విషయానికి వెళ్ళండి

రైలు ఎక్కని సంవత్సరం

22/01/2021

రైలు ప్రయాణం అంటే చిన్నప్పటినుండి అందరికీ సరదాయే. ప్రతీ ఏటా మనం కనీసం ఓ పది సార్లయినా రైలు ప్రయాణం చేస్తాము. ఉద్యోగరీత్యా ప్రయాణించేవాళ్ళు ఇంకా ఎక్కువ సార్లు రైలు ఎక్కవలసి ఉంటుంది. మన దేశంలో నూటికి తొంభయి మందికి ట్రైనే ముఖ్యమయిన ప్రయాణ సాధనం మరి!

అలాంటిది, గడిచిన 2020 సంవత్సరంలో నేను ఒక్క సారి కూడ రైలు ఎక్కలేదు. నాకు ఊహ తెలిసి గత నలభయి సంవత్సరాలలో నేను రైలు ఎక్కని సంవత్సరం ఇదే అయ్యుంటుంది. నేనే కాదు, చాలామంది భారతీయులు గత సంవత్సరం రైలు ఎక్కి ఉండరు. గత ఏడాది జనవరి ఒకటికి నేను విజయవాడలో ఉన్నాను. రెండు రోజుల తరువాత బెంగళూరు వచ్చాను. రైల్లో రిజర్వేషన్ దొరకకపోవడంవల్ల విమానంలో రావాల్సివచ్చింది. తరువాత ఫిబ్రవరిలో ఆఫీసు పని మీద గోవాకి విమానంలోనే వెళ్ళి వచ్చాను. ఇక ఆ తరువాత మార్చి నుండి ఎక్కడికీ వెళ్ళలేదు.     

మార్చి నెల నుండి దేశంలో కరోనావైరస్ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. మానవజాతి మనుగడకే కామా పెట్టింది కరోనావైరస్. గత మార్చి నెలాఖరు నుండి దేశంలో రైళ్ళు ఆగిపోయాయి. బహుశా భారతీయ రైల్వే చరిత్రలో ఇలా ఎప్పుడూ జరిగి ఉండదు. తరువాత దశలవారీగా రైళ్ళని పునరుద్ధరించినా ప్రయాణికులు రైళ్ళు ఎక్కడానికి భయపడుతూనే ఉన్నారు. కొంత మంది ప్రజలు కూడ ప్రభుత్వం చెపుతున్న నియమ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రయాణిస్తున్నారు. ఆ నిర్లక్ష్యం వలన ఇతరులకే కాకుండా, వాళ్ళకు కూడ ప్రమాదమే అని గుర్తించడంలేదు.

నేను వీలైనంతవరకూ 2020 సంవత్సరం ముగిసే వరకూ ఎక్కడికీ ప్రయాణించకూడదనే అనుకున్నాను. కాని డిసెంబరులో హఠాత్తుగా రెండు సార్లు ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. భయపడుతూనే, వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, తక్కువ సమయం పడుతుందని విమానంలోనే ప్రయాణం చేసాను. రైల్లో అయితే 12 గంటలు పైగా పట్టే ప్రయాణం, విమానంలో గంటలో అయిపోతుంది కదా!

ఇప్పుడు 2021 వచ్చింది. అయినా ఇంకా రైల్లో వెళ్ళాలంటే భయంగానే ఉంది. ఈ నెలలో కూడ ఒక సారి విమానంలోనే ప్రయాణం చేసాను. ఇప్పుడు కరోనా కేసులు బాగా తగ్గాయి. అలాగే వైరస్‌కి టీకాలు వెయ్యటం కూడ మొదలయ్యింది కాబట్టి, బహుశా కొన్ని నెలల తరువాత రైల్లో ప్రయాణించడానికి భయపడాల్సిన అవసరం ఉండదనుకుంటున్నాను. ఏమైనా 2020 ఎన్నో వింతలు, విశేషాలతో పాటు చాలామంది రైలు ఎక్కని సంవత్సరంగా కూడ రికార్డు సృష్టించింది.

‘బాలు’తా తీయగా చల్లగా…

27/09/2020

నాకు ఒక చిన్న ఫాంటసీ ఉండేది. అదేమిటంటే ఎలాగోలా బాలుగారి appointment సంపాదించి, ఆయనతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఒక రోజంతా గడిపి, ఆయన సరదాగా పాడుకునే పాటలు, కూని రాగాలు వింటూ ఆనందించాలి. ఆ అవకాశం రావడం కష్టమని తెలుసు కాని, బాలు గారి అకాల మరణంతో ఆ అవకాశం ఇక ఎప్పటికీ రాదు. నాకు ఊహ తెలిసి బాలు పాటలు విన్నది, “అడవి రాముడు” సినిమాలో. అప్పట్లో “కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహా పురుషులవుతారు” పాట, గొప్ప inspirational song. ఆ తరువాత “శంకరాభరణం” పాటలు దేశమంతా మార్మోగాయి. ఇక 80లలో ఎప్పుడూ రేడియోలో మూడొంతులు బాలు పాటలే వినిపించేవి. బాలు పాటలు వింటూ పెరిగిన తరం నాది. అప్పుడు బాలు అంటే పాట, పాట అంటే బాలు. కొత్త శతాబ్దంలో కొత్త గాయకులు వచ్చే వరకు, సినీ సంగీత సామ్రాజ్యాన్ని బాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు.

90లలో నేను గుజరాత్ లో పని చేస్తున్న సమయంలో ఒక మలయాళీ మిత్రుడు “శంకరాభరణం” పాటలు వింటుంటే, మీరు తెలుగు పాటలు వింటున్నారేమిటని అడిగాను. దానికి అతడు ఇవి తెలుగు పాటలు మాత్రమే కావు, భారతీయ సంగీతం అని చెప్పాడు. గత సంవత్సరం త్రివేండ్రం లో కాబ్ లో వెళుతున్నప్పుడు FMలో “శంకరాభరణం” పాటలు వింటుంటే సంగీతం అజరామరం అనిపించింది. ఆ అద్భుతమైన గానం చేసిన బాలు గారి గాత్రం కూడ అజరామరమే. బాలచందర్ భావగీతాలు, విశ్వనాథ్ శాస్త్రీయ సంగీతం, బాపు భక్తి గీతాలు, రాఘవేంద్రరావు మాస్ మసాలా పాటలు, ఇంకా విప్లవ సాహిత్యం ఇలా అన్ని రకాల పాటలు పాడగలడం కేవలం బాలు గారికి మాత్రమే సాధ్యమయింది. “ఓలమ్మీ తిక్క రేగిందా” నుంచి “ఓంకార నాదాను సంధానమౌ” వరకు, “అంతర్యామి” నుంచి “ఆ నలుగురు” వరకు, అల్లు రామలింగయ్య నుంచి అల్లు అర్జున్ వరకు అంతా ఆయన సంగీత ప్రపంచమే! మనల్ని నవ్వించి, ఏడిపించి, శాంతపరచి, ఉద్రేకపరచి, నవరసాలు తాను అనుభవించి పాడుతూ, మనకి కూడ ఆ అనుభూతులు కలిగేలా పరవశింప చేయడం బాలు గొప్పతనం.

అయితే అన్ని వేల పాటలు పాడడం వల్ల ఆయన గాత్రం రొటీన్ అయిపోయింది అని కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా చక్రవర్తి లాంటి సంగీత దర్శకులకి బాలు పాడిన అసంఖ్యాకమైన మాస్ మసాలా పాటలు బాలు గారికి డబ్బులు తెచ్చిపెట్టాయేమో కాని, ఆయన స్థాయి పెంచలేదు. అయినా చిరంజీవి లాంటి అప్పటి యువ హీరోలకి పాడిన పాటలు శ్రోతలకి మంచి హుషారు, వినోదం ఇచ్చాయి. ఘంటసాల, జేసుదాసు, బాలమురళీకృష్ణ లాంటి కొంతమంది గాయకుల గొంతులో ఒక ప్రత్యేకమైన జీర ఉంటుంది. అది వాళ్ళ గాత్రానికి గొప్ప ఆకర్షణ. కొన్ని పాటలు వాళ్ళు పాడితేనే బాగుంటాయి. కాని బాలు గొంతు special plain voice. అందుకే మన స్నేహితుడు మన పక్కనే కూర్చుని పాడుతున్నట్టు ఉంటుంది. అదే గొంతుతో అవసరం అయినప్పుడు మిమిక్రీలా చేసి ఎన్నో అజరామరమైన పాటలు పాడి లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నాడు.

“పాడుతా తీయగా” కార్యక్రమం అప్పట్లో ఒక అద్భుతం. ప్రతీ తెలుగింటి TVలో ఖచ్చితంగా చూసే ప్రోగ్రాం. ఇప్పుడు ఆనాటి వాసి తగ్గింది. ఎందరో యువ గాయనీ గాయకులకు భవిష్యత్తు ఇచ్చిన వేదిక. అందరికీ సినిమాల్లో అవకాశాలు రాకపోవచ్చు కాని, చాలా మంది ఫంక్షన్లలో పాడుతూ కూడ ఉపాధి పొందుతున్నారు. పాటల మధ్యలో బాలు గారు చెప్పే విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆ విషయంలో ఆయన జ్ఞాపక శక్తి అద్భుతః. ఇప్పుడు వచ్చే టివి ప్రోగ్రాములలో చాలా మంది యాంకర్లు అందులో పాల్గొనే వాళ్ళమీద జోకులు వెయ్యడం, చిన్న చూపు చూడడం, ఒకోసారి హేళన చెయ్యడం మామూలు అయిపోయింది. కాని బాలు గారు మాత్రం చిన్న పిల్లలకి కూడ గౌరవం ఇచ్చి మాట్లాడతారు. అప్పుడప్పుడు కొంతమందిని ఆట పట్టించినా, అది బాలుడి చిలిపితనమే కాని, అహంకారం కాదు. అది కూడా పరిధి దాటి ఉండదు. హిందీలో అమితాబ్ బచ్చన్ కూడ ఇలాగే హుందాగా కార్యక్రమం నిర్వహిస్తారు.

బాలు గాయకుడే కాకుండా సంగీత దర్శకుడు కూడ. ఎక్కువ సినిమాలు చెయ్యకపోయినా, “మయూరి”, “పడమటి సంధ్యారాగం” లాంటి కొన్ని మంచి సినిమాలకి చేసారు. అలాగే ఆయన చాలా సినిమాలలో నటించినా, “మిథునం” మాత్రం ఒక అద్భుతం. ఆ సినిమాపై నా టపా ఇక్కడ. నిజానికి శ్రీరమణ గారి కథ ప్రకారం, బాలు గారి ఆకారం, వాచకం ఆ పాత్రకి సరిపోవు. కాని సినిమా చూస్తే ఆ పాత్రని బాలు బాగా ఇష్టపడి చేసారని మనకి అనిపిస్తుంది. బాలు గారిలోని మరో మంచి గుణం, పాజిటివ్ దృక్పథం. ఆయన ఎంతో ఆశాజీవి. నెగెటివ్ గా ఎప్పుడూ మాట్లాడరు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం, దానిని సగౌరవంగా ప్రకటించుకోవడం, ఇంత సాధించిన తరువాత కూడ నా గురించి నేను చెప్పుకోకపోవడం న్యాయం కాదు అని అనగలగడం, ఆయన ఆత్మ విశ్వాసానికి చిహ్నం. ఇక బాలుడి బ్యాటింగ్ ముగిసింది. కరోనాతో హర్ట్ అయి, అకస్మాత్తుగా ప్రపంచం నుండి రిటైర్ అయ్యాడు. కాని ఆయన పాటలు మన మనసుల్లో ఎప్పటికీ పరుగులు పెడుతూనే ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు.

23/08/2020

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలని 25 జిల్లాలకు పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిని ప్రామాణికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి పరిధి వలన ప్రజల సామాజిక అవసరాలు తీరడంలో ఇబ్బందులు వస్తాయి. పార్లమెంట్ నియోజకవర్గాలకి, స్థానిక పరిపాలనకి పెద్దగా సంబంధం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో తమకుండే పనులకి ప్రజలు తరచుగా జిల్లా ముఖ్యపట్టణం వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల ముఖ్య పట్టణాలు జిల్లాకి మధ్యలో లేవు. స్థానిక పరిపాలన అంతా రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రాతిపదికన నడుస్తోంది కాబట్టి, కొత్త జిల్లాలు కూడ వీటి ప్రాతిపదికనే ఏర్పాటు చెయ్యడం ప్రభుత్వానికి, ప్రజలకీ సౌకర్యంగా ఉంటుంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పరిధి మారవచ్చు, కొన్ని నియోజకవర్గాలు ఉండకపోవచ్చు. అంతే కాకుండా ఒకో జిల్లాకి, ఒకో MP సామంత రాజుగా వ్యవహరించే ప్రమాదం కూడ ఉంది.

రాష్ట్రంలో 50 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి కాబట్టి జనాభా, వైశాల్యం లాంటి వివరాల ఆధారంగా, రెండు లేదా మూడు డివిజన్లతో ఒకో జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. విశాఖపట్నం, విజయవాడ లాంటి ముఖ్య నగరాలని ఒకో డివిజనుతో ఏర్పాటు చెయ్యవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి అవడానికి, భూ సేకరణకి, తరువాత నిర్వహణకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చెయ్యాలి. అలాగే ప్రకృతి అందాల కోనసీమని పర్యాటకంగా అభివృద్ధి చెయ్యడానికి అమలాపురం డివిజనుని కోనసీమ జిల్లా చెయ్యాలి. నాకు ఉన్న విషయ వనరులు, ఆలోచనలని బట్టి ఈ క్రింది విధంగా జిల్లాలు పునర్విభజించవచ్చని అనుకుంటున్నాను. ప్రభుత్వం తన అవసరాలకి అనుగుణంగా కావలసిన మార్పులు, చేర్పులు ఎలాగూ చేసుకోవచ్చు.