తెలుగేలరా? ఓ రాఘవా…
24/11/2019
“ఒకటో తరగతిలో చేరిన ప్రతి విద్యార్థి, ప్రపంచంతో పోటీ పడితే చివరికి ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడ మిగలరు.”
ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే విద్యా బోధన జరుగుతుందంటూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ ప్రభుత్వం చేసిన వాదన ఏమిటంటే మన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ప్రపంచంతో పోటీ పడగలరని. ఈ వాదనపై నా అభిప్రాయమే పైన వ్రాసిన వ్యాఖ్య. చాలా ఉద్యోగాలకి మన విద్యార్థులు దేశంలోని ఇతర రాష్ట్రాలతో కూడ పోటీ పడాలి. అలాగని హిందీ మీడియంలో కూడ చదవడం వీలవుతుందా? అసలు ఇంగ్లీష్ మీడియంలో చదివినవాళ్ళంతా ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నారా? పబ్లిక్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో చదివినవాళ్ళు కూడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల్లో బి.టెక్ పాసై కనీస కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఉద్యోగాలు దొరక్క ఖాళీగా తిరుగుతున్నారు.
అసలు సమస్య మీడియం తెలుగా, ఇంగ్లీషా అని కాదు. మన విద్యా వ్యవస్థలో ప్రమాణాలు ఎలా ఉంటున్నాయనేది అసలు సమస్య. కెజి నుండి పిజి వరకు అన్ని విద్యాసంస్థలలో ఉన్నత ప్రమాణాలతో విద్యని బోధిస్తేనే మన విద్యార్థులు ఎక్కడైనా రాణించగలుగుతారు. పాఠాలని బట్టీ పట్టడం, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం, రాంకులు తెచ్చుకోవడం మీద మాత్రమే శ్రద్ధ చూపుతున్నారు కాని, పాఠాలని అర్థం చేసుకుని చదవడం మీద శ్రద్ధ లేదు. అందుకే మన దేశం ఇంజనీర్లని ఉత్పత్తి చేస్తోంది కాని, సైంటిష్టులని సృష్టించలేకపోతోంది. హైస్కూలు స్థాయి నుండే లాబొరెటరీలలో ప్రయోగాలు చెయ్యడం, సృజనాత్మకంగా ఆలోచించే అవకాశం మన విద్యావ్యవస్థలో లేదు. కార్పొరేట్ స్కూళ్ళలో అయితే ఇంటర్మీడియట్లో కూడ సైన్స్ ప్రాక్టికల్స్ నామమాత్రంగా చేయిస్తున్నారు.
నా అభిప్రాయం ఏమిటంటే ఒకటో తరగతి నుండి అయిదో తరగతి వరకు అందరికీ తప్పనిసరిగా మాతృభాష అయిన తెలుగు మీడియంలోనే బోధించాలి. ఆరవ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం కూడ ప్రవేశపెట్టాలి. అయితే ఏ మీడియంలో చదవాలి అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలి. అసలు ప్రజాస్వామ్యదేశంలో ఏ మీడియంలో చదువుకోవాలన్నది ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తాయి? ఆ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేయాలి. ప్రజలందరూ తెలుగు మీడియం వద్దనుకుంటే అది దానంతటదే సహజం మరణం (natural death) పొందుతుంది. ప్రభుత్వమే కావాలని తెలుగుని గొంతు నులిమి చంపేయడం ఎందుకు? తెలుగు రాష్ట్రాలు కూడ తెలుగుని ప్రోత్సహించకపోతే ఇంకెవరు చేస్తారు? పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో తెలుగు స్కూళ్ళని కాపాడుకోవడానికి ప్రవాసాంధ్రులు పోరాటం చేస్తున్నారు.
సమాజంలో ప్రతి వ్యక్తీ ఒకే స్థాయి తెలివితేటలు, నైపుణ్యం కలిగి ఉండరు. అందరికీ ప్రపంచంతో పోటీ పడే అర్హత, ఆసక్తి ఉండవు. ఒక చిన్న ఊరిలో, ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగా పని చేసే ఉద్యోగి ఇంగ్లీష్ మీడియంలో చదివాల్సిన అవసరం ఏముంది? అతను ప్రతి రోజు సామాన్యులతోనే, తెలుగులోనే మాట్లాడాలి. అలాంటివారు తెలుగు మీడియంలో చదవడమే మంచిది. నిజానికి మన తెలుగు రాష్ట్రంలో తెలుగుని ప్రోత్సహించడానికి అలాంటి ఉద్యోగాలని తెలుగు మీడియంలో చదివినవాళ్ళకే రిజర్వ్ చెయ్యలి. ఆఫీసర్ కన్నా కింది స్థాయి ఉద్యోగాలన్నింటిని కనీసం పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివినవాళ్ళకే రిజర్వ్ చేస్తే ఈ ఇంగ్లీష్ మీడియం వ్యామోహం తగ్గుతుంది. తెలుగు భాష ఇంకొన్ని దశాబ్దాలు బతికి ఉంటుంది.
ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ సబ్జక్టునే, ఉపాధ్యాయులు, విద్యార్థులు సీరియస్గా తీసుకోవడం లేదు. ఇంగ్లీష్ సబ్జక్టుని శ్రద్ధగా చదివితే కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా పెరుగుతాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధించగలిగే ఉపాధ్యాయులు ఎంతమంది ఉంటారు? వాళ్ళలో చాలామంది తెలుగు మీడియంలో చదివినవాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా ఇంగ్లీషులో పాఠాలు చెప్పమంటే ఎలా చెప్తారు? వాళ్ళకి అవసరమైన శిక్షణ కూడ ఇవ్వాలి. అందుకే ఇంగ్లీష్ మీడియాన్ని దశలవారీగా ఒక్కో పాఠశాలలో, ఒక్కో సెక్షన్ పెడుతూ, వచ్చే విద్యాసంవత్సరం ఆరవ తరగతి నుండి మొదలుపెట్టి ఒక్కో సంవత్సరం, ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతే విద్యార్థులకి, ఉపాధ్యాయులకి ఇబ్బంది ఉండదు. లేకపొతే విద్యార్థులు రెంటికి చెడిన రేవడి అవుతారు. ఇప్పుడే అంతంతమాత్రంగా ఉన్న విద్యా ప్రమాణాలు ఇంకా తగ్గిపోతాయి. సామాన్య విద్యార్థులకి టెంత్ పాసవడమే కష్టమవుతుంది. ఇక వాళ్ళు పై చదువులు ఎలా చదువుతారు? ప్రపంచంతో ఎలా పోటీ పడతారు?
3 వ్యాఖ్యలు
leave one →
Very good article. Totally agree with you.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాధ్యమంలో విద్యాబోధన విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను. ఏ మీడియంలో చదవాలన్న నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులు తీసుకోవడమే ప్రజాస్వామ్య వ్యవస్థలో సరి అయిన పద్ధతి.
చాలా బాగా వ్రాశారు బొనగిరి గారు.
డిగ్రీ స్థాయిలో కూడా subjects వివరించడానికి తెలుగు ఉపయోగించాలి. తెలుగులో మాట్లాడనివ్వ కుండా విద్యార్థులను నిర్బంధించ కూడదు.
గతంలో తెలుగు మాధ్యమం లో చదివిన వారు ఆంగ్లంలో కూడా మంచి పట్టు సాధించి ఉన్నత స్థాయికి వెళ్లారు.
ఇంటర్ మీడి యట్ లో సంస్కృతం , తెలుగు పేపర్లకు సమానం గా మార్కులు ఇస్తే చాలామంది తెలుగు సబ్జెక్టు తీసుకుంటారు.
ఆంగ్ల మాధ్యమం ఉన్నప్పటికీ తెలుగులో వివరించే వెసులుబాటు ఉండాలి. ఆంగ్ల వాక్యం చదివి దాని అర్థం తెలుగులో వివరిస్తే విద్యార్థులకు సులభంగా అర్థంవుతుంది.