ఇంటర్ – ఎంసెట్ – అన్వేషణ
జూన్ 8 1985 అంటే, ఇవ్వాళ్టికి సరిగ్గా 35 సంవత్సరాల క్రితం. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజు అది. ఆ రోజు వరకు నా జీవితంలో అంత టెన్షన్ పడ్డ రోజు మరొకటి లేదు అని చెప్పాలి. అయితే ఉద్యోగంలో చేరి జీవన పోరాటం మొదలుపెట్టాక అంత కంటే ఎక్కువ టెన్షన్ పడ్డ రోజులు కూడ చాలా ఉన్నాయి. ఆ రోజు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జాం. అసలు మే లోనే జరగవలసిన ఎంసెట్ పరీక్ష, పేపర్ లీక్ కావడంవలన అనుకుంటా, జూన్‌కి వాయిదా పడింది. ఆ రోజుకి రెండు రోజులు ముందు నరసాపురం నుండి కాకినాడలో ఉన్న మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాను.
అదే రోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చే రోజు కూడ. మమూలుగా అయితే ఇంటర్ రిజల్ట్స్ గురించి పెద్దగా భయం ఉండేది కాదు కాని, ఆ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్ చాలా టఫ్‌గా ఇచ్చాడు. అక్కడికీ నా తెలివి తేటలు అన్నీ ఉపయోగించి అయిదారు ప్రశ్నలకి జవాబులు వ్రాసి పాస్ మార్కులు వస్తాయని ధైర్యంగా ఇంటర్ ఎగ్జాం హాలు నుండి బయటకు వచ్చాను. కాని రిజల్ట్స్ ముందు రోజు మాత్రం ఎందుకో భయం వేసింది. అయితే ఫస్ట్ క్లాస్ లేకపోతే ఫెయిల్ అన్నట్టు అయ్యింది నా పరిస్థితి. అప్పట్లో ఇంటర్‌నెట్ లేదు కాబట్టి రిజల్ట్స్ న్యూస్ పేపర్లోనే ప్రింట్ అయ్యి వచ్చేవి. రత్నగర్భ, ఏలూరు టైంస్ లాంటి చిన్న స్థానిక పత్రికల్లో అయితే ముందు రోజు మధ్యాహ్నమే రిజల్ట్స్ వచ్చేవి. కాని నాకు కాకినాడలో ఎంత వెతికినా అలాంటి పత్రికలు దొరకలేదు. సాయంత్రం దాకా రెండు మూడు సార్లు వెతికి ఇంటికి వచ్చేసాను. ఇంటర్ రిజల్ట్ వచ్చేసి పాస్ అయిపోతే ఎంట్రన్స్ పరీక్షకి ప్రశాంతంగా చదువుకోవచ్చని నా ఆశ.
ఏదయినా ముఖ్యమయిన పరీక్షకి ముందు రోజు నైట్ అవుట్ చెయ్యడం నాకు అలవాటు. అలాగే 7 తేదీ రాత్రి భోజనం అయ్యాక ఎంసెట్‌కి చదవడం మొదలుపెట్టాను. ఒక పక్క మనసులో ఇంటర్ రిజల్ట్ భయం అలాగే ఉంది. కొన్ని చాప్టర్లు పూర్తి చేసి రాత్రి సైకిల్ వేసుకుని మళ్ళీ సెంటర్‌కి వెళ్ళి న్యూస్ పేపర్ వచ్చిందేమోనని చూసి వచ్చాను. కాని ఎక్కడా దొరకలేదు. రాత్రంతా అలా టెన్షన్ లోనే చదివాను. తెల్లవారాక బజారుకి వెళ్ళి పేపర్ కొని తెచ్చుకున్నాను. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యానని అందరూ అభినందించాక కొంత టన్షన్ తగ్గింది.
ఇక అప్పుడు తయారయ్యి ఎంసెట్ ఎగ్జాం సెంటర్‌కి వెళ్ళాను. ఎగ్జాం క్వచ్చన్ పేపర్ చూసాక మళ్ళీ టెన్షన్ ప్రారంభమయ్యింది. ఇది ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ కంటే టఫ్‌గా ఉంది. అయినా అప్పట్లో ఇంజనీరింగ్ సీట్లు చాలా తక్కువ కాబట్టి, మొదటి ప్రయత్నంలోనే సీటు వస్తుందని చాలా మందికి నమ్మకం ఉండేది కాదు. వీలైనంత బాగా వ్రాద్దాం, లేకపోతే తరువాతి సంవత్సరం మళ్ళీ వ్రాద్దామని ఫిక్స్ అయ్యి ఎగ్జాం పూర్తి చేసాను. ఆ సెంటర్లోనే నా ఇంటర్ క్లాస్‌మేట్స్ కూడ ఎగ్జాం వ్రాసారు. బయటకు వచ్చాక వాళ్ళు కూడ పేపర్ టఫ్‌గా ఉందని అన్నారు. ఎంట్రన్స్ ఎగ్జాం రెలటివ్ కాబట్టి సీట్ వచ్చినా రావచ్చని ఆశతో వచ్చేసాము.
అప్పటికే ఆ రోజు రెండు టెన్షన్లు పూర్తయ్యాయి. ఇకనుంచయినా కొన్ని రోజులు రిలాక్స్‌గా ఉండచ్చని అనుకున్నాను. కాని మూడో టెన్షన్ కూడా నాకోసం వేచి ఉందని ఊహించలేదు. ఎగ్జాం అయ్యాక స్నేహితులందరూ ఏదైనా సినిమాకి వెళ్దామని అన్నారు. నేను కూడ రిలాక్స్ అవుదామని సరేనన్నాను. అప్పుడు కొత్తగా వచ్చిన వంశీ సినిమా “అన్వేషణ” చూద్దామని అందరూ అనుకున్నాము. ఇళయరాజా పాటలు బాగున్నాయని తెలుసు కాని, రివ్యూలు అంతగా లేని రోజుల్లో కథ ఏమిటో ఎవరో చెప్తే కాని తెలిసేది కాదు. సినిమా టైటిల్స్‌తోనే సస్పెన్స్, టెన్షన్ మొదలయ్యాయి. వంశీ టేకింగ్‌తో బెదరగొడితే, ఇళయరాజా పాటలతో, బాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అదరగొట్టాడు. నాకు తెలిసి తెలుగులో అప్పట్లో అంత సస్పెన్స్ థ్రిల్లర్ రాలేదు. అప్పటికే రెండు టెన్షన్లు భరించి ఉన్నానేమో, సినిమా పూర్తయ్యే వరకు నాకు టెన్షన్ తగ్గలేదు. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే నాకు ఆ రోజు గుర్తుకువస్తుంది.