విషయానికి వెళ్ళండి

విధి విలాసం

03/02/2019

ఆదివారం మధ్యాహ్నం. భోజనం చేసి కాస్త విశ్రమిద్దామని, మంచం మీద పడుకుని దినపత్రిక అనుబంధం అందుకున్నాను. ఒక్కో పేజి చదువుతుండగా, ఒక పేజీలోని చిత్రం దగ్గర ఆగిపోయాను. ఆ ఫొటోలోని వ్యక్తిని ఎప్పుడో, ఎక్కడో చూసినట్లు అనిపించి ఆ వ్యాసం చదవడం మొదలు పెట్టాను. అది ఒక సమాజసేవకి సంబంధించిన విషయం. ఒక ధనవంతుడు మానసికంగా సరిగా ఎదగని బాలల సేవ కోసం పెట్టిన ఒక ఆశ్రమం గురించిన వార్త అది. ఎంతోమంది ఎన్నో విధాలుగా సమాజ సేవ చేస్తున్నా, దేశంలో అభాగ్యులు మాత్రం తగ్గటంలేదు. అయినా ఎన్నో ఎన్‌జీవోలు, ఎంతోమంది దానకర్ణులు సహాయం చేస్తుంటే, ప్రభుత్వం, ప్రభుత్వ పథకాలు ఏమి చేస్తున్నట్టో?

ఆ ధనవంతుడి కొడుకు మానసికంగా సరిగా ఎదగకపోవడంవలన ఆ బాధని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు అలాంటి సమస్యలున్న పేద పిల్లల కోసం ఆశ్రయం, వైద్యం కల్పించటానికి ఒక ఆశ్రమం లాంటిది ఏర్పాటు చేసారన్నది, ఆ వార్త సారాంశం. అయితే ఆ ధనవంతుడిని నేను ఎక్కడో చూసినట్టు ఉంది. ఫొటో పరిశీలనగా చూసి, కొంత సేపు ఆలోచించిన తరువాత గుర్తొచ్చింది, అతడిని నేను సుమారు పాతికేళ్ళ క్రితం చూసానని. ఒక్కసారి మనసు పాతికేళ్ళ నాటి జ్ఞాపకాలని తట్టిలేపింది.

అవి నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నిస్తున్న రోజులు. అప్పుడు ఇప్పటిలా కేంపస్ ప్లేస్‌మెంట్లు లేవు. హైదరాబాదులో అయితే ఏదైనా ప్రైవేట్ జాబ్ దొరుకుతుందని ఒక స్నేహితుడి గదికి వచ్చి, ఉద్యోగప్రయత్నాలు మొదలు పెట్టాను. కొన్నాళ్ళకి ఒక కాంట్రాక్టరు దగ్గర చిన్న ఉద్యోగం దొరికింది. ఆ కాంట్రాక్టరు నగరానికి దూరంగా ఒక బ్రిడ్జి నిర్మిస్తున్నాడు. అక్కడే సైటు ఇంజనీరుగా నా ఉద్యోగం. నాతోపాటు ఒక లోకల్ కుర్రాడు కూడ ఆ కాంట్రాక్టరు వద్ద చేరాడు. రోజూ పొద్దున్నే బయలుదేరితే రెండు గంటల బస్సు ప్రయాణం తరువాత బ్రిడ్జి సైటుకి చేరేవాళ్ళం. అక్కడ తినడానికి కూడ ఏమీ దొరికేది కాదు. మధ్యాహ్నం భోజనానికి రెండు కిలోమీటర్లు నడవాల్సివచ్చేది. అయినా కొన్నాళ్ళు పనిచేస్తే అనుభవం వస్తుందని భరించేవాళ్ళం.

ఆ కాంట్రాక్టరు మిగతా వర్క్ సైట్లు కూడ చూసుకుంటూ, రోజుకి రెండు మూడు గంటలు ఈ సైటులో ఉండి, డిపార్ట్‌మెంట్ ఇంజనీరుతోనే మొత్తం వర్క్ మేనేజ్ చేసేవాడు. ఆ డిపార్ట్‌మెంట్ ఇంజనీరు ఆఫీసు పనులు చూసుకుంటూనే, కాంట్రాక్టరు పనులు కూడ సొంత పనులులాగే చేసి పెట్టేవాడు. బహుశా కాంట్రాక్టరు ఆయనకి ఆఫీసు జీతానికి తగ్గ పారితోషికం ఇచ్చేవాడనుకుంటాను. మేము కూడ రోజూ ఉదయాన్నే ఆ డిపార్ట్‌మెంట్ ఇంజనీరుకే రిపోర్ట్ చేసేవాళ్ళం.

కొద్ది రోజులకి బ్రిడ్జి స్లాబు కాంక్రీటు వెయ్యాల్సిన సమయం వచ్చింది. కాంట్రాక్టరు కూడ సైటు దగ్గరే ఎక్కువగా ఉండి కాంక్రీటు వెయ్యడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూస్తుండేవాడు. కాంక్రీటు కలపడానికి, స్లాబు మీద పొయ్యడానికి ఎక్కువమంది పనివాళ్ళు కావాలి. అందుకోసం పాలమూరు కార్మికులని రప్పించాడు. వాళ్ళు కాంక్రీటు పోసే రోజు ఉదయమే పిల్లాపాపలతో సహా సైటుకి వచ్చేసారు. ఎన్ని కుటుంబాలో తెలియదు కాని, సుమారు యాభయిమంది ఉంటారు. అక్కడే అన్నం వండుకోవడం, తినడం, పని చెయ్యడం వాళ్ళకి అలవాటు. నేను పాలమూరు లేబర్‌ని చూడడం అదే మొదటిసారి కాని తరువాత దేశంలోని అనేక రాష్ట్రాలలో వాళ్ళు పని చెయ్యడం చూసాను.

స్లాబు కాంక్రీటు వెయ్యడానికి ముందు డిపార్ట్‌మెంట్ నుండి పెద్ద ఇంజనీరు వచ్చి తనిఖీ చెయ్యాలి. షట్టరింగు, స్టీల్ రాడ్లు అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసి కాంక్రీటు చెయ్యడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇదంతా అయ్యేటప్పటికి మధ్యాహ్నం దాటిపోయింది. అప్పటికే లేటు అయిపోతోందని, ఇలా అయితే పని పూర్తయ్యేటప్పటికి అర్థరాత్రి అయిపోతుందని కార్మికులు సణగడం మొదలుపెట్టారు. కాంట్రాక్టరు వాళ్ళకేదో సర్దిచెప్పి కాంక్రీటు పని ప్రారంభించాడు. తరువాత పని చకచకా సాగి, పూర్తయ్యేటప్పటికి అర్థరాత్రి దాటింది.

ఇక అప్పుడు మొదలయ్యింది గొడవ. పని బాగా ఆలస్యమయ్యింది కాబట్టి, ఎక్కువ డబ్బులు ఇవ్వాలని కార్మికులు, ముందే మాట్లాడుకున్న మొత్తానికంటే ఒక్క రూపాయి కూడ ఎక్కువ ఇవ్వనని కాంట్రాక్టరు వాదించుకోవడం మొదలుపెట్టారు. ఎక్కువ ఇస్తానని ఒప్పుకొన్నాకే మధ్యాహ్నం అయినా, పని మొదలెట్టామని కార్మికులు, నేనలా ఏమీ ఒప్పుకోలేదని కాంట్రాక్టరు గొడవపడ్డారు. గొడవ పెరిగి ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవడం వరకూ వెళ్ళింది. చివరకు వాళ్ళడిగిన దానికన్నా చాలా తక్కువ మొత్తం ఇచ్చి బూతులు తిడుతూ సైటు నుండి వాళ్ళని వెళ్ళగొట్టాడు, కాంట్రాక్టరు. రోజూ సైటుకి బెంజ్ కారులో వచ్చే కోటీశ్వరుడు ఆ కాంట్రాక్టరు. పని ఆలస్యమయితే ఓవర్‌టైం అడగడం కార్మికుల హక్కు. కాని వాళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నారు. ఎదురుగా ఉన్నది బాగా డబ్బు, పరపతి ఉన్నవాడు. నోరు తప్ప మరే ఆయుధం లేని సామాన్యులు వాళ్ళు. ఆ ఆయుధాన్నీ కూడ ఉపయోగించారు. కాని ఫలితం లేకపోయింది. కాంట్రాక్టరుని తిట్టుకుంటూ వాళ్ళు సైటు విడిచి వెళ్ళిపోయారు.

ఆ మర్నాడు నేను అక్కడ ఉద్యోగం వదిలి వచ్చేసాను. అక్కడ పనిచేస్తే నేను నేర్చుకునేదేమీ ఉండదనిపించింది. భవిష్యత్తులో నేను కూడ కాంట్రాక్టరులానే పనిచెయ్యల్సిరావచ్చు. అక్కడ ఉన్న కొద్ది రోజులకి వచ్చే జీతం కోసం కాంట్రాక్టరుని అడగమని నాతో పాటు జాయిన్ అయిన ఇంజనీరు అన్నాడు. కాని నాకు అడగాలనిపించలేదు. ఎందుకంటే నేను అక్కడ నేర్చుకున్నదేమీ లేదు, చేసిందీ ఏమీ లేదు, నిలబడి చూడడం తప్ప. అతను ఆ కార్మికులని తిట్టినట్టే నన్నుకూడ తిట్టి ఒక రూపాయి కూడ ఇవ్వకుండా పంపించవచ్చు. ఆ కాస్త మొత్తం కోసం అతనితో గొడవ పడడం నాకు ఇష్టం లేదు. పైగా నా మొదటి జీతం అంటే నాకు చాలా గౌరవం ఉంది. దానిని అలాంటి వ్యక్తి నుండి తీసుకోవడం నాకిష్టం లేదు. ఆ తరువాత కొన్నాళ్ళకి నాకు ఒక మంచి నిర్మాణ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ సంస్థతో దేశంలోని అనేక రాష్ట్రాలు తిరిగి చాలా ప్రాజెక్టులలో పని చేసాను. పాలమూరు కార్మికులతో ఇతర రాష్ట్రాలలో కూడ పని చేసాను. ఒకసారి గుజరాత్‌లో పని చేస్తున్నప్పుడు నన్ను వాళ్ళలోని ఒక యువకుడు అడిగాడు – సారూ, ఇదేమి దేశం? అని. అంత అమాయకులు వాళ్ళు.

అలా ఎంతోమంది పేద కార్మికులనీ, ప్రభుత్వ శాఖలని మోసం చేసి అతను మరిన్ని కోట్లు సంపాదించి ఉంటాడు. అతనే ఈ రోజు పత్రికలో నేను చూసిన వ్యక్తి. మీడియాలో ఎవరి గురించైనా గొప్పగానే చెప్తారు కాని, ఆ వ్యక్తుల నిజస్వరూపం గురించి ఏమీ చెప్పరు. ఆ కాంట్రాక్టరుకి ఎంతమంది కార్మికుల ఉసురు తగిలిందో కాని, ఎన్ని కోట్లు ఉన్నా కన్నకొడుకు ఆరోగ్యాన్ని కొనలేకపోయాడు. మరి తరువాత ఎప్పుడు పశ్చాత్తాపం కలిగిందో ఏమో, పేదవాళ్ళ కోసం ఆశ్రమాన్ని నిర్మించాడట. విధి విలాసం అంటే ఇదేనేమో!

One Comment leave one →
  1. 03/02/2019 15:13

    కుంచం నిండటం అంటే ఇదే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: