ఆర్థర్ కాటన్ – డొక్కా సీతమ్మ
కాటన్ దొర అని గోదావరి జిల్లాల ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 – జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. 1847 – 52 సంవత్సరాలలో గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించారు. అప్పటి వరకు క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది.
గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ (1841 – 1909). తూర్పు గోదావరి జిల్లా గన్నవరం వద్ద గోదావరి నదిపై నిర్మించిన అక్విడెక్టుకు ఈమె పేరున డొక్కా సీతమ్మ అక్విడెక్టు అని నామకరణం చేసారు.
గోదావరి జిల్లాల ప్రజలు ఈ ఇద్దరు మహానుభావులని ఎంతో అభిమానిస్తారు, గౌరవిస్తారు. చిత్రంగా వీరిద్దరూ ఇంచుమించు సమకాలీకులు. వీళ్ళు ఒకరినొకరు కలిసారో లేదో మనకు తెలియదు కాని, గోదావరి ప్రజలు వీళ్ళిద్దరికీ ఎప్పటికీ ఋణపడి ఉంటారు. వీళ్ళిద్దరి గురించి ఒక చోట వ్రాయడానికి కారణం ఏమిటంటే, నాకు ఇద్దరిలోను కొన్ని పోలికలు కనిపించాయి. ఇద్దరూ, తమ తమ పరిధిలో వీలైనంత మానవ సేవ చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయితే, ఒకరు గృహిణి. కాటన్ మిగతా ఉద్యోగుల మాదిరి పై అధికారి చెప్పిన పని మాత్రమే చేసి, జీతం తీసుకుని భార్యాబిడ్డలతో దర్జాగా జీవించవచ్చు. సీతమ్మ గారు కూడ ఒక సాధారణ మహిళలా నగలు, చీరలు కొనుక్కుని ఆనందంగా జీవించవచ్చు. కాని వాళ్ళిద్దరు కూడ అలా ఆలోచించలేదు. అందుకే మనం వాళ్ళని ఇప్పటికీ తలుచుకుంటున్నాము.
కాటన్ మన దేశీయుడు కాదు, ఉద్యోగరీత్యా మన దేశానికి వచ్చాడు. దేశభక్తి కంటే మానవ సేవే గొప్పదని భావించాడు. ఇక్కడ ఉన్న నీటి వనరులని సద్వియోగం చేస్తే, ప్రజల ఆకలి బాధలు తీరడమే కాకుండా ప్రభుత్వానికి కూడ ఆదాయం పెరుగుతుందని పై అధికారులని ఒప్పించి గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించాడు. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు, సౌకర్యాలు లేవు. అయినా నిర్మాణంలో ఎన్నో కష్టాలకి ఓర్చి, తను అనుకున్నది సాధించాడు. అపర భగీరథుడు అనిపించుకుని, కొన్ని కోట్లమందికి చిరస్మరణీయుడు ఆయ్యాడు. ఎన్నో భవిష్యత్ తరాలకు అన్నదాత అయ్యాడు. సీతమ్మ గారి వివాహం జరిగిన కొన్నేళ్ళకే, గోదావరి మీద ఆనకట్ట నిర్మాణం పూర్తి అయ్యింది కాబట్టి, బహుశా కాటన్ గారు కట్టిన ఆనకట్ట వలన జోగన్న గారి పొలాలు బాగా పండి సీతమ్మ గారు అంతగా అన్నదానం చెయ్యగలిగారేమో మనకు తెలియదు.
సీతమ్మ గారికి బాల్యంలోనే డొక్కా జోగన్న గారితో వివాహం జరిగింది. భర్త సహకారంతో ఇంటికి వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టి పంపించేది ఆమె. రవాణా సౌకర్యాలు, భోజన సౌకర్యాలు అంతగా లేని ఆ రోజుల్లో, ఆకలితో అలమటించే ప్రయాణికులకి ఒక్క పైసా తీసుకోకుండా అన్నదానం చేసి అన్నపూర్ణ అనిపించుకుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకి అన్నం పెట్టి, ఆర్థిక సాయం చేసి ఆదుకునేది ఆ మహాతల్లి.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక ప్రభుత్వాధికారిగా ప్రజలకు మంచి జరగడానికి, వాళ్ళ అభివృద్ధికి ఏది అవసరమో ఆ పని కాటన్ గారు చేసారు. ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కట్టడం వల్ల ఆ ప్రాంతం భవిష్యత్తు మారిపోతుంది. అదే ప్రభుత్వం చెయ్యవలసిన పని. అంతే కాని ఆ డబ్బుని ప్రజలకి పంచిపెడితే కొన్ని నెలలలోనే ఖర్చయిపోతుంది. ప్రజలకి బతకడం నేర్పాలి, బతకడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. అంతే కాని, కూర్చోబెట్టి అన్నీ సమకూరుస్తూ ఉంటే, వాళ్ళు సొంతంగా బతకడం మర్చిపోతారు. అయితే సంపాదించలేని స్థితిలో, వయసులో ఉన్నవాళ్ళకి సహాయం చెయ్యడం న్యాయమే.
డొక్కా సీతమ్మ గారు చేసింది అన్నదానం. అది కూడ బాటసారులకి, కష్టాల్లో ఉన్నవాళ్ళకి. ఆమె చేసింది తాత్కాలిక సాయమే, కాని ఆమె చాలామందికి చేసింది. సరిగ్గా ఇదే వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు చెయ్యవలసిన పని. ఇదే పని ప్రభుత్వం చేస్తే దళారులు ఎన్ని దారుణాలు చేస్తారో మనకు తెలుసు. అలాగే ఎంత ధనవంతులైనా, వ్యక్తులు ప్రాజెక్టులు కట్టలేరు, ప్రభుత్వమే కట్టాలి. కాని సామాన్యులు కూడ తమకు వీలైనంతలో, ఇబ్బందుల్లో ఉన్న సాటివారికి సహాయం చెయ్యగలరు. ఈ మధ్య వలస కార్మికులకి ఎంతోమంది పౌరులు, సేవా సంస్థలు సహాయం చెయ్యడం మనం చూసాము.
కాబట్టి కాటన్ గారి, సీతమ్మ గారి జీవితాల నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే, ప్రభుత్వం చెయ్యవలసిన పని ప్రభుత్వం చెయ్యాలి, ప్రజలు చెయ్యవలసిన పని ప్రజలు చెయ్యాలి. అప్పుడే ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటుంది. ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడి సంపన్నులవుతారు. దేశం అభివృద్ధి సాధిస్తుంది.
నిజం చెప్పారు.