రైలు ఎక్కని సంవత్సరం
రైలు ప్రయాణం అంటే చిన్నప్పటినుండి అందరికీ సరదాయే. ప్రతీ ఏటా మనం కనీసం ఓ పది సార్లయినా రైలు ప్రయాణం చేస్తాము. ఉద్యోగరీత్యా ప్రయాణించేవాళ్ళు ఇంకా ఎక్కువ సార్లు రైలు ఎక్కవలసి ఉంటుంది. మన దేశంలో నూటికి తొంభయి మందికి ట్రైనే ముఖ్యమయిన ప్రయాణ సాధనం మరి!
అలాంటిది, గడిచిన 2020 సంవత్సరంలో నేను ఒక్క సారి కూడ రైలు ఎక్కలేదు. నాకు ఊహ తెలిసి గత నలభయి సంవత్సరాలలో నేను రైలు ఎక్కని సంవత్సరం ఇదే అయ్యుంటుంది. నేనే కాదు, చాలామంది భారతీయులు గత సంవత్సరం రైలు ఎక్కి ఉండరు. గత ఏడాది జనవరి ఒకటికి నేను విజయవాడలో ఉన్నాను. రెండు రోజుల తరువాత బెంగళూరు వచ్చాను. రైల్లో రిజర్వేషన్ దొరకకపోవడంవల్ల విమానంలో రావాల్సివచ్చింది. తరువాత ఫిబ్రవరిలో ఆఫీసు పని మీద గోవాకి విమానంలోనే వెళ్ళి వచ్చాను. ఇక ఆ తరువాత మార్చి నుండి ఎక్కడికీ వెళ్ళలేదు.
మార్చి నెల నుండి దేశంలో కరోనావైరస్ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. మానవజాతి మనుగడకే కామా పెట్టింది కరోనావైరస్. గత మార్చి నెలాఖరు నుండి దేశంలో రైళ్ళు ఆగిపోయాయి. బహుశా భారతీయ రైల్వే చరిత్రలో ఇలా ఎప్పుడూ జరిగి ఉండదు. తరువాత దశలవారీగా రైళ్ళని పునరుద్ధరించినా ప్రయాణికులు రైళ్ళు ఎక్కడానికి భయపడుతూనే ఉన్నారు. కొంత మంది ప్రజలు కూడ ప్రభుత్వం చెపుతున్న నియమ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రయాణిస్తున్నారు. ఆ నిర్లక్ష్యం వలన ఇతరులకే కాకుండా, వాళ్ళకు కూడ ప్రమాదమే అని గుర్తించడంలేదు.
నేను వీలైనంతవరకూ 2020 సంవత్సరం ముగిసే వరకూ ఎక్కడికీ ప్రయాణించకూడదనే అనుకున్నాను. కాని డిసెంబరులో హఠాత్తుగా రెండు సార్లు ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. భయపడుతూనే, వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, తక్కువ సమయం పడుతుందని విమానంలోనే ప్రయాణం చేసాను. రైల్లో అయితే 12 గంటలు పైగా పట్టే ప్రయాణం, విమానంలో గంటలో అయిపోతుంది కదా!
ఇప్పుడు 2021 వచ్చింది. అయినా ఇంకా రైల్లో వెళ్ళాలంటే భయంగానే ఉంది. ఈ నెలలో కూడ ఒక సారి విమానంలోనే ప్రయాణం చేసాను. ఇప్పుడు కరోనా కేసులు బాగా తగ్గాయి. అలాగే వైరస్‌కి టీకాలు వెయ్యటం కూడ మొదలయ్యింది కాబట్టి, బహుశా కొన్ని నెలల తరువాత రైల్లో ప్రయాణించడానికి భయపడాల్సిన అవసరం ఉండదనుకుంటున్నాను. ఏమైనా 2020 ఎన్నో వింతలు, విశేషాలతో పాటు చాలామంది రైలు ఎక్కని సంవత్సరంగా కూడ రికార్డు సృష్టించింది.