక్సు చెప్పును 🙂

  ఇట్లు
  జిలేబి

 4. నీహారిక permalink
  26/06/2018 09:35

  ఈనాడులో మెయిన్ పేజీలోనూ 5 వ పేజీలో ఇది వ్రాసారు.ఇది చాలా ముఖ్యమైన సమస్య కాబట్టి ఆలోచించవలసిన విషయం.నిన్న మా ఇంటికి బంధువుల అబ్బాయి వచ్చాడు.అతను కాలనీలోనే ఇంకోచోటికి వెళ్ళవలసి వచ్చింది.ఇదివరకు మనం అందరినీ అడుగుతూ వెళ్ళేవాళ్ళం అతను ఎంచక్కా జీపీఎస్ ఆన్ చేసి డైరెక్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
  ఇంకో అమ్మాయి బస్ లో రెండు గంటల సేపు మాట్లాడుతూనే ఉంది.ప్రక్కవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఆలోచన కూడా లేదు.సాంకేతికత వల్ల లాభాలూ నష్టాలూ ఉన్నాయి.
  అన్ని లావాదేవీలూ సెల్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి.కంటికి ఇబ్బదులే.కొంతమంది సెలబ్రిటీలు ఉద్యోగులను పెట్టుకుని కమెంట్స్ కి జవాబులు వ్రాస్తుంటారు.మోదీ నుండి ఏదయినా సమాధానం వస్తే అది మోదీ వ్రాసాడని మురిసి ముక్కలయ్యేవాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది.అంతమంది కమెంట్స్ మోదీ చదువుతాడా ? అలా చదివితే మోదీ కళ్ళు ఏమయిపోతాయి ?

 5. 26/06/2018 10:42

  కొమ్మినేని మాత్రం తప్పకుండా కాంటెంట్ రైటర్‌నే వాడుతాడు. నేను అతని వెబ్‌సైట్‌లో మరీ వ్యక్తిగతమైన విమర్శలు చేసినా అతను అవి డిలీట్ చెయ్యలేదు.

 6. jayden permalink
  26/09/2018 06:40

  hai
  brother i am very new for bloging
  and ur blog is very useful

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: