విద్యార్థులారా, క్యూ లైన్లలో చావకండి.
04/05/2019
విద్యార్థులారా, క్యూ లైన్లలో చావకండి, చావకండి.
Intermediate అంటే మీ జీవితంలో Intermission కూడ కాదు, అప్పుడే THE END అనేస్తే ఎలా?
మార్కులు, రాంకులు రాకపోతే సమాజం మిమ్మల్ని బతకనివ్వదా? నూరేళ్ళ జీవితంలో ఒక ఏడాది పరీక్ష తప్పడం పెద్ద నేరమూ కాదు, పాపమూ కాదు. అయినా ప్రభుత్వం చేసిన తప్పుకి మీరు ఎందుకు బలి అవ్వాలి? దమ్ముంటే నిలదీయండి, లేకపోతే మరోసారి పరీక్ష వ్రాయండి.
మన తెలుగు సమాజంలో మీరు పుట్టకముందే, మీ కోసం మూడు, నాలుగు క్యూ లైన్లు తయారు చేసి పెట్టారు. ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ మొదలైనవి. మీరు పుట్టగానే మీ తల్లిదండ్రులు నిర్ణయించేస్తారు, మిమ్మల్ని ఏ క్యూ లైన్లో తోసెయ్యాలో. ఆ క్యూ లైన్ చివర ఒక అందమైన, అద్భుతమైన జీవితం ఉందని మీకు నూరి పోస్తారు. ఎలాగోలా అక్కడకు చేరుకుంటే మీ భవిష్యత్తుకు డోకా ఉండదని భరోసా ఇస్తారు. ఆ తరువాత మీ బతుకు అంతా ఆ లైన్లోనే బందీ అయిపోతుంది. ఆ క్యూ లైన్లు మనుషుల బోనులు లాంటివి, జువనైల్ హోమ్స్ లాంటివి. అక్కడ మీ తోటి విద్యార్థులతో తోసుకుంటూ, తొక్కుకుంటూ, ఒకడి మీద ఇంకొకడు పడిపోతూ, ఏడుస్తూ, నవ్వుతూ, పుస్తకాలకి శిలాజాల్లా అతుక్కుపోయి బతుకు ఈడుస్తూ ఉంటారు.
అక్కడ ఉపాధ్యాయులనబడేవాళ్ళు నడవడానికే కుదరని చోట మీతో పరుగు పందెం ఆడిస్తారు. ఆ రేసులో ఏ పదిమందో గెలుస్తారు. మిగతా వాళ్ళు ఏడుస్తారు. మార్కులు, రాంకులు రాని వాళ్ళని ఎందుకూ పనికిరానివాళ్ళుగా ముద్ర వేసేస్తారు. సమాజం, తల్లిదండ్రులు చూసే చిన్న చూపు భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. నిజానికి ఇక్కడ పోటీ పడేది మీరు కాదు, మీ తల్లిదండ్రులు. పక్కోడి పిల్లల కంటే మనోళ్ళు గొప్పగా అయిపోవాలని, వాళ్ళే మిమ్మల్ని ఈ రేసులో దించుతారు. వాళ్ళ బలహీనతని కొన్ని విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి.
తల్లిదండ్రులారా, IT కంపెనీల కోసం పిల్లలని కనకండి. మీ కోసం, దేశం కోసం పిల్లలని కనండి.
కాని విద్యార్థులారా, ఒక్కసారి ఈ క్యూ లైన్లని బద్దలుకొట్టి బయటకు వచ్చి చూడండి.
అక్కడ మీ అందమైన బాల్యం గంతులు వేస్తూ కనపడుతుంది.
ప్రపంచం విశాలంగా, ప్రకృతి ప్రశాంతంగా కనిపిస్తాయి.
పోటి తత్వానికి బదులు ప్రాణ స్నేహం కనపడుతుంది.
ఆట స్థలమే విశ్వవిద్యాలయంలా కనిపిస్తుంది.
షెడ్లలో బ్రాయిలర్ కోడిలా పెరిగి, కేంపస్లో ఉద్యోగమిచ్చే కంపెనీకి ఆహారంగా మారుతారో,
ప్రకృతిలో నాటు కోడిలా పెరిగి, సొంత కాళ్ళమీద నిలబడి, తలెత్తుకు బతుకుతారో మీరే నిర్ణయించుకోండి.
మనిషికి, మర మనిషికి మధ్యలో ఎక్కడో, నరయంత్రంలా జీవించకుండా బతికెయ్యకండి.
అసలు విజయం అంటే ఏమిటి? కెరీర్ అంటే ఏమిటి?
కోట్లు సంపాదించడం విజయం కాదు. కోటు వేసుకునే ఉద్యోగం చెయ్యడం కెరీర్ కాదు.
మీకు అభిరుచి ఉన్న పని చేస్తే, ఆడుతూ పాడుతూ విజయం సాధిస్తారు.
ఎన్ని కోట్లు సంపాదించినా, కోల్పోయిన బాల్యాన్ని మళ్ళీ పొందలేరు.
జీవితాంతం ఆనందంగా బతకడమే అన్నింటి కంటే పెద్ద విజయం.
వీలైతే మరో పదిమందిని ఆనందంగా బతికించడమే గొప్ప కెరీర్.
No comments yet