EVMలు అవసరం లేదు
09/04/2019
భారతదేశంలో లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సారి మొదటి సారిగా దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో EVMలకు తోడుగా VVPATలు అమర్చబోతున్నారు. 2014 ఎన్నికల్లో మొత్తం దేశంలో కేవలం 8 లోక్సభ నియోజకవర్గాల్లోనే ఇవి అమర్చారు. ఈ VVPAT యంత్రాలలో మనం ఓటు వేసిన పార్టీ గుర్తు చిన్న కాగితంపై ముద్రింపబడి, బయటకు వచ్చి కొన్ని సెకన్లు మనకి కనపడి, తరువాత కింద ఉన్న డబ్బాలో పడిపోతుంది. ఈ కాగితాన్ని మన చూడగలం కాని, తాకలేము. ఎన్నికల లెక్కింపు సమయంలో random గా నియోజక వర్గానికి 1 VVPAT చొప్పున ఈ స్లిప్పులని లెక్కించి EVM లలో వచ్చిన ఓట్ల సంఖ్యలతో సరిపోల్చుతారు. సుప్రీంకోర్టు ఈ సంఖ్యని 1 నుంచి 5 కు పెంచాలని చెప్పింది. అంతకు ముందు ప్రతిపక్షపార్టీలు సగం VVPAT లని అయినా లెక్కించాలని సుప్రీంకోర్టుని కోరాయి. కాని అలా స్లిప్పులన్నీ లెక్కిస్తే ఎన్నో రోజుల సమయం పడుతుందని ఎన్నికల కమీషన్ ఒప్పుకోలేదు. అయినా ఈ స్లిప్పులని కౌంటింగ్ మెషీన్ల సాయంతో త్వరగా లెక్కించగలమా అని కమీషన్ ప్రయత్నిస్తే బాగుంటుంది.
అయితే బ్యాలెట్ పేపర్ పద్ధతి తీసివేసి ఈ యంత్రాలు ప్రవేశపెట్టినప్పటినుండి, ఈనాటి వరకు వీటిపై చాలా మంది ఎన్నో సందేహాలు, అనుమానాలు వ్యక్తపరిచారు. ఈ మెషీన్లని tampering చేసి గెలుస్తున్నారని అరోపిస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేసారు. ముఖ్యంగా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళందరూ, పార్టీలకు అతీతంగా ఈ యంత్రాల వాడకంపై అభ్యంతరం చెప్పారు. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగించని యంత్రాలు మనకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ని మించిన నమ్మకమైన వ్యవస్థ లేదని అంటున్నారు. వీటికి ఎప్పటికప్పుడు ఎన్నికల కమీషన్ జవాబు ఇచ్చుకుంటూ వస్తోంది. అయితే భారత్ లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యాలెట్ పేపర్లు ముద్రించి లెక్కపెట్టడం చాల శ్రమ, సమయం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలా అని ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సందేహాస్పదమైన ఫలితాలతో (ఒక వేళ అనుమానం నిజమైతే) ప్రజాస్వామ్య వ్యవస్థని నడపలేము. అన్ని రకాల అనుమానాలకు అతీతమైన ఎన్నికల విధానాన్ని తీసుకురావాలి.
ఈ EVMలు మన దేశంలో సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి. ఆ తరువాత దశల వారీగా దేశం మొత్తం పరిచయం చెయ్యబడ్డాయి. అయితే అప్పటికీ ఇప్పటికీ, నాకు తెలిసినంతవరకు VVPATలు జత చెయ్యడం మినహా పెద్దగా మార్పులు జరగలేదు. మన దేశంలో టచ్ స్క్రీన్ అంటే తెలియని రోజుల్లో ఉపయోగించిన యంత్రాలనే ఇప్పటికీ పెద్దగా మార్పులు లేకుండా ఉపయోగిస్తున్నాము. రెండు దశాబ్దాలకీ, ఇప్పటికీ టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఎంతో అభివృద్ధి జరిగింది. కొత్త టెక్నాలజీని వీలైనంతవరకూ ఉపయోగించుకోవడం మంచిదే కదా! అలా అని ఆన్ లైన్ ఓటింగ్ జరిపించమని నేను చెప్పను. దానిపై ఇంకా ఎన్నో అనుమానాలు, అపోహలు వస్తాయి.
ప్రస్తుతం మనం ATM లలో డబ్బులు తీసుకున్నప్పుడు మనకి transaction slip వస్తుంది. ఆ స్లిప్పులో మనం ఎంత డబ్బు డ్రా చేసామో, బేలన్స్ ఎంత ఉందో లాంటివి ప్రింట్ అయ్యి వస్తాయి. ఈ ATM లు అన్నీ టచ్ స్క్రీన్ పద్ధతిలోనే పని చేస్తున్నాయి. అలాగే విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్ కూడ, కౌంటర్ వద్దకు వెళ్ళకుండానే ATM లాంటి యంత్రంలో మన వివరాలు ఇచ్చి ప్రింట్ చేసుకోవచ్చు. ఇలాంటి యంత్రాలు ఇప్పుడు రైల్వే స్టేషన్లలో కూడ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే టెక్నాలజీని మనం ఎన్నికల వ్యవస్థలో ఎందుకు ఉపయోగించుకోకూడదు? ప్రతీ పోలింగ్ బూతులో ఒక మామూలు కంప్యూటర్, వీలైనంత పెద్ద టచ్ స్క్రీన్ మానిటర్, ఒక ప్రింటింగ్ మెషీన్, బ్యాలెట్ బాక్స్ పెట్టి ఎన్నికలని పారదర్శకంగా నిర్వహించవచ్చు. బ్యాలెట్ పేపర్లు, EVMలు, VVPAT లు అవసరం లేదు.
ఈ విధానంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యని బట్టి ఒకే టచ్ స్క్రీన్ మానిటర్ కాని, రెండు, మూడు మానిటర్లని కాని ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ఒక మామూలు కంప్యూటర్ కనెక్ట్ చెయ్యాలి. ఈ కంప్యూటర్లో మోడెమ్, వైఫై, బ్లూటూత్ లాంటి నెట్వర్కింగ్ హార్ద్వేర్ లేకుండా చూసుకోవాలి. దానిని ప్రింటర్కి కలపాలి. పోలింగ్ సమయంలో ఓటరు టచ్ స్క్రీన్ మీద తను ఓటు వెయ్యదలుచుకున్న అభ్యర్థి గుర్తుని తాకితే, ఆ గుర్తు ఉన్న ఓటింగ్ స్లిప్ ప్రింటర్లో ప్రింట్ అయ్యి బయటికి వస్తుంది. ఓటర్ ఆ స్లిప్పుని స్వయంగా బ్యాలెట్ బాక్సులో వేస్తాడు.
ఓటింగ్ అయిపోయిన తరువాత బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములో భద్రపరుస్తారు. కౌంటింగ్ సమయంలో ఆ స్లిప్పులని గుర్తుల వారిగా వేరు చేసి కట్టలు కడతారు. ఇది వరకు పోటీ చేస్తున్న అందరి అభ్యర్థుల వివరాలతో బ్యాలెట్ పేపర్ పెద్దదిగా ఉండేది కాబట్టి ఎక్కువ సమయం పట్టేది. కాని ఇప్పుడు స్లిప్పు చిన్నది కాబట్టి త్వరగా చెయ్యచ్చు. ఇదివరకు బ్యాలెట్ పేపర్ మీద ఓటర్లు ఓటు ముద్ర సరిగా వెయ్యకపోవడంవల్ల చాలా ఓట్లు చెల్లకుండా పోయేవి. ఇలా ప్రింటర్ నుండి బ్యాలెట్ పేపర్ ముద్రించి రావటం వల్ల చెల్లని ఓట్లు అనేవి ఉండవు. EVM లతో ఓటింగ్ నిర్వహించడంవల్ల ఏ పోలింగ్ బూతులో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిసి, అక్కడ గెలిచిన లేదా ఓడిన అభ్యర్థులు ప్రజలని ఇబ్బంది పెడుతున్నారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. బ్యాలెట్ స్లిప్పులని కలిపేసి లెక్కిస్తే ఈ గొడవ కూడ ఉండదు. తరువాత వాటిని లెక్కించడానికి బాంకుల నుండి కౌంటింగ్ మెషీన్లని తెప్పిస్తే చాలా త్వరగా కౌంటింగ్ పూర్తి అవుతుంది. అవసరమైతే బ్యాలెట్ స్లిప్పులని కౌంటింగ్ యంత్రాలకి అనువైన సైజులో, మందంలో (అంటే సుమారు కొత్త పది రూపాయల నోటు సైజులో) తయారు చేసుకోవాలి. ఇలా చిన్న బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికీ ఏ అనుమానం ఉండదు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. ప్రస్తుతం 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నిజామాబాద్ నియోజకవర్గంలో కూడ ఈ విధానాన్ని ప్రయత్నించవచ్చును.
Note: నేనేమీ ఎన్నికల విషయాల్లో అథారిటీ కాదు కాని, ఒక సామాన్య పౌరుడిగా నా ఆలోచనలని పంచుకుంటున్నాను.
16 వ్యాఖ్యలు
leave one →
No good suggestion. Adhaar verifiable Online voting should be introduced. Online booth should be co-located with normal evm booth. Lakhs of students employees travellers are not able to vote now. Online voting should be implemented.
1. మన దేశంలో వాడే ఈవీఎం మెషీన్లకు ఎటువంటి కమ్యూనికేషన్స్ సౌకర్యం (ఉ. బ్లూటూత్) లేదు కనుక external/remote devices వాడి వాటిని టాంపర్ చేయలేము
2. ఓటు ఓటుకు మధ్య కంట్రోల్ యూనిట్ రీసెట్ చేయాలి కనుక booth capture/vote stuffing అసాధ్యం
3. జంబ్లింగ్ మూలాన నియోజక వర్గాల వారిగా పార్టీల బాలట్ పోసిషన్ వేరువేరుగా ఉంటుంది. ఈ క్రమం నామినేషన్ ఉపసంహరణ తేదీ తరువాతే నిర్ణయిస్తారు.
4. మెషీన్ల మెమరీ 64kb PROM కనుక ఆట్టే ప్రోగ్రామింగ్ మానిప్యులేషన్ కుదరదు.
4. కొత్తగా VVPAT audit trail కూడా పెట్టారు
Due to the reasons, our EVM’s can be considered as one of the best tamper proof systems in the world.
Please also see my post for a fairly detailed technical analysis.
http://jaigottimukkala.blogspot.com/2016/04/ghmc-results-analysis-part-3.html
అభ్యర్ధులవారీగా స్లిప్పులను ఏరడం, కట్టలు కట్టడం అంతా మళ్ళీ పాత పద్ధతే కదా ?
నరసింహారావు గారు చెప్పినదే కొంచెం బాగుంది.
http://jwalasmusings.blogspot.com/2019/04/blog-post.html?m=1
@ Anon ఆధార్ వెరిఫికేషన్ ఓటరు లిస్టుకి చెయ్యడం మంచిదే.
ఏ కమ్యూనికేషన్ పరికరం లేని EVM మీదే టేంపరింగ్ అరోపణలు వస్తున్నాయి. ఇక ఆన్ లైన్ ఓటింగ్ అంటే హాకింగ్ అని అనుమానాలు వస్తాయి. బ్యాలెట్ పేపర్ లో ఉన్న పారదర్శకత ఇంకెక్కడా ఉండదు. దానినే సింప్లిఫై చేసుకోవాలి అన్నదే నా పోస్టు ఉద్దేశం.
@ Jai ఏ కమ్యూనికేషన్ పరికరం లేకపోయినా EVM మీద టేంపరింగ్ అరోపణలు వస్తున్నాయి. బ్యాలెట్ పేపర్ లో ఉన్న పారదర్శకత ఇంకెక్కడా ఉండదు. దానినే సింప్లిఫై చేసుకోవాలి అన్నదే నా పోస్టు ఉద్దేశం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై ఏ అనుమానానికి తావు లేకుండా చూసుకోవడానికి కొంత కష్టమైనా తప్పదు.
@ Niharika ఈ మధ్య ఆన్ లైన్లో ఫాం 7 ని ఎలా దుర్వినియోగం చేసారో చూసాము కదా! మన దేశంలో ఓటర్లకి ఇప్పట్లో అవన్నీ కుదరకపోవచ్చు. నిన్న రాత్రి NDTV లో ఆంధ్రప్రదేశ్ గురించి చూపిస్తూ ఇక్కడ 80 శాతం పైగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, అదే ఉత్తరాదిలో అయితే సగం మంది మహిళలు కూడ ఓటు వెయ్యరని చెప్పాడు.
బోనగిరి గారూ, బాలట్ పేపర్లు వాడిన రోజులలో భారీ అక్రమాలు జరిగేవి. బీహార్ హరియాణా అంత దూరమెందుకు జమ్మలమడుగు వగైరాలతో బూత్ కాప్చర్ సర్వసాధారణంగా ఉండేది. వీటిని తగ్గించేందుకే ఈవీఎం ప్రవేశపెట్టారు.
అమెరికాలో కొన్ని ప్రాంతాలలో మెషీన్ రీడబుల్ పంచు కార్డులు వాడేవారు. 2000 ఆధ్యక్ష ఎన్నికలలో ఫ్లోరీడాలో ఇదే అతి పెద్ద వివాదం.
టచ్ స్క్రీనులు వాడే ఐడియా బానే ఉంది కానీ మరీ నాజూకేమో అని కాస్త డౌటు.
ఈవీఎం హాకింగ్ ఆరోపణలు రావడం వరకూ నిజమే కానీ ఎన్నికల సంఘం ఇటికల్ హాకింగుకు రమ్మని ఆహ్వానం పలికితే ఒక్క పార్టీ ముందుకు రాలేదు.
ఫిర్యాదులు ఎప్పటికీ ఉండేవే. కాంగ్రెస్ ఈవీఎం టాంపరింగ్ చేస్తుందంటూ “పుస్తకం” రాసిన హరి ప్రసాద్ ఇప్పుడు అదే ఆరోపణ బీజీపీ మీద చేస్తున్నారు. సదరు ఆరోపణలలో ఆయన భాగస్వామి జీవీఎల్ నరసింహా రావు ఇప్పుడు తూచ్ అంటున్నారు.
Agree with jai Garu. EVM should be continued. My concern is about the denial of voting for students employees and travellers. Around 10% voters can’t vote in the present system. Can we force them to go to their home town to vote. Online voting through election commission booths only may be designed. Would like to know the views of jai Garu on this issue.
నా ఆధార్ లో అడ్రెస్ తప్పు పడింది. దానిని మార్చుకోడానికి వెళితే కళ్ళో, ముక్కో మేచ్ అవక రిజెక్ట్ చేస్తున్నారు. ఆధార్ ఆధారిత ఓటు అయితే దొంగ ఓట్లు పడవు అని నా ఉద్దేశ్యం. ఇది చెయ్యాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే !
మీ ఆలోచన మంచిదే. అమలులో సాధకబాధకాలు పేరు చెప్పి ఎవరు ముందుకు రారు. మనలో (సాధారణ వోటర్లో) వివేచన పెరిగితే గాని మార్పుని త్వరగా అంగీకరించం.
@Anon PERMALINK 09/04/2019 17:43
“My concern is about the denial of voting for students employees and travellers. Around 10% voters can’t vote in the present system”
మన దేశంలో పోస్టల్ బాలెట్ పద్దతి ఉంది కానీ ఇది కేవలం ఎన్నికల డ్యూటీ చేసే అధికారులకు పరిమితం. ఉ. తెలంగాణా ఎన్నికలలో ఈవీఎం ద్వారా 2 కోట్ల ఓట్లు పడితే పోస్టల్ బాలెట్లు 1 లక్షకు తక్కువే. పోస్టల్ బాలెట్ విధానం ప్రైవేట్ వ్యక్తులకు విస్తరించే ఆలోచన ఎవరూ చేసినట్టు లేదు.
అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో “ముందస్తు వోటింగ్” వ్యవస్థ ఉంది. ఈ తరహా వ్యవస్థను కూడా భారత అధికారులు పరిగణనలో తీసుకున్నట్టు దాఖలాలు లేవు.
https://www.vote.org/early-voting-calendar/
జై గారు,
ఎలక్షన్ డ్యూటీ వారితో బాటు … మిలటరీ ఉద్యోగులకూ, విదేశాల్లో పనిచేస్తున్న భారత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పోస్టల్ బాలట్ సౌలభ్యం ఉంది.
Postal Ballot in India :: eligible categories
Postal Ballot procedure in India
ఈ ఆధునిక డిజిటల్ యుగంలో … ఏ వోటరైనా దేశంలో ఎక్కడినుంచైనా … తన ఓటు రిజిష్టర్ అయ్యున్న ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో … ఓటు వెయ్యగలిగే సదుపాయం కల్పించడం సాంకేతికంగా పెద్ద కష్టతరమేమీ కాదేమో? ఆ సౌకర్యమే గనక కల్పించగలిగితే … ఓటు వెయ్యడానికై సొంత ఊళ్ళకు ప్రయాణమైన జనాలతో కిక్కిరిసిన రైల్వేస్టేషన్, దోపిడీ చేస్తున్న బస్సు యాజమాన్యాలు … లాంటి వార్తలు విననవసరం ఉండదేమో? 🙁
మన దేశంలో mobile number portability ఉంది కాని, vote portability లేదు.
అది వచ్చేవరకు ఈ తిప్పలు తప్పవు.
నా ఓటుని దిల్లీ నుండి బెంగళూరుకి మార్చుకోవడానికి ఆరేళ్ళు పట్టింది. మూడు సార్లు apply చేస్తే వచ్చింది.
అదృష్టవంతులు మీరు. ఉన్న ఊళ్ళోనే (ఒక మహానగరం) ఒక నియోజకవర్గపు ఏరియా నుంచి మరొక నియోజకవర్గపు ఏరియాకు నా ఓటు మార్పిడిని ఇంతవరకూ సాధించలేకపోయాను ….. ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ. అప్లికేషన్లు దాఖలు చెయ్యడం జరిగింది (ఆన్లైన్ తో సహా); రెండు వరుస సాధారణ ఎన్నికల్లో ప్రచారానికై వచ్చిన అభ్యర్థులకు చెప్పడం జరిగింది, వారు తమ వెనకనున్న అనుచరగణంతో “కనుక్కోండి, కనుక్కోండి. సార్ ఓటు వెంటనే బదిలీ చేయించండి” అంటూ హడావుడి చెయ్యడం, “అలాగే అన్నా” అని ఆ అనుచరులు తల వూపడం …అన్నీ జరిగాయి.
@విన్నకోట నరసింహారావు:
“ఎలక్షన్ డ్యూటీ వారితో బాటు … మిలటరీ ఉద్యోగులకూ, విదేశాల్లో పనిచేస్తున్న భారత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పోస్టల్ బాలట్ సౌలభ్యం ఉంది”
Thanks for the info sir.
“ఓటు వెయ్యగలిగే సదుపాయం కల్పించడం సాంకేతికంగా పెద్ద కష్టతరమేమీ కాదేమో?”
సాంకేతికంగా సులువు కావొచ్చును కాకపొతే టాంపర్/హాక్ ప్రూఫ్ చేయడమే అసలు ఛాలెంజ్. “Anywhere voting” కావాలంటే ఎదో ఒక కమ్యూనికేషన్ ప్రోటోకాల్ కావాలి. టెక్నాలజీ అధికారులకు ఎంత తెలుసో హాకర్లకు అంతే తెలుస్తుంది.
హాకర్లకు టెక్నాలజీ ఒక రవ్వ ఎక్కువే తెలిసుండే అవకాశాలు అధికం, హ్హ హ్హ హ్హ 🙂.