విషయానికి వెళ్ళండి

మర్యాద రామన్నలు

02/04/2020

ఇది సుమారు పాతికేళ్ళ క్రితం జరిగిన సంఘటన. గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరప్రాంతంలో ఒక చిన్న గ్రామం. అప్పుడు అక్కడ ఒక పెద్ద ఫాక్టరీ నిర్మాణం జరుగుతోంది. కొన్ని వందలమంది ఇంజనీర్లు, ఇతర సిబ్బంది, కొన్ని వేలమంది కార్మికులు అందులో పని చేసేవారు. అక్కడ నేనూ ఒక ఇంజనీరుగా పనిచేసాను. కంపెనీ సిబ్బంది దగ్గరలోని ఒక చిన్న పట్టణంలో ఉండేవారు. కార్మికుల కోసం సైటు దగ్గరే పెద్ద లేబర్ కాలనీ ఏర్పాటు చేసారు. పేరుకు లేబర్ కాలనీయే కాని అది సుమారు మూడు వేలమంది కార్మికులతో ఒక గ్రామంలా ఉండేది.

ఫాక్టరీ సైటుకి ఎదురుగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామ రైతులే ఫాక్టరీకి భూములిచ్చారు. ఆ గ్రామస్థులు పెద్దగా చదువుకున్నవాళ్ళు కాదు. స్థానిక భాష కఠియావాడి మాట్లాడేవారు, ఇది గుజరాతి కంటే కొంచెం వేరుగా ఉంటుంది. కాని ఫాక్టరీ వాళ్ళతో కొద్ది కొద్దిగా హిందీ మాట్లాడేవారు. గుజరాత్ అప్పటికే పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం. కాని వాళ్ళకి చదువుల మీద కంటే వ్యాపారం మీదే ఆసక్తి ఎక్కువ. సౌరాష్ట్ర గ్రామీణులైతే వేషభాషలతో సహా చాలా పాత కాలం వారిలా ఉండేవారు.

ఫాక్టరీ నిర్మాణంలో గుజరాతీల కంటే మిగతా రాష్ట్రాల వాళ్ళే ఎక్కువగా పని చేసేవారు. లేబర్ కాలనీలో బెంగాల్ నుండి కేరళ వరకు అన్ని రాష్ట్రాల కార్మికులు ఉండేవాళ్ళు. అయితే బీహార్, ఒరిస్సాల నుండి వచ్చినవాళ్ళు మామూలు కూలి పని చేస్తే కేరళ కార్మికులు స్టీల్ ఫాబ్రికేషన్ లాంటి స్కిల్‌డ్ పనులు చేసేవాళ్ళు. వీళ్ళు కొద్దో గొప్పో చదువుకున్నవాళ్ళే కాకుండా ప్రపంచజ్ఞానం ఉన్నవాళ్ళూ. నాకు తెలిసి మళయాళీలు చాలా తెలివైనవాళ్ళు, కామన్ సెన్స్ ఎక్కువ, ఎక్కడైనా బతికెయ్యగలరు. ఇకపోతే స్థానిక గ్రామస్థులు ట్రాక్టర్లు తోలడం, ఇసుక, రాళ్ళు సప్లై చెయ్యడం లాంటి పనులు చేసేవాళ్ళు. ఫాక్టరీ యాజమాన్యం కూడ స్థానికులని మంచి చేసుకోవడానికి, వాళ్ళకి ఏదో ఒక పని ఇచ్చేవాళ్ళు.

ఇలా ఒక ఏడాది గడిచాకా కాంక్రీట్ పనులు కొంతవరకు పూర్తి అయి, ఫాబ్రికేషన్ పనులు ఊపందుకున్నాయి. అప్పుడు కేరళ కార్మికులు ఎక్కువయ్యారు. ఈ మళయాళీలు స్థానికుల వేషాన్ని, వాళ్ళ భాషని చూసి ఎగతాళి చెయ్యడం మొదలుపెట్టారు. గ్రామస్థులు వెనుకబడినవాళ్ళని, వాళ్ళకి ఇంగ్లీషు కాదు కదా, హిందీ కూడ సరిగా రాదని గేలి చేసారు. కేరళా వాళ్ళని చూసి, మిగతా వాళ్ళు కూడ గ్రామస్థులని ఆటపట్టించడం మొదలుపెట్టారు. అందరూ ముందు ఇదేదో చిన్న విషయం అనుకున్నారు కాని, అది చివరికి చాల పెద్ద గొడవ అయ్యింది. గ్రామస్థులు మంచివాళ్ళే కాని, వాళ్ళని హేళన చెయ్యటంతో కోపం, పగ పెంచుకున్నారు. బయటినుండి వచ్చినవాళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలని సమయం కోసం వేసి చూసారు.

సాధారణంగా పెద్ద పెద్ద నిర్మాణ పనులు 24 గంటలూ జరుగుతూనే ఉంటాయి. ఆదివారం కూడ జరుగుతాయి కాని, ఆదివారం మధ్యాహ్నం తరువాత జరగవు. ఆ ఒక్క పూట, కార్మికులు వంటకు కావల్సిన సరుకులు కొనుక్కోవడం, సినిమాలకి వెళ్ళడం, బట్టలు ఉతుక్కోవడం లాంటి పనులు చేసుకుంటారు. ఆదివారం రాత్రికి అందరూ కాలనీకి చేరుతారు. అలాంటి ఒక ఆదివారం రాత్రి కొంతమంది గ్రామస్థులు ట్రాక్టర్ల మీద లేబర్ కాలనీకి వచ్చి గునపాలు, కత్తులతో కార్మికుల మీద హఠాత్తుగా దాడి చేసారు. లేబర్ కాలనీని తగలపెట్టేందుకు ప్రయత్నించారు. ఇది ఊహించని కార్మికులు చేతికందింది పట్టుకుని స్థానికులతో కొట్లాటకి దిగారు. అయితే చాలామంది భయపడి అక్కడి నుండి పారిపోయారు. దగ్గరలోని తోటల్లో రాత్రంతా దాక్కొని తెల్లవారాక పట్టణాలకి చేరుకున్నారు. వాళ్ళలో చాలామంది ఏదో ఒక బస్సు పట్టుకుని గుజరాత్ విడిచి పారిపోయారు. దెబ్బలు తగిలినవాళ్ళు ఆసుపత్రుల్లో చేరారు.

మర్నాడు ఉదయం కంపెనీ సిబ్బందిని కూడ సైటులోకి వెళ్ళకుండా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు వచ్చి నచ్చచెప్పాక వదిలిపెట్టారు. మేము సైటులోకైతే వెళ్ళాము కాని, ఏ పనీ చెయ్యగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే లేబర్ కాలనీలో ఎవరూ లేరు, అంతా పారిపోయారు. కాలనీ కొంత తగలబడిపోయింది.

ప్రాజెక్టు మేనేజర్లు వెంటనే సిబ్బందినీ, లేబర్ కాంట్రాక్టర్లనీ మీటింగుకి పిలిచారు. ఏం చెయ్యాలో అందరికీ వివరించారు. ఫాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాలు, దగ్గరలోని పట్టణాలకీ మనుషులని పంపించి కనపడిన కార్మికులనందరినీ వెనక్కి పిలిపించారు. తిరిగొచ్చిన కార్మికులందరికీ సైటులోని కేంటినులో భోజనం వండించారు. కంపెనీ సిబ్బంది స్వయంగా కార్మికులకి భోజనం వడ్డించి వాళ్ళకి ధైర్యం చెప్పారు. లేబర్ కాలనీలో సెక్యూరిటీ పెంచి కనీస సౌకర్యాలు కల్పించారు.

అయినా సగం మంది కార్మికులు తిరిగి రాలేదు. మళ్ళీ వేరే లేబర్ కాంట్రాక్టర్లకి చెప్పి దేశంలోని ఇతర ప్రాంతాలనుండి కార్మికులని రప్పించడానికి టైము పడుతుంది. ఈలోగా ముఖ్యమైన పనులు చెయ్యడానికి ఉన్న వాళ్ళని ఉపయోగించారు. కార్పెంటర్లు, మేసన్లు లాంటి నైపుణ్యం ఉన్న కార్మికులు తక్కువగా ఉంటే, వాళ్ళ క్రింద హెల్పర్లుగా పని చేసినవాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చి ఉపయోగించుకున్నారు.

ఇది జరుగుతుండగా కంపెనీ యాజమాన్యం గ్రామస్థులతో, స్థానిక నాయకులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దారు. ఫాక్టరీ నిర్మాణం పూర్తి అయ్యాక గ్రామస్థులకి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు, గ్రామంలో ఆసుపత్రి లాంటి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత ఫాక్టరీ నిర్మాణం సజావుగా పూర్తి అయ్యింది. అయితే అక్కడ పని చేసిన సిబ్బంది అంతా ఈ సంఘటనతో క్లిష్ట పరిస్థితుల్లో ఎలా పని చెయ్యాలో, ఒక మంచి మేనేజిమెంటు పాఠం నేర్చుకున్నారు. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడి స్థానికులని గౌరవించాలని, వారి సంస్కృతిని, అలవాట్లని హేళన చెయ్యకూడదని తెలుసుకున్నారు.

 

4 వ్యాఖ్యలు leave one →
  1. 03/04/2020 08:22

    ఈ సంఘటనలో మేనేజిమెంట్ పాఠం బాగానే చెప్పారు. కాని, ధనవంతులమని,తెలివైనవారమని,అందమైనవారమని పేదవారిని, తెలివి తక్కువవారిని హేళన చేస్తే పరిణామాలు వ్యతిరేకంగా ఉంటాయనే జీవిత పాఠం మరచారా?

  2. 03/04/2020 17:05

    సరిగా అర్థం కాలేదండి, నేనెవరినీ హేళన చెయ్యలేదే!

  3. 03/04/2020 19:03

    మీరు ఎవరినో ఎగతాళీ చేశారని నేననలేదు.
    తెలివైనవాళ్ళు తెలివి తక్కువవాళ్ళని అదేపనిగా ఎగతాళీ చేస్తే పరిణామాలు విపరీతంగా ఉంటాయన్న జీవిత సత్యం మరచారా అన్నా అంతే

  4. సూర్య permalink
    04/04/2020 06:30

    Be a Roman when you are in Rome అన్నారు.
    దక్షిణ భారతీయులలో నేను గమనించిన లక్షణం ఏమిటంటే ఇతర ప్రాంతాలకు వెళ్లినా అంతగా స్థానికులతో కలవకపోవటం. ప్రతివారూ తమ భాష మాట్లాడే వారితోనే గుంపులుగా కలిసి తిరుగుతూ అపుడపుడు గందరగోళం సృష్టిస్తూ ఉంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: