విషయానికి వెళ్ళండి

వరద ప్రయాణం

01/05/2020

అది 1986 ఆగష్టు, ఎప్పటిలానే ఆ ఏడాది కూడ గోదావరి నదికి వరదలు వచ్చాయి. కాని ఈ సారి భారీగా వచ్చాయి. గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. అప్పుడు నేను విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. మా కుటుంబం నరసాపురంలో ఉండేది. నెలకో రెండు ఆదివారాలు నరసాపురం (140 కి. మీ) వచ్చి వెళ్ళేవాడిని. విజయవాడలో సాయంత్రం 6 గంటలకి గుంటూరు – నరసాపురం ఫాస్ట్ పాసింజర్ ఎక్కితే రాత్రి పదకొండింటికి నరసాపురం చేరేది. ఈ రైలు గురించి గతంలో ఒక టపా వ్రాసాను. అది ఇక్కడ. మా ఊరు వెళ్ళడానికి రైల్వే స్టేషనుకి వెళితే రైలు భీమవరం వరకే వెళుతుందని ఎంక్వైరీలో చెప్పాడు. సరే అక్కడ నుండి నరసాపురానికి ఏదో ఒక వాహనం దొరకకపోతుందా అని టికెట్ తీసుకుని బయలుదేరాను. అంతగా కుదరకపోతే అదే రైల్లో మర్నాడు ఉదయం విజయవాడ తిరిగి వచ్చేద్దామనుకున్నాను.

ఆ ఫాస్ట్ పాసింజర్ రైలు చాలా నెమ్మదిగా ప్రయాణించి ఇంచుమించు అర్థరాత్రి సమయానికి భీమవరం టౌను స్టేషన్ చేరుకుంది. ఆ సమయంలో అక్కడ తినడానికి టిఫిన్ మాత్రమే దొరికింది. టిఫిన్ తిన్నాక బస్‌స్టాండ్ వద్దకు వెళదామని బయలుదేరాను. యనమదుర్రు డ్రైన్ మీదున్న బ్రిడ్జి దాటగానే వరద నీళ్ళు కనపడ్డాయి. బస్‌స్టాండ్ మొత్తం నీటిలో మునిగిందని చెప్పారు. సరే రాత్రి ఏ చేస్తాం, తెల్లారాక ఏదో ఒకటి ఆలోచిద్దామని మళ్ళీ రైల్వే స్టేషన్‌కి వచ్చి రైల్లోనే నిద్రపోయాను. తెల్లారి లేచాకా టీ తాగి మళ్ళీ బస్‌స్టాండ్ వైపుకి వెళ్ళాను. వరద అలాగే ఉంది. అక్కడ పోగైన జనాలని అడిగితే తలోరకంగా చెప్పారు. కొంతమంది వరద భీమవరం వరకే ఉందంటే, కొంతమంది పాలకొల్లు వరకు ఇలాగే ఉందన్నారు. ఏం చెయ్యాలా? అని ఆలోచిస్తుంటే పక్కన కొంతమంది గ్రామీణ యువకులు వరదలో ఎలాగైనా ముందుకే వెళ్ళాలని ప్లాన్లు వేస్తున్నారు. మీరు కూడ వస్తారా? అని నన్ను అడిగారు. వాళ్ళు కొన్ని కర్రలు, తాళ్ళు సంపాదించారు. అందరూ తాడుని పట్టుకుని కర్రలతో ముందు ఏమైనా గోతులు లాంటివి ఉన్నాయా? అని చూసుకుంటూ మెల్లగా వరదలోనే నడుచుకుంటూ వెళ్ళాలని ప్లాన్ చేసారు. నాకు ముందు భయం వేసింది. ఇలాంటి అడ్వెంచర్లు ఎప్పుడూ చెయ్యలేదు. పైగా నాకు ఈత కూడ రాదు. అయినా ఆ కుర్రాళ్ళు ధైర్యం చెప్పారు. అంతగా ముందుకు వెళ్ళలేకపోతే, అక్కడి నుండే వెనక్కి వచ్చేద్దామన్నారు. అప్పుడు నాది కూడ కుర్రతనమే కదా! ఏమయితే అయ్యింది, ఒక సాహసం చేద్దామని వాళ్ళతో బయలుదేరాను.

కొన్ని బిస్కట్ పేకెట్లు కొనుక్కుని, ఉదయం 6 గంటలకి బయలుదేరి భీమవరం మెయిన్ రోడ్డులో నెమ్మదిగా నడుస్తున్నాము. ఊరు దాటి బస్ డిపో దగ్గరకు వచ్చేసరికి నీళ్ళు మోకాళ్ళ పైకి వచ్చేసాయి. తరువాత విస్సాకోడేరు చేరాకా కొంచెం తగ్గాయి. మాకు ఎదురుగా కూడ కొంతమంది వరదలో నడుచుకుంటూ భీమవరం వస్తున్నారు. ముందు వరద ఎలా ఉందని అడిగితే, పరవాలేదు అని భరోసా ఇచ్చారు. ఎక్కడైనా కొంచెం ఎత్తైన ప్రదేశం కనపడితే అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడక మొదలెట్టేవాళ్ళం. భీమవరం నుంచి సుమారు 8 కిలో మీటర్లు నడిచాకా శృంగవృక్షం సమీపానికి వచ్చాము. అక్కడ నుంచి మళ్ళీ నీటి మట్టం పెరిగింది. మాకు నడుము లోతు నీళ్ళు వచ్చేసాయి. పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, దాని మీద నుండి వెళదామా అని అనుకున్నాము. కాని రైల్వే ట్రాక్ కూడ చాల చోట్ల కొట్టుకుపోయిందని చెప్పారు. ఇక చేసేదేమి లేక భయం, భయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ ప్రయాణం కొనసాగించాము. శృంగవృక్షం ఊరు దాటి కొంత దూరం వెళ్ళాకా వరద చాలా వరకు తగ్గింది. మోకాళ్ళ క్రిందవరకే నీళ్ళు ఉన్నాయి.

మరో మూడు, నాలుగు కిలోమీటర్లు నడిచాకా వీరవాసరం వచ్చింది. అప్పటికి మిట్టమధ్యాహ్నం అయ్యింది. సుమారు 12 కిలోమీటర్లు నీళ్ళలో నడిచాము. వీరవాసరం చేరుకున్నాక మాలోని కొంతమంది యువకులు వాళ్ళ ఊరు వచ్చిందని వెళ్ళిపోయారు. ఇంకో ముగ్గురు మాత్రమే మిగిలాము. ఊళ్ళో నడుస్తుంటే ఆ ఊరివాళ్ళు మమ్మల్ని ఆపి భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. పరవాలేదు, మా ఊరెళ్ళాకా తింటామని చెప్పినా వాళ్ళు వదల్లేదు. మీ పట్నం వాళ్ళకి మొహమాటం ఎక్కువ, ఏమైనా సరే అన్నం తినే వెళ్ళాలని పట్టు పట్టారు. మాకు కూడ ఆకలిగానే ఉండడంతో సరేనని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. గోదావరి ప్రజల ఆప్యాయత అంటే ఏమిటో అప్పుడు మళ్ళీ తెలిసివచ్చింది. పులిహోర, ఆవకాయ అన్నం, పెరుగు అన్నం పెట్టారు. కడుపు నిండా తిని మళ్ళీ నడక మొదలుపెట్టాము.

వీరవాసరం దాటి ఇంకో 5 కిలోమీటర్లు నడిచాకా లంకల కోడేరు వచ్చింది. అక్కడ వరద మొత్తం తగ్గిపోయింది. నాతో ఉన్న మిగతా ఇద్దరూ అక్కడే ఆగిపోయారు. వాళ్ళ ఊళ్ళు దగ్గరలోనే ఉన్నాయట. ఎవరినో వాకబు చేసి ఒక వ్యక్తి సైకిల్ మీద పాలకొల్లు వెళుతుంటే అతనితో కలిసి నన్ను వెళ్ళమన్నారు. కొంచెంసేపు నేను, కొంచెంసేపు ఆ వ్యక్తి సైకిల్ తొక్కేలా ఏర్పాటు చేసారు. అలా ఇంకో 5 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించి మొత్తానికి పాలకొల్లు చేరుకున్నాను. అదృష్టవశాత్తు పాలకొల్లు నుండి నరసాపురానికి (10 కి.మీ.) ఏదో వేన్ దొరికింది. ఆ వేనులో క్షేమంగా నరసాపురం చేరుకున్నాను. సాయంత్రం నాలుగింటికి మా ఇంటికి వెళ్ళగానే అందరూ ఆశ్చర్యపోయారు, వరదలో విజయవాడ నుండి నరసాపురం ఎలా వచ్చావురా అని. మా ఇంటి దగ్గర కూడ మా వీధిలోని వాళ్ళంతా కలిసి ఆహార పొట్లాలు తయారుచేసే పనిలో ఉన్నారు. నరసాపురం సమీపంలోని గ్రామాల ప్రజలని పట్టణంలోని కాలేజీలో, హైస్కూళ్ళలో ఉంచారట. వాళ్ళకి అందచెయ్యటానికి అన్నం పొట్లాలు చేస్తున్నారు.

3 వ్యాఖ్యలు leave one →
  1. బుచికి permalink
    01/05/2020 17:19

    ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం ఇది బోనగిరి గారు.

  2. 01/05/2020 22:16

    ఔనండి, ప్రస్తుతం వలస కార్మికుల తిరుగు ప్రయాణం చూస్తుంటే ఆనాటి నా వరద ప్రయాణం గుర్తుకు వచ్చింది.

  3. Prameela permalink
    03/05/2020 21:57

    During my trip to India in Dec, 2019 – visited Anthrvedi, penugonda. So, I am able to connect to your experience very well. I like your sentence – I was young at that time so didn’t mind to do adventure. Interesting to see the mind set change with age!

వ్యాఖ్యానించండి