135 కోట్ల మంది ప్రజలతో ఏం చెయ్యాలి?
15/08/2018
“నా వైపు నూట పాతిక కోట్ల మంది భారతీయులున్నారు. అందుకే ప్రపంచం నన్ను గౌరవిస్తోంది.”
మన ప్రధానమంత్రి నరేంద్ర మోది ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా చెప్పే మాట ఇది. నిజానికి ప్రస్తుతం మన దేశ జనాభా, సుమారు 135 కోట్లు. ఈ జనాభా సగటు వయసు 30 ఏళ్ళకు తక్కువ. ఇంతమంది ప్రజలతో ఏం చెయ్యాలి? అసలు 135 కోట్ల మంది ప్రజలతో ఏం చెయ్యవచ్చు? 135 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి చెయ్యి, చెయ్యి కలిపితే బహుశా ఎవరెస్ట్ శిఖరాన్ని కూడ కదిలించవచ్చు. కాని మనం పేదరికాన్ని కూడ వదిలించలేకపోతున్నాము. ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వం కాని, గత ప్రభుత్వాలు కాని ఎప్పుడైనా తీవ్రంగా ఆలోచించాయా? నాకైతే ఎప్పుడూ ఆలోచించినట్టు కనిపించడం లేదు.
ఈ వీడియోలోని పాట చూడండి. 1961లో వచ్చిన ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ వ్రాసిన నాటి పరిస్థితులకి, ఇప్పటికీ పెద్దగా తేడా ఏమీ లేదు. ఆర్థిక సంస్కరణల వలన చదువుకున్న మధ్యతరగతి కొంత బాగుపడింది తప్ప మిగతా వర్గాలు అలాగే ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల, కొంతమంది వ్యక్తుల ఆస్థులు పెరిగాయి కాని ప్రభుత్వ సంపద పెరగలేదు. ప్రజలకి తాయిలాలు ఇచ్చి ఎన్నికలలో గెలిచే పరిస్థితి పోవడంలేదు.
మనం ఎప్పుడూ ఆహార వృధా, నీటి వృధా లాంటి వనరుల గురించి, మహా అయితే టైము వృధా గురించి మాట్లాడుకుంటాము కాని మానవ వనరుల వృధా గురించి ఎప్పుడూ మాట్లాడుకోము. ఎందుకంటే అది మనకో పెద్ద సమస్య కాదు. పైగా మానవ వనరుల వృధా గురించి మాట్లాడితే నిరుద్యోగసమస్య గురించి మాట్లాడాలి. కొత్త ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడాలి. అది మన ప్రభుత్వాల చేతిలో లేని పని. నిజానికి మానవ వనరులని సరిగా మేనేజ్ చెయ్యగలిగితే నిరుద్యోగ సమస్య ఉండదు. దేశానికి ఎంతో సంపద సృష్టించవచ్చు. మనదేశంలో బాగా చదువుకున్నవాళ్ళు అమెరికాకో, యూరప్‌కో వెళ్ళి పని చేస్తుంటే, పెద్దగా చదువుకోనివాళ్ళు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. మనం వాళ్ళకి సరైన ఉపాధి కల్పించలేకపోగా, వాళ్ళు పంపిన కరెన్సీతో లోటు తగ్గించుకుంటున్నాము. మన మానవ వనరులు ఉపయోగించుకుని ఆ దేశాలు మనకంటే వృద్ధి చెందుతున్నాయి.
మన కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మానవ వనరుల అభివృద్ధి శాఖలు ఉన్నాయి. వీటిని ఇదివరకు విద్యాశాఖ అనేవారు. తరువాత మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ వెబ్‌సైటు చూస్తే అందులో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి ప్రాధమిక విద్య మరియు అక్షరాస్యత. రెండోది ఉన్నత విద్య. ఈ రెండు విభాగాలకి ఇద్దరు సహాయమంత్రులు, మొత్తం శాఖకి ఒక కేబినెట్ మంత్రి ఉన్నారు. అంటే ఇప్పటికీ ఈ శాఖ విద్యాశాఖలానే పనిచేస్తోంది. మరి మానవ వనరుల అభివృద్ధి శాఖ అని పేరు ఎందుకో?
మానవ వనరుల అభివృద్ధి అంటే మొత్తం జనాభాలో పని చెయ్యగలిగే ప్రతీ ఒక్కరికీ తగిన పని కల్పించి దేశం అభివృద్ధి చెందేలా చెయ్యాలి. పెద్దగా చదువుకోనివాళ్ళకి కూడ వాళ్ళ, వాళ్ళ వృత్తుల్లో నైపుణ్యం పెంచుకొనే అవకాశం కల్పించి ఉత్పాదకత పెంచాలి. డిగ్రీలు, డిప్లొమాలు చదువుకున్నవాళ్ళకి కూడ ఉద్యోగాలకి పనికివచ్చే నైపుణ్య శిక్షణ ఇప్పించాలి. ఏదో ఒక పని చెయ్యగలిగే శక్తి ఉన్నవాళ్ళందరికీ ప్రభుత్వం ఉపాధి కల్పించగలిగితే దేశంలో అనేక సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా శాంతి భద్రతలు బాగుంటాయి. నేరాలు, ఘోరాలు తగ్గుతాయి. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రాజకీయాల మీద ఆధారపడి బతికే పరాన్నజీవులు ఉండరు. ప్రభుత్వం మొదలుపెట్టిన పనికి ఆహార పథకం, గ్రామీణ ఉపాధి పథకం లాంటివి కొంత మేలు చేసినా, పెద్దగా సంపద సృష్టించబడలేదు. పైగా చాలా సందర్భాలలో ఈ పథకాలు దుర్వినియోగమయ్యాయి. కొంతమందికి సరైన పని ఇవ్వకుండా సోమరితనాన్ని పెంచాయి. వీటివలన వ్యవసాయానికి, నిర్మాణరంగానికి కార్మికుల కొరత మొదలయ్యింది. ఈ పథకాలని ఆ రంగాలకు అనుసంధానిస్తే మేలు జరగవచ్చు.
మన దేశంలో మానవ వనరులతో పాటు, అన్ని రకాల సహజవనరులు కూడ ఉన్నాయి. అలాగే చెయ్యవలసిన అభివృద్ధి పనులు కూడ బోలెడన్ని ఉన్నాయి. ప్రభుత్వం చెయ్యవలసిందల్లా ఈ వనరులన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, చెయ్యవలసిన అభివృద్ధి పనులకి ప్రయారిటీ నిర్ణయించుకుని పనులని, వనరులని మేనేజ్ చెయ్యడం. కాని ఇంతవరకూ ఏ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అందువల్లే మన దేశం స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ళ తరువాత కూడ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయింది.
2014లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన NDA ప్రభుత్వం దేశభవిష్యత్తుని మారుస్తుందని అందరూ ఆశించారు. 30ఏళ్ళ తరువాత సంపూర్ణ అధికారం కలిగిన పార్టీగా అవతరించిన BJP మొదటిలో కొన్ని మంచి పనులు చేసినా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో గెలిచిన తరువాత రాష్ట్రాల ఎన్నికలు గెలవడానికి ఇచ్చిన ప్రాధాన్యం దేశ అభివృద్ధికి ఇవ్వలేదు. భారతదేశ దశ, దిశ మార్చగలిగే సువర్ణ అవకాశాన్ని BJP వృధా చేసింది. స్వచ్చభారత్, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాలు ఏమయ్యాయో ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ రెండు కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేసినా దేశం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది.
కేవలం ప్రభుత్వాలే కాదు, మేధావులు, సామాన్యులు, అందరూ కూడ 135 కోట్ల ప్రజలతో ఏం సాధించవచ్చో ఆలోచించాలి. ఇన్ని కోట్ల ప్రజల శ్రమశక్తినీ, మేధాశక్తినీ వృధా చెయ్యకుండా సరైన దిశలో ఉపయోగించుకోగలిగితే దేశ భవిష్యత్తు మారుతుంది. లేకపోతే ఎన్ని దశాబ్దాలు గడిచినా “ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది” అన్నట్టు తయారవుతుంది మన దేశ భవిష్యత్తు.
5 వ్యాఖ్యలు
leave one →
20-25 కోట్లు జనాభా ఉండాల్సిన చోట 135 కోట్ల మంది ఉన్నారు. ఇదే అసలు సమస్య. ప్రపంచం అంతా కలిపి పండించే ఆహారధాన్యాలు కూడా మనకు చాలవు. ఇండియా లో ఎప్పటికీ బుచికోయమ్మ బూచికే.
మంచి పాయింట్ మీద రాశారు. చాలా మంచి పోస్టు.
దురదృష్టవాశాత్తూ ఇవేవీ మన ప్రభుత్వాలకు పట్టవు. వీరి ఫోకస్ అంతా వ్యక్తిగత కీర్తి, రాజకీయాలు, ఎలక్షన్స్, వాటికి కావల్సిన డబ్బు.
ఈ స్పృహ ఉన్న రాజకీయాలు ప్రారంభమైతే తప్ప, ఇంకో పాతికేళ్ల తర్వాత కూడా మన దేశంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇంకోతరం వాళ్ళు ఇలాగే అనుకుంటుంటారు.
మీరు సరైన అంశం ఎంచుకున్నారు. మానవ వనరులు. దీనిని ఉపయోగించుకోవాలన్న విజన్ నేహ్రూ కి మాత్రం ఉండేది. మౌలికమైన మార్పులు మాత్రమే సమస్యకి పరిష్కారంగా భావించే నాబోటి కమ్యూనిస్టు ఆలోచనాపరులు ఆ ప్రయత్నాన్ని విప్లవాన్ని ఆలశ్యం చేసే ప్రయత్నాలుగా భావించాం. ఆబ్జిక్టివ్ గా ఆలోచించటం ఆరంభించాక నేహ్రూ విజనరీ అనేది అర్ధమయింది. నా టపాలో అంశం ప్రజాస్వామ్య భావన. దాని వైఫల్యం నెహ్రూ ఆపలేకపోయాడన్నది నా పాయింట్. కాకపోతే మానవ వనరుల వినియోగానికి సంబంధించిన దూరపుచూపుతో మనదేశం నెహ్రూ తదనంతరం నడవలేదు. ఉద్యోగకల్పన అనేది ఓటరు ఆకర్షణ నినాదంగా మారిపోయింది. అదే నినాదం ప్రతి ఎలక్షను ముందూ ప్రతిపార్టీ ప్రణాళికలోనూ చోటు చెసుకుంటోంది ఒక కర్మకాండ(వినాయక పూజతో ఆరంభించినట్టు) తరహాలో. మన నాయకులు సర్వైవల్ టాక్టిక్స్ కే పరిమితం కావటం. ఎన్నికలే ప్రధానం అనుకోటం, విధాన నిర్ణయాలు చర్చకి పౌరసమాజాన్ని ఆయుత్తం చేయకపోవటం ఎన్నో తప్పుడు ధోరణులు మన రాజకీయాలలో చోటు చేసుకున్నాయి. మనది ఏర్పడుతున్న జాతిరాజ్యం. ఇచ్ఛతో ఏకమవలేదు. విధివశాత్తూ భౌగోళికంగా ఏకమయాం. మన నాయకులకీ జాతి భావన లేదు. ఈనాడు జాతి అనే భావన కూడా అంగడి సరుకులా కొందరికి జాతిభక్తులు కొందరికి జాతిద్రోహులు అనే ముద్ర వేసే స్థితికి చేరుకున్నాం. పూర్తి మెజారిటీతో మోడీ వచ్చినపడు భావజాల వ్యతిరిక్తత ఉన్నా భాజపా మీరు ఎత్తిన మానవ వనరుల అంశాల వంటివి దేశసంపద వంటివి తీసుకుంటారని కొంత ఆశపడ్డాను. పూర్తిగా ఆ అంశాలను వదిలేసింది. దానికి బదులు సామాజిక అశాంతి ద్వారా అభద్రత సృష్టించి భయాందోళిత ప్రజానీకాన్ని తమ చెప్పుచేతలలో ఉంచుకునే నీచవ్యూహం అమలవుతోంది. ఈ అధికారం ఎందుకు అనే దృష్టి లేదు. మసీదులన్నీ గుడులు చేసేసారనుకుందాం.. తర్వాత? ఈలోగా? భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం లేదు. గతాన్ని విడిచిపెట్టని మేధోవర్గం ఉంది. గాలికీ ధూళికీ పెరిగే అనాథబిడ్డలాంటిదీ దేశం ప్రస్తుతం.
పై వీడియోలో కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చూడండి. మన పాలకులు మొదటి నుంచి మానవ వనరుల అభివృద్ధిని ఎంత నిర్లక్ష్యం చేసారో అర్థమవుతుంది.