ఆ 7 స్థానాలలో ఎన్నికలు అవసరమా?
09/01/2019
గత నెలలో తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో TRS పార్టీ ఘనవిజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది. ఆ పార్టీకి నా అభినందనలు. ఈ ఎన్నికలలో అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీ పోటీ పడ్డాయి. ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ అందరిలోను కలిగింది. రెండు పక్షాల్లోను పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతారని ప్రచారం జరిగింది. చివరకు ప్రతిపక్ష నాయకులే ఎక్కువమంది ఓడిపోయారు.
అయితే ఇదే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా హైదరాబాదు పాతబస్తీలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికలు మాత్రం పెద్దగా ఉత్కంఠ లేకుండానే ముగిసాయి. ఫలితాలు కూడ అందరూ అనుకున్న విధంగానే వచ్చాయి. గత రెండు ఎన్నికలలో (అంటే 2009 మరియు 2014 లో) గెలిచిన AIMIM పార్టీయే మళ్ళీ ఆ 7 స్థానాలు గెలుచుకుంది. వివరాలకు పైన ఇచ్చిన పట్టిక చూడండి. 2009 కి ముందు కూడ ఆ పార్టీయే ఇక్కడ మూడు, నాలుగు స్థానాలలో వరుసగా గెలుస్తూ వస్తోంది. హైదరాబాదు లోక్సభ నియోజకవర్గంలో కూడ AIMIM పార్టీయే వరుసగా గెలుస్తోంది.
సాధారణంగా పెద్ద పార్టీల ముఖ్యమైన నాయకులు ఒకే స్థానం నుండి ఎప్పుడూ గెలుస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మెజారిటీ పెంచుకునే దృష్టితో నియోజకవర్గాన్ని వీలైనంత అభివృద్ధి చేస్తుంటారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి నిధులు, పనులు ఎక్కువగా మంజూరు చేయించుకోగలుగుతారు. ఇది దేశంలో ఎక్కడైనా ఉన్నదే! అయితే ఒకే పార్టీ అప్రతిహతంగా ఇంచుమించు తాము పోటీ చేసే అన్ని స్థానాలు గెలుచుకోవడం బహుశా హైదరాబాదులో మాత్రమే జరుగుతోంది. నాకు పాతబస్తీ ప్రాంతంతో పరిచయం లేదు కాని, నిజంగా అక్కడి AIMIM శాసన సభ్యులు ప్రజలకి అవసరమైన సేవ చేస్తూ ఉన్నట్లయితే మంచిదే! అక్కడి పౌరుల సమస్యలని మరో పార్టీ ఏదీ AIMIM కంటే బాగా అర్థం చేసుకోలేకపోతోందని అనుకోవాలి.
ఎలాగూ గెలవలేనప్పుడు ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిగతా పార్టీలు పోటీ చెయ్యడంవలన ఉపయోగం ఏమిటి? వాళ్ళకి ఖర్చు, శ్రమ తప్ప! అలాగే ప్రభుత్వానికి అంటే ప్రజలకి ఎన్నికల ఖర్చు, అసౌకర్యం కూడ తప్పదు. ప్రజలు ఒకే పార్టీకి ఇన్ని సార్లు ఎందుకు పట్టం కడుతున్నారో మిగతా పార్టీలు అర్థం చేసుకుని తగిన విధంగా వ్యూహం మార్చుకోవాలి. అంతవరకు AIMIM తప్ప మిగతా పార్టీలు, ఇండిపెండెంట్లు అక్కడ పోటీ నుండి తప్పుకోవడం మంచిది. ఏకగ్రీవంగా MLA లు ఎన్నిక అయితే ఎవరికీ ఇబ్బంది ఉండదు, ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది.
One Comment
leave one →
మజ్లిస్ నాయకులు (అభివృద్ధి చేసినా మానినా) నిత్యం అందుబాటులో ఉంటారు. పార్టీ
నాయకులు & కార్యకర్తలలో సామాన్యులే అధిక శాతం. ఈ రెండు పాయింట్లే వీరికి మేజర్ ప్లస్.
ఈ ఏడు సీట్లలో మూడింట (కార్వాన్, నాంపల్లి & మలక్పేట) పోటీ ఖచ్చితంగా కుదురుతుంది కాకపోతే షరతులు వర్తిస్తాయి. ఇందుకు స్థానిక సమస్యలు అర్ధం చేసుకొని వాటిని స్థానికులతో స్థానిక భాషలో చెప్పగలిగిన గట్టి అభ్యర్తులు కావాలి. స్వ. అమానుల్లా ఖాన్ (ఎంబీటీ) మరణం తరువాత అటువంటి నాయకులు కరువయ్యారు.
మజ్లిస్ ఈ తడవ చార్మినార్ యాకుత్పురా అభర్ధులను ఎందుకు “ఎదురు బెదురు బదిలీ” చేసిందో ఎవరికయినా అర్ధం అయిందా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలిగితే పోటీ ఇవ్వడం కూడా కష్టం కాదు.
పేరు గాంచిన జర్నలిస్టులు, క్రికెట్/కుస్తీ మేటి ఆటగాళ్లు వగైరాలను ముందు పెట్టుకుంటే లాభం లేదని గ్రహించాలి. ఉర్దూలో రెండు ముక్కలు కూడా మాట్లాడలేని నాయకులతో ప్రచారం చేయించడం (ఈ ముక్క పాత బస్తీలోనే కాదు నగరం మొత్తంలో వర్తిస్తుంది) తెలివి అనిపించుకోదు.