రత్నాలు, పద్మాలు
గత నెలలో రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం చాలా మంది ప్రముఖులకి పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులోనే తెలుగువాడైన స్వర్గీయ బాలసుబ్రమణ్యం గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. ఆయనకు తమిళనాడు రాష్ట్రం తరపు నుండి ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మరో ముగ్గురికి పద్మశ్రీ ఇచ్చారు. వారు ఎవరంటే అన్నవరపు రామస్వామి, ఆశావాది ప్రకాశరావు మరియు నిడుమోలు సుమతి గార్లు. తెలంగాణా రాష్ట్రం నుండి కనకరాజు గారికి కూడ పద్మశ్రీ ఇచ్చారు. ఈ సారి భారతరత్న ఎవరికీ ఇవ్వలేదు. ఈ అవార్డుల గురించి మరింత సమాచారం కావాలంటే https://padmaawards.gov.in/ వెబ్ సైట్ చూడవచ్చును.
అయితే మన దేశంలో అన్నిచోట్లా రాజకీయాలు ఉన్నట్లే ఈ అవార్డుల్లో కూడా రాజకీయాలు చోటుచేసుకున్నాయని చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీల అస్మదీయులకు ఈ పురస్కారాలు త్వరగా ఇస్తారన్న అభిప్రాయం కూడ ఉంది. ఈ అవార్డుల కోసం కొంత మంది పైరవీలు చేస్తారని కూడ అంటారు. ఈ అవార్డులకున్న క్రేజ్ అలాంటిది.
అయితే ఈ పురస్కారాలు అందుకున్నవారు అందుకు తగ్గ హుందాగా ప్రవర్తించకపోవడం సరికాదని నా అభిప్రాయం. ఉదాహరణకి దేశ అత్యున్నత గౌరవం, భారతరత్న అందుకున్న సచిన్ టెందూల్కర్ విషయం తీసుకోండి. ఆయన ఇప్పటికీ మీడియాలో అనేక వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తున్నాడు. నాకు తెలిసి గతంలో భారతరత్న అందుకున్నవారెవరూ వ్యాపార ప్రకటనలలో కనిపించలేదు. కేవలం సమాజానికి ఉపయోగపడే, సదవగాహన కలిగించే ప్రభుత్వ ప్రకటనలలోనే కనిపించారు. సచిన్ అద్భుతమైన క్రీడాకారుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. కాని ఒక గొప్ప స్థాయికి చేరుకున్న తరువాత ఆ స్థాయికి తగ్గట్టుగానే నడుచుకుంటే బాగుంటుంది. ఈ క్రింది చిత్రం చూడండి.

Paytm FIRST GAMES కి సచిన్ బ్రాండ్ అంబాసిడర్. అందులో క్రికెట్, ఫుట్ బాల్ లాంటి ఫాంటసీ ఆటలతో పాటు, రమ్మీ, హార్స్ రేసింగ్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ బెట్టింగ్ గేమ్స్. ఇప్పుడు ప్రతీవాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. సాధారణ ప్రజలు ఇలాంటి ఆటలకి అలవాటు పడితే, బోలెడన్ని డబ్బులు పోగొట్టుకుంటారు. వీటికి కొన్ని రాష్ట్రాలలో అనుమతి కూడ లేదు. మామూలు ప్రకటనలలో నటించడమే కాకుండా, ఇలాంటి ఆటలని కూడ ప్రోత్సహించడం భారతరత్న సచిన్ కి తగునా? అలాగే గంగూలీ, ధోనీ మొదలైన క్రికెటర్లు కూడ ఇటువంటి ఫాంటసీ క్రీడల యాప్స్కి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు కూడ పద్మ అవార్డులు తీసుకున్నవాళ్ళే.
ఇక ప్రముఖ హిందీ హీరో అజయ్ దేవగన్ సంగతి చూడండి. ఈయన మరో అడుగు ముందుకు వేసి పాన్ మసాలా ప్రకటనలో కూడ కనిపిస్తాడు. ఈయనకి కూడ ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం పాడు చేసే పాన్ మసాలాని ప్రోత్సహించే ఈయనకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం సమంజసమా?

ఇంక మిగతా వాళ్ళ సంగతి చూస్తే అమితాబ్ నుండి చిరంజీవి వరకు మన దేశంలోని సూపర్ స్టార్లు అందరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసినవాళ్ళే. అదే కాక ఇంకా అనేక రకాల విలాస వస్తువుల ప్రకటనలలో నటించినవాళ్ళే. వీళ్ళలో చాలామంది పద్మ పురస్కారాలు అందుకున్నవాళ్ళే.
నా అభిప్రాయం ఏమిటంటే ఈ పురస్కారాలు అందుకున్నవాళ్ళెవ్వరూ ఇక ముందు ఎటువంటి వాణిజ్య ప్రకటనలలోనూ నటించకూడదని నియమం పెట్టాలి. అప్పుడే ఈ అవార్డులకున్న విలువ పెరుగుతుంది. అప్పుడే సెలబ్రిటీలు, లిజండరీలు ఈ అవార్డుల కోసం వెంపర్లాడడం కూడ తగ్గుతుంది. ముందుగా కనీసం భారతరత్న విషయంలోనైనా ఈ నిబంధన పెడితే బాగుంటుంది.
రైలు ఎక్కని సంవత్సరం
రైలు ప్రయాణం అంటే చిన్నప్పటినుండి అందరికీ సరదాయే. ప్రతీ ఏటా మనం కనీసం ఓ పది సార్లయినా రైలు ప్రయాణం చేస్తాము. ఉద్యోగరీత్యా ప్రయాణించేవాళ్ళు ఇంకా ఎక్కువ సార్లు రైలు ఎక్కవలసి ఉంటుంది. మన దేశంలో నూటికి తొంభయి మందికి ట్రైనే ముఖ్యమయిన ప్రయాణ సాధనం మరి!
అలాంటిది, గడిచిన 2020 సంవత్సరంలో నేను ఒక్క సారి కూడ రైలు ఎక్కలేదు. నాకు ఊహ తెలిసి గత నలభయి సంవత్సరాలలో నేను రైలు ఎక్కని సంవత్సరం ఇదే అయ్యుంటుంది. నేనే కాదు, చాలామంది భారతీయులు గత సంవత్సరం రైలు ఎక్కి ఉండరు. గత ఏడాది జనవరి ఒకటికి నేను విజయవాడలో ఉన్నాను. రెండు రోజుల తరువాత బెంగళూరు వచ్చాను. రైల్లో రిజర్వేషన్ దొరకకపోవడంవల్ల విమానంలో రావాల్సివచ్చింది. తరువాత ఫిబ్రవరిలో ఆఫీసు పని మీద గోవాకి విమానంలోనే వెళ్ళి వచ్చాను. ఇక ఆ తరువాత మార్చి నుండి ఎక్కడికీ వెళ్ళలేదు.
మార్చి నెల నుండి దేశంలో కరోనావైరస్ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. మానవజాతి మనుగడకే కామా పెట్టింది కరోనావైరస్. గత మార్చి నెలాఖరు నుండి దేశంలో రైళ్ళు ఆగిపోయాయి. బహుశా భారతీయ రైల్వే చరిత్రలో ఇలా ఎప్పుడూ జరిగి ఉండదు. తరువాత దశలవారీగా రైళ్ళని పునరుద్ధరించినా ప్రయాణికులు రైళ్ళు ఎక్కడానికి భయపడుతూనే ఉన్నారు. కొంత మంది ప్రజలు కూడ ప్రభుత్వం చెపుతున్న నియమ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రయాణిస్తున్నారు. ఆ నిర్లక్ష్యం వలన ఇతరులకే కాకుండా, వాళ్ళకు కూడ ప్రమాదమే అని గుర్తించడంలేదు.
నేను వీలైనంతవరకూ 2020 సంవత్సరం ముగిసే వరకూ ఎక్కడికీ ప్రయాణించకూడదనే అనుకున్నాను. కాని డిసెంబరులో హఠాత్తుగా రెండు సార్లు ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. భయపడుతూనే, వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, తక్కువ సమయం పడుతుందని విమానంలోనే ప్రయాణం చేసాను. రైల్లో అయితే 12 గంటలు పైగా పట్టే ప్రయాణం, విమానంలో గంటలో అయిపోతుంది కదా!
ఇప్పుడు 2021 వచ్చింది. అయినా ఇంకా రైల్లో వెళ్ళాలంటే భయంగానే ఉంది. ఈ నెలలో కూడ ఒక సారి విమానంలోనే ప్రయాణం చేసాను. ఇప్పుడు కరోనా కేసులు బాగా తగ్గాయి. అలాగే వైరస్కి టీకాలు వెయ్యటం కూడ మొదలయ్యింది కాబట్టి, బహుశా కొన్ని నెలల తరువాత రైల్లో ప్రయాణించడానికి భయపడాల్సిన అవసరం ఉండదనుకుంటున్నాను. ఏమైనా 2020 ఎన్నో వింతలు, విశేషాలతో పాటు చాలామంది రైలు ఎక్కని సంవత్సరంగా కూడ రికార్డు సృష్టించింది.