విషయానికి వెళ్ళండి

‘బాలు’తా తీయగా చల్లగా…

27/09/2020

నాకు ఒక చిన్న ఫాంటసీ ఉండేది. అదేమిటంటే ఎలాగోలా బాలుగారి appointment సంపాదించి, ఆయనతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఒక రోజంతా గడిపి, ఆయన సరదాగా పాడుకునే పాటలు, కూని రాగాలు వింటూ ఆనందించాలి. ఆ అవకాశం రావడం కష్టమని తెలుసు కాని, బాలు గారి అకాల మరణంతో ఆ అవకాశం ఇక ఎప్పటికీ రాదు. నాకు ఊహ తెలిసి బాలు పాటలు విన్నది, “అడవి రాముడు” సినిమాలో. అప్పట్లో “కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహా పురుషులవుతారు” పాట, గొప్ప inspirational song. ఆ తరువాత “శంకరాభరణం” పాటలు దేశమంతా మార్మోగాయి. ఇక 80లలో ఎప్పుడూ రేడియోలో మూడొంతులు బాలు పాటలే వినిపించేవి. బాలు పాటలు వింటూ పెరిగిన తరం నాది. అప్పుడు బాలు అంటే పాట, పాట అంటే బాలు. కొత్త శతాబ్దంలో కొత్త గాయకులు వచ్చే వరకు, సినీ సంగీత సామ్రాజ్యాన్ని బాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు.

90లలో నేను గుజరాత్ లో పని చేస్తున్న సమయంలో ఒక మలయాళీ మిత్రుడు “శంకరాభరణం” పాటలు వింటుంటే, మీరు తెలుగు పాటలు వింటున్నారేమిటని అడిగాను. దానికి అతడు ఇవి తెలుగు పాటలు మాత్రమే కావు, భారతీయ సంగీతం అని చెప్పాడు. గత సంవత్సరం త్రివేండ్రం లో కాబ్ లో వెళుతున్నప్పుడు FMలో “శంకరాభరణం” పాటలు వింటుంటే సంగీతం అజరామరం అనిపించింది. ఆ అద్భుతమైన గానం చేసిన బాలు గారి గాత్రం కూడ అజరామరమే. బాలచందర్ భావగీతాలు, విశ్వనాథ్ శాస్త్రీయ సంగీతం, బాపు భక్తి గీతాలు, రాఘవేంద్రరావు మాస్ మసాలా పాటలు, ఇంకా విప్లవ సాహిత్యం ఇలా అన్ని రకాల పాటలు పాడగలడం కేవలం బాలు గారికి మాత్రమే సాధ్యమయింది. “ఓలమ్మీ తిక్క రేగిందా” నుంచి “ఓంకార నాదాను సంధానమౌ” వరకు, “అంతర్యామి” నుంచి “ఆ నలుగురు” వరకు, అల్లు రామలింగయ్య నుంచి అల్లు అర్జున్ వరకు అంతా ఆయన సంగీత ప్రపంచమే! మనల్ని నవ్వించి, ఏడిపించి, శాంతపరచి, ఉద్రేకపరచి, నవరసాలు తాను అనుభవించి పాడుతూ, మనకి కూడ ఆ అనుభూతులు కలిగేలా పరవశింప చేయడం బాలు గొప్పతనం.

అయితే అన్ని వేల పాటలు పాడడం వల్ల ఆయన గాత్రం రొటీన్ అయిపోయింది అని కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా చక్రవర్తి లాంటి సంగీత దర్శకులకి బాలు పాడిన అసంఖ్యాకమైన మాస్ మసాలా పాటలు బాలు గారికి డబ్బులు తెచ్చిపెట్టాయేమో కాని, ఆయన స్థాయి పెంచలేదు. అయినా చిరంజీవి లాంటి అప్పటి యువ హీరోలకి పాడిన పాటలు శ్రోతలకి మంచి హుషారు, వినోదం ఇచ్చాయి. ఘంటసాల, జేసుదాసు, బాలమురళీకృష్ణ లాంటి కొంతమంది గాయకుల గొంతులో ఒక ప్రత్యేకమైన జీర ఉంటుంది. అది వాళ్ళ గాత్రానికి గొప్ప ఆకర్షణ. కొన్ని పాటలు వాళ్ళు పాడితేనే బాగుంటాయి. కాని బాలు గొంతు special plain voice. అందుకే మన స్నేహితుడు మన పక్కనే కూర్చుని పాడుతున్నట్టు ఉంటుంది. అదే గొంతుతో అవసరం అయినప్పుడు మిమిక్రీలా చేసి ఎన్నో అజరామరమైన పాటలు పాడి లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నాడు.

“పాడుతా తీయగా” కార్యక్రమం అప్పట్లో ఒక అద్భుతం. ప్రతీ తెలుగింటి TVలో ఖచ్చితంగా చూసే ప్రోగ్రాం. ఇప్పుడు ఆనాటి వాసి తగ్గింది. ఎందరో యువ గాయనీ గాయకులకు భవిష్యత్తు ఇచ్చిన వేదిక. అందరికీ సినిమాల్లో అవకాశాలు రాకపోవచ్చు కాని, చాలా మంది ఫంక్షన్లలో పాడుతూ కూడ ఉపాధి పొందుతున్నారు. పాటల మధ్యలో బాలు గారు చెప్పే విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆ విషయంలో ఆయన జ్ఞాపక శక్తి అద్భుతః. ఇప్పుడు వచ్చే టివి ప్రోగ్రాములలో చాలా మంది యాంకర్లు అందులో పాల్గొనే వాళ్ళమీద జోకులు వెయ్యడం, చిన్న చూపు చూడడం, ఒకోసారి హేళన చెయ్యడం మామూలు అయిపోయింది. కాని బాలు గారు మాత్రం చిన్న పిల్లలకి కూడ గౌరవం ఇచ్చి మాట్లాడతారు. అప్పుడప్పుడు కొంతమందిని ఆట పట్టించినా, అది బాలుడి చిలిపితనమే కాని, అహంకారం కాదు. అది కూడా పరిధి దాటి ఉండదు. హిందీలో అమితాబ్ బచ్చన్ కూడ ఇలాగే హుందాగా కార్యక్రమం నిర్వహిస్తారు.

బాలు గాయకుడే కాకుండా సంగీత దర్శకుడు కూడ. ఎక్కువ సినిమాలు చెయ్యకపోయినా, “మయూరి”, “పడమటి సంధ్యారాగం” లాంటి కొన్ని మంచి సినిమాలకి చేసారు. అలాగే ఆయన చాలా సినిమాలలో నటించినా, “మిథునం” మాత్రం ఒక అద్భుతం. ఆ సినిమాపై నా టపా ఇక్కడ. నిజానికి శ్రీరమణ గారి కథ ప్రకారం, బాలు గారి ఆకారం, వాచకం ఆ పాత్రకి సరిపోవు. కాని సినిమా చూస్తే ఆ పాత్రని బాలు బాగా ఇష్టపడి చేసారని మనకి అనిపిస్తుంది. బాలు గారిలోని మరో మంచి గుణం, పాజిటివ్ దృక్పథం. ఆయన ఎంతో ఆశాజీవి. నెగెటివ్ గా ఎప్పుడూ మాట్లాడరు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం, దానిని సగౌరవంగా ప్రకటించుకోవడం, ఇంత సాధించిన తరువాత కూడ నా గురించి నేను చెప్పుకోకపోవడం న్యాయం కాదు అని అనగలగడం, ఆయన ఆత్మ విశ్వాసానికి చిహ్నం. ఇక బాలుడి బ్యాటింగ్ ముగిసింది. కరోనాతో హర్ట్ అయి, అకస్మాత్తుగా ప్రపంచం నుండి రిటైర్ అయ్యాడు. కాని ఆయన పాటలు మన మనసుల్లో ఎప్పటికీ పరుగులు పెడుతూనే ఉంటాయి.

9 వ్యాఖ్యలు leave one →
 1. Niharika permalink
  27/09/2020 14:14

  🙏🙏🙏

 2. విన్నకోట నరసింహారావు permalink
  27/09/2020 15:28

  // “ ఇక బాలుడి బ్యాటింగ్ ముగిసింది.” //

  ఒక శకం ముగిసింది. End of an era 🙏.

 3. కాంత్ permalink
  27/09/2020 23:05

  “ముఖ్యంగా చక్రవర్తి లాంటి సంగీత దర్శకులకి బాలు పాడిన అసంఖ్యాకమైన మాస్ మసాలా పాటలు బాలు గారికి డబ్బులు తెచ్చిపెట్టాయేమో కాని, ఆయన స్థాయి పెంచలేదు” – 100% కరెక్ట్.

  “ఘంటసాల, జేసుదాసు, బాలమురళీకృష్ణ లాంటి కొంతమంది గాయకుల గొంతులో ఒక ప్రత్యేకమైన జీర ఉంటుంది. అది వాళ్ళ గాత్రానికి గొప్ప ఆకర్షణ. కొన్ని పాటలు వాళ్ళు పాడితేనే బాగుంటాయి. కాని బాలు గొంతు special plain voice” – కరెక్ట్‌గా నా అభిప్రాయం కూడ ఇదే.

  బాలుగారి గురించి మంచి విషయాలు పంచుకున్నారు. ధన్యవాదాలు

 4. Niharika permalink
  28/09/2020 15:00

  ఒక సందేశం
  అరే బాలు గారిని దహనం చైయకుండా ఖననం చేసినరే అని..విచారించగా తెలిసిన విషయమేమిటంటే, ఇటీవల నెల్లూరులోతన పూర్వీకుల ఇంటిని వేదపాఠశాలగా మార్చడానికి,కంచిమఠానికి ఇచ్చేసిన సమయంలో బాలసుబ్రహ్మణ్యం గారు
  వాన ప్రస్థాశ్రమం స్వీకరించారట,అంటే గృహస్థుగా కొనసాగుతూ సన్యాసం స్వీకరించడం.అందువలననే ఆయనను దహనం చేయకుండా ఖననం చేశారట.
  దత్తు ✍🏻

 5. 28/09/2020 15:17

  మంచి అబ్జర్వేషన్స్ పంచుకున్నారు బోనగిరిగారు. నెనరులు.

 6. 28/09/2020 15:56

  ఆరాధ్య సంప్రదాయం ప్రకారం అన్నారు?

 7. విన్నకోట నరసింహారావు permalink
  28/09/2020 16:19

  నీహారిక గారు,
  ఎవరండీ ఈ సమాచారం ఇచ్చింది 🙂?
  తెలుగు బ్రాహ్మణులలో “లింగధారులు” అని ఒక ఉపశాఖ ఉంది. వారినే “ఆరాధ్యులు” అని కూడా అంటారు. ఆ శాఖలో ఖననమే ఆచారం కానీ దహనం ఉండదు. బాలు గారు ఆ శాఖకు చెందినవారు కాబట్టి వారి అంత్యక్రియలు ఆ విధంగా జరిగాయి.

  అన్నట్లు ప్రఖ్యాత చిత్రదర్శకుడు కె.విశ్వనాథ్ గారు, సినీనటుడు చంద్రమోహన్ కూడా ఆ శాఖ వారే.

 8. Niharika permalink
  28/09/2020 16:37

  విన్నకోట వారూ,
  దత్తు అట ఎవరో తెలియదు.ఫార్వాడెడ్ మెసేజ్. మీ ద్వారా అసలు విషయం తెలిసింది ధన్యవాదాలు.

 9. విన్నకోట నరసింహారావు permalink
  28/09/2020 18:33

  నీహారిక గారు,
  You are welcome.
  “లింగధారులు / ఆరాధ్యులు” నాకు బాగా పరిచయస్తులలో ఉన్నారు. కొంత మంది అంత్యక్రియలకు నేను హాజరయ్యాను. అందువల్ల నేను మీకు ఇచ్చిన వివరాలు పక్కా.

  ఈ శాఖ వారు శివభక్తులు. కొన్ని ప్రాంతాలలో వీరశైవులు అని కూడా అంటారు. చిన్న శివలింగాన్ని తమ శరీరంపై ధరించి ఉంటారు పెర్మనెంట్ గా.

  (ఆంధ్రాలో జంగాలు / జంగములు / జంగమయ్య / జంగం దేవర అని ఒక కులం వారున్నారు, తెలుసు కదా? వారు కూడా మహా శివభక్తులే. అయితే వారు బ్రాహ్మణులు కారు)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: