రత్నాలు, పద్మాలు
గత నెలలో రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం చాలా మంది ప్రముఖులకి పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులోనే తెలుగువాడైన స్వర్గీయ బాలసుబ్రమణ్యం గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. ఆయనకు తమిళనాడు రాష్ట్రం తరపు నుండి ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మరో ముగ్గురికి పద్మశ్రీ ఇచ్చారు. వారు ఎవరంటే అన్నవరపు రామస్వామి, ఆశావాది ప్రకాశరావు మరియు నిడుమోలు సుమతి గార్లు. తెలంగాణా రాష్ట్రం నుండి కనకరాజు గారికి కూడ పద్మశ్రీ ఇచ్చారు. ఈ సారి భారతరత్న ఎవరికీ ఇవ్వలేదు. ఈ అవార్డుల గురించి మరింత సమాచారం కావాలంటే https://padmaawards.gov.in/ వెబ్ సైట్ చూడవచ్చును.
అయితే మన దేశంలో అన్నిచోట్లా రాజకీయాలు ఉన్నట్లే ఈ అవార్డుల్లో కూడా రాజకీయాలు చోటుచేసుకున్నాయని చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీల అస్మదీయులకు ఈ పురస్కారాలు త్వరగా ఇస్తారన్న అభిప్రాయం కూడ ఉంది. ఈ అవార్డుల కోసం కొంత మంది పైరవీలు చేస్తారని కూడ అంటారు. ఈ అవార్డులకున్న క్రేజ్ అలాంటిది.
అయితే ఈ పురస్కారాలు అందుకున్నవారు అందుకు తగ్గ హుందాగా ప్రవర్తించకపోవడం సరికాదని నా అభిప్రాయం. ఉదాహరణకి దేశ అత్యున్నత గౌరవం, భారతరత్న అందుకున్న సచిన్ టెందూల్కర్ విషయం తీసుకోండి. ఆయన ఇప్పటికీ మీడియాలో అనేక వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తున్నాడు. నాకు తెలిసి గతంలో భారతరత్న అందుకున్నవారెవరూ వ్యాపార ప్రకటనలలో కనిపించలేదు. కేవలం సమాజానికి ఉపయోగపడే, సదవగాహన కలిగించే ప్రభుత్వ ప్రకటనలలోనే కనిపించారు. సచిన్ అద్భుతమైన క్రీడాకారుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. కాని ఒక గొప్ప స్థాయికి చేరుకున్న తరువాత ఆ స్థాయికి తగ్గట్టుగానే నడుచుకుంటే బాగుంటుంది. ఈ క్రింది చిత్రం చూడండి.

Paytm FIRST GAMES కి సచిన్ బ్రాండ్ అంబాసిడర్. అందులో క్రికెట్, ఫుట్ బాల్ లాంటి ఫాంటసీ ఆటలతో పాటు, రమ్మీ, హార్స్ రేసింగ్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ బెట్టింగ్ గేమ్స్. ఇప్పుడు ప్రతీవాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. సాధారణ ప్రజలు ఇలాంటి ఆటలకి అలవాటు పడితే, బోలెడన్ని డబ్బులు పోగొట్టుకుంటారు. వీటికి కొన్ని రాష్ట్రాలలో అనుమతి కూడ లేదు. మామూలు ప్రకటనలలో నటించడమే కాకుండా, ఇలాంటి ఆటలని కూడ ప్రోత్సహించడం భారతరత్న సచిన్ కి తగునా? అలాగే గంగూలీ, ధోనీ మొదలైన క్రికెటర్లు కూడ ఇటువంటి ఫాంటసీ క్రీడల యాప్స్‌కి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు కూడ పద్మ అవార్డులు తీసుకున్నవాళ్ళే.
ఇక ప్రముఖ హిందీ హీరో అజయ్ దేవగన్ సంగతి చూడండి. ఈయన మరో అడుగు ముందుకు వేసి పాన్ మసాలా ప్రకటనలో కూడ కనిపిస్తాడు. ఈయనకి కూడ ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం పాడు చేసే పాన్ మసాలాని ప్రోత్సహించే ఈయనకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం సమంజసమా?

ఇంక మిగతా వాళ్ళ సంగతి చూస్తే అమితాబ్ నుండి చిరంజీవి వరకు మన దేశంలోని సూపర్ స్టార్లు అందరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసినవాళ్ళే. అదే కాక ఇంకా అనేక రకాల విలాస వస్తువుల ప్రకటనలలో నటించినవాళ్ళే. వీళ్ళలో చాలామంది పద్మ పురస్కారాలు అందుకున్నవాళ్ళే.
నా అభిప్రాయం ఏమిటంటే ఈ పురస్కారాలు అందుకున్నవాళ్ళెవ్వరూ ఇక ముందు ఎటువంటి వాణిజ్య ప్రకటనలలోనూ నటించకూడదని నియమం పెట్టాలి. అప్పుడే ఈ అవార్డులకున్న విలువ పెరుగుతుంది. అప్పుడే సెలబ్రిటీలు, లిజండరీలు ఈ అవార్డుల కోసం వెంపర్లాడడం కూడ తగ్గుతుంది. ముందుగా కనీసం భారతరత్న విషయంలోనైనా ఈ నిబంధన పెడితే బాగుంటుంది.
ఉత్తమ పురస్కారాలు అందుకున్న వారు చాలా బాధ్యత కలిగి ఉండాలి. రిటైర్ అయిన కెరీర్ కాబట్టి నాలుగు రాళ్ళు వెనకేసుకునేందుకు వాణిజ్య ప్రకటనలు చేయచ్చేమో అని ఒక పక్కన అనిపిస్తున్నా, వేటిని ఎంచుకొన్నారో చూస్తుంటే తప్పు అనిపిస్తుంది.
ఇకపైన అయినా సామాజిక స్పృహతో బ్రాండ్స్ ని ఎంచుకుంటే మంచిది.
// “సామాజిక స్పృహతో బ్రాండ్స్ ని ఎంచుకుంటే మంచిది.“ //
అంత ఇంగితం కూడానా? డబ్బు సంపాదనే తప్ప విలువలు ఎవరికి కావాలండీ?
————————
అయినా మీకు సచినుడి ఉదాహరణే దొరికిందా, బోనగిరి గారూ? అతనికి భారతరత్నా దండగే, ఎంపీ పదవీ దండగే నా అభిప్రాయంలో. మంచి క్రికెట్ ఆటగాడు అయితే అయ్యుండచ్చు గానీ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి లాగా మాత్రం అనిపించడు. తన స్వగృహానికి ముంబయి మ్యునిసిపల్ కార్పొరేషన్ వారి క్లియరెన్స్ విషయంలో ఇబ్బందులు పడ్డాడు. చివరకు లక్షల్లో పెనాల్టీ కట్టి క్లియరెన్స్ తెచ్చుకున్నాడు లెండి.
https://www.hindustantimes.com/mumbai/sachin-pays-penalty-for-house-clearance/story-sRRNApm5RPfSEfwNXYXgDN.html
————————
అందరకందరే, ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నా కూడా. క్రికెట్ ఆటగాళ్ళు విరాట్ కొహ్లీ, సౌరవ్ గంగూలీ ఏమీ తీసిపోయింది లేదు. వాళ్ళిద్దరకు, సినీ హీరోయిన్ తమన్నాకు, నటుడు ప్రకాష్ రాజ్ కు, “ఈగ” సుదీప్ కు వగైరాలకు
కోర్ట్ సమన్లు వెళ్ళాయిట. ఎందుకు అంటే ఆన్-లైన్ రమ్మీ పేకాటకు అడ్వర్చైజ్మెంట్ చేశారట ఈ “గొప్ప” వాళ్ళు. చూ”షా”రా మరి వారి వ్యక్తిత్వాలు ?
https://www.thestatesman.com/india/summons-issued-sourav-ganguly-kohli-endorsing-online-gambling-platforms-1502933518.html
—————————
పైగా ఇటువంటి వాళ్ళ పేర్లు వింటేనే సెలెబ్రిటీ అంటూ జనాలకు మైకం. మీరన్నట్లు సెలెబ్రిటీలకు ఉండవల్సిన హుందాతనం ఎక్కడ? దండిగా డబ్బులిస్తే చాలు, దేనికైనా పబ్లిసిటీ ఇస్తాం అనే రకాలేమో అనిపిస్తుంది.
—————————
ఏతావాతా చెప్పేదేమిటంటే ఇటువంటి జనాలకు “పద్మ” పురస్కారాలు, ఎంపీ పదవులు కట్టబెడితే అపాత్రదానం అవుతుందని నా అభిప్రాయం కూడా.
“పద్మభూషణ్” చందా కొచ్చర్ గారికి వీడియోకాన్ కేసులో ఈ రోజు బెయిల్ వచ్చిందట..
ఆశ్చర్యమేమీ లేదండి, “పద్మభూషణు”రాలు కదా. అయినా ఏదో ఓ బ్యాంకుకు ఎమ్.డి. గా పని చేసిన వ్యక్తికి కూడా “పద్మ” పురస్కారాలా?
అసలు ఏదో వ్యాపారంలోనో, ఆటల్లోనో, సినిమాల్లోనో రాణించినంత మాత్రాన ఈ అవార్డులకు అర్హతగా భావించడం కాకుండా సమాజశ్రేయస్సుకై చేసిన కృషిని పరిగణనలోకి తీసుకోవాలంటాను. అలాగే దేశరక్షణ కోసం పాటు పడిన వారికి కూడా అధికంగా ఈ గుర్తింపు దక్కాలి. అప్పుడే ఆ అవార్డులకు ఒక అర్థం పర్థం ఉంటుంది.
ముంబయి: ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ పాన్ మసాలా బ్రాండ్ యాడ్ నుంచి తప్పుకొన్నట్లు వెల్లడించారు. యాడ్ చేయడానికి తీసుకున్న మొత్తం సొమ్మును కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు. పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్లతో తనకు ఇక ఎలాంటి సంబంధం లేదన్నారు. పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్ సరోగేట్ అడ్వర్టైజింగ్(నిషేధిత వస్తువుల ప్రచారం) కిందకు వస్తుందనే విషయం తనకు తెలియదన్నారు. ఆ విషయం గురించి తెలుసుకున్నాక ఆ యాడ్ నుంచి వైదొలిగినట్లు వివరించారు.
పాన్ మసాలా యాడ్‌ల నుంచి తప్పుకోవాలని జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ (NOTE) గత నెలలోనే అమితాబ్ బచ్చన్‌కు లేఖ రాసింది. సమాజంలో ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి ప్రకటనలు చేయరాదని.. వెంటనే సదరు కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది. పాన్ మసాలా వాడటం వల్ల క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ఇటువంటి ప్రకటనల నుంచి బిగ్ బీ వైదొలగి పొగాకు వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శేఖర్ సల్కర్ కోరారు. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాన్ మసాలా యాడ్‌లో నటించినందుకు అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేయడంతో బిగ్ బీ ఈ ప్రకటన నుంచి వైదొలిగారు.
అమితాబ్ బచ్చన్ చెప్పేది నమ్మశక్యంగా లేదు. ఒక ఉత్పత్తికి ప్రచారం చేసేముందు ఆ ఉత్పత్తి గురించి వివరాలు తెలుసుకోరా ఆయన? అది సమాజంలో ఏఏ తరగతి జనులకోసమో, అది ఏపదార్ధాలతో తయరైనదో ఏవిధంగా ఎవరికీ హానికరంకాదో వంటి సంగతులు నిర్ధారించుకోకుండా ప్రచారం చేయటానికి ఆయన ఒప్పకున్నారనీ అమాయకులనీ మనం నమ్మాలా? ఆయనమీ ఇరవైల్లో పిల్లవాడు కాదే ఎనభైలలోని దీర్ఘప్రపంచానుభవం కల వృధ్ధుడే కాని. నాటకాలు వద్దనండి.
“కన్యాశుల్కం” నాటకంలో రామప్ప పంతులు మధురవాణి తో “ఆ … గుంటడి వెకాస్యాలు నిజమనుకుంటావేమిటి?” అంటాడు చూశారా. ఈ సోకాల్డ్ సెలెబ్రిటీల మాటల విషయంలో కూడా అదే గుర్తు పెట్టుకోవడం ఉత్తమం.